International Lefthanders Day 2021: ఈ సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరి ప్రత్యేకతను ఇట్టే గుర్తుపట్టొచ్చు. వందలో 90 మంది కుడి చేతి వాటం వాళ్లే ఉండగా, ఎడమ చేతి వాటం వాళ్లు(లెఫ్ట్ హ్యాండర్స్) చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అందుకే వీరెక్కడ కనపడినా మనం ప్రత్యేకంగా చూస్తాం. వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాం. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నడో సినీ కవి. కానీ, లెఫ్ట్ హ్యాండర్స్ గురించి ఇప్పటికీ కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ అపోహలు వాళ్లకే అనుకూలంగా ఉంటున్నాయి కూడా. ఈ తరహా లాభాన్ని సైంటిఫిక్‌గా ‘నెగటివ్ ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ సెలక్షన్’ అంటారు.
లెఫ్ట్ హ్యాండర్స్ జెనెటిక్ డిజార్డర్ అని చాలా మంది పొరపడుతుంటారు. అంతేకాదు వీళ్లు రోగ నిరోధక శక్తి సంబంధిత వ్యాధులతో త్వరగా చనిపోతారనే ఒక ప్రచారం నడిచేది అప్పట్లో. మనుషుల్లో ఎడమ చేతి వాటం ఎందుకు వస్తుందో శాస్త్రీయమైన కారణాలను నేటికీ కనుగొనలేకపోవడం విశేషం. అది పుట్టుకతోగానీ, బలవంతంగాగానీ వచ్చే అలవాటు ఎంతమాత్రం కాదు. కానీ, శరీర అంతర్నిర్మాణ పనితీరుపై ఆధారపడుతుందన్న ఒక కారణం మాత్రం చెబుతుంటారు సైంటిస్టులు. మనిషి మెదడు కుడి, ఎడమ రెండు అర్థ భాగాలుగా ఉంటుంది. కుడివైపు శరీరాన్ని మెదడు ఎడమ అర్ధ భాగం నియంత్రిస్తుంది. అలాగే ఎడమవైపు ఉండే శరీర భాగాన్ని మెదడులోని కుడి అర్థభాగం నియంత్రిస్తుంది. అంటే మెదడులోని కుడి అర్ధ భాగం బలంగా ఉన్నవారిలో ఎడమ చేతివాటం రావొచ్చనే ఒక అభిప్రాయం మాత్రం చాలామంది సైంటిస్టుల్లో ఉండగా, జెనెటిక్ ఎఫీషియన్సీ మీద కూడా ఆధారపడి ఉండొచ్చని మరికొందరు సైంటిస్టులు భావిస్తున్నారు.
వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే
ఈ భూమ్మీద ఏడు నుంచి పది శాతం జనాభా.. ఎడమ చేతి వాటం వాళ్లే ఉన్నారు. అందుకే ఒక స్పెషల్ డే ఉంది. ‘‘ఆగస్టు 13’’న జరుపుతున్నారు. 1976 నుంచి ప్రతీ ఏటా జరుపుతున్నారు. అమెరికా సైన్యంలో పని చేసిన డీన్ ఆర్ క్యాంప్‌బెల్ ఈ దినోత్సవానికి మూలం. ఈయనే లెఫ్ట్‌హ్యాండర్స్‌ఇంటర్నేషనల్ కంపెనీని స్థాపించాడు. ఈ రోజున లెఫ్టీస్ ఎదుర్కొంటున్న అసౌకర్యాలపై అవగాహన కార్యక్రమాలు, వాటిని అధిగమించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంటారు. లెఫ్టీస్ క్లబ్‌లు ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటాయి.
మాన్పించడం మంచిదేనా?
ఏడాదిన్నర నుంచి రెండేళ్ల మధ్య వయస్సులో పిల్లలు వస్తువులను పట్టుకోవడం మొదలుపెట్టినప్పుడు వాళ్లు ఎడమ? కుడి? చేతి వాటం వాళ్లు అన్నది గుర్తించవచ్చు. కానీ, కొందరు తల్లిదండ్రులు ఎడమ చేతి వాటాన్ని ఒక చెడు అలవాటుగా భావిస్తారు. బలవంతంగా ఆ అలవాటును మాన్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే అది పిల్లల మెదడుపై ప్రభావం చూపుతుందంటున్నారు మానసిక వైద్యులు. బ్రెయిన్ డిసీజ్‌లతోపాటు నత్తి, మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే దీనిని శరీర నిర్మాణ క్రమంలో భాగంగానే భావించాలి తప్పా... కీడుగా పరిగణించాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. ఎడమచేతి వాటం ఉన్నవారిని కొందరైతే పరిశుభ్రత లేనివారుగా, వింతమనుషులుగానూ చూస్తుంటారు. లెఫ్టీస్‌లో హోమో సెక్సువల్స్ ఎక్కువనే అపోహ కూడా వెస్ట్రన్ కంట్రీస్‌లో నడుస్తుంటుంది. ఈరోజుల్లో ఫర్వాలేదు కానీ.. ఒకప్పుడు మాత్రం లెఫ్టీస్ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. వాళ్లను తప్పుడు మనుషులుగా పొరపడేవాళ్లు. మంత్రగాళ్లుగా, సైతానుకి ప్రతిరూపాలుగా భావించేవాళ్లట. అదే అనుమానంతో కొందరిని చంపిన సందర్భాలూ చరిత్రలో చాలానే ఉన్నాయి.
ఐక్యూ లెవెల్
ఎడమ చేతివాటం వాళ్లను లెఫ్టీ, సినిస్ట్రాల్, సౌత్ పా, లెఫ్ట్ హ్యాండెడ్, లెఫ్ట్ హ్యాండర్ అని రకరకాలుగా పిలుస్తుంటారు. నటుడు చార్లీ చాప్లిన్, యాపిల్ కంపెనీ అధినేత స్టీవ్ జాబ్స్, మైక్రోస్టాఫ్ అధినేత బిల్ గేట్స్, అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా. మన దేశానికొస్తే.. మహాత్మా గాంధీ, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, నటుడు అమితాబ్ బచ్చాన్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, నిర్మాత కరణ్ జోహర్.. అబ్బో ఇలా చెప్పు కుంటూ పోతే లెఫ్ట్ హ్యాండ్ యూజర్ల లిస్ట్ పెద్దదే ఉంది. దీంతో ఎడమ చేతివాటం వాళ్లంతా తెలివిగలవాళ్లనే విషయం ప్రచారంలో ఉంది. అయితే కుడి చేతి వాటం వాళ్లతో పోలిస్తే లెఫ్టీస్‌లో ఐక్యూ లెవల్ నిజంగానే ఎక్కువగా ఉంటుంది. మాట్లాడే శక్తి, వేగం, సామర్ధ్యం, అర్థం చేసుకోగల శక్తిసామర్థ్యాలు, భావప్రకటనలో స్పష్టత వీరిలోనే బాగుంటాయని సైంటిస్టులు చెప్తున్నారు. మెదడులో కుడి, ఎడమ అర్ధభాగాలను అనుసంధానం చేసే ‘కార్పస్ కల్లోజమ్’ ఎడమ చేతివాళ్లలో ఎక్కువగా ఉంటుంది. వాళ్లలో బ్రెయిన్ చురుగ్గా, సమర్థవంతంగా పని చేయడానికి ఇదొక కారణమని వివరిస్తున్నారు.
యాంబీడెక్సాట్రాస్
చేతి అలవాటును పెద్దయ్యాక కూడా కొందరు స్వచ్ఛందంగా మార్చుకుంటారు. ఆ అలవాటు చాలా మంచిదంటున్నారు వైద్యులు. దీని వల్ల ఎడమ బ్రెయిన్, కుడి బ్రెయిన్‌ల మధ్య సమన్వయం పెరుగుతుందని చెప్తున్నారు. మరింత చాకచక్యంగా తమ పనులను నిర్వహించుకోవడానికి వీలుంటుంది. రెండు చేతుల్ని సమానంగా, సునాయసంగా వినియోగించుకోగలుగుతారు. వీళ్లని ‘యాంబీడెక్సాట్రాస్’ అని పిలుస్తుంటారు.
ప్రత్యేకంగా మార్కెట్
‘లెఫ్టీస్’ కష్టాలు మాములుగా ఉండవు. నిత్యం ఉపయోగించే వస్తువులు అందుబాటులో ఉండవు. కొందరు ఆ సమస్యల్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నా.. అది పూర్తి స్థాయిలో ఉండడం లేదు. అందుకే లెఫ్టీస్ కోసం ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు వెలిశాయి. అవి ప్రత్యేకంగా ఎడమ చేతి వాటం ఉన్న వాళ్లకి మాత్రమే వస్తువుల్ని అమ్ముతున్నాయి. కత్తెరలూ, కప్పులూ, పెన్నులూ, పెన్సిళ్లూ, నోటు పుస్తకాలూ... ఇంకా చాలా వస్తువుల్ని ఎడమ చేతివాటం వాళ్లకు అనుకూలంగా డిజైన్ చేస్తాయి ఆ కంపెనీలు. వంట గదిలో ఉపయోగించే కప్పులూ, గరిటెలూ, స్పూన్‌లు కూడా దొరుకుతాయి. పెన్నులు, వాచీలు, గిటార్లు ఇలా రకరకాల వస్తువులు అందుబాటులో ఉంటున్నాయి.
ఇంకా కొన్ని..
చేతులకు ఉన్నట్లే.. కాళ్ల వాటం కూడా ఉంటుంది. కుడిచేతి వాటం ఉన్నవారిలో కుడికాలి వాడకం, ఎడమచేతి వాడకం ఉన్నవారిలో ఎడమ కాలి వాడకం ఎక్కువగా కనిపిస్తుంది. ఎడమ చేతి వాటం ఉన్నవాళ్లు ఏదైనా చూడాలంటే మొదట ఎడమ కన్నుతోనే చూస్తారు. అది అసంకల్పిత చర్య. జంతువులూ, పక్షులకు కూడా ఎడమ చేతివాటం ఉంటుంది. కాబట్టి కొన్ని పక్షులకు ఎడమవైపు రెక్కలు బలంగా ఉంటాయి. కుక్కలు, చింపాంజీలు, గుర్రాలు, తిమింగలాల్లో కూడా పిండదశలోనే జన్యుపరంగా ఎడమవాటం రూపుదిద్దుకుంటుంది.
-సాక్షి, వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment