ప్రాణం పోయాక జన్యువులు బతుకుతాయట!
వాషింగ్టన్: మనిషి చనిపోయాక ఏమవుతాడు! ఇది ఎప్పుడూ వినిపించే ప్రశ్న. మనిషి చనిపోయాక శరీరం చల్లబడుతుందని, ప్రతి జీవాణువు చలనరహితమై నశించి పోతుందని, అంతా శూన్యం ఏర్పడుతుందని విజ్ఞానపరులు చెబుతారు. జీవం ఎగిరిపోయాకే మనిషి చనిపోతాడని, జీవం ఆత్మరూపంలో సంచరిస్తుందని, మరో జన్మగా అవతారం ఎత్తుతుందని కొందరు విశ్వాసకుల అభిప్రాయం. చనిపోవడం అంటే ఏమిటీ? చనిపోయిన తర్వాత మనిషిని బతికించవచ్చా ? అన్న దిశగా విజ్ఞాన జిజ్ఞాస కలిగిన శోధకులు మాత్రం నిరంతరంగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు.
చనిపోయాక కూడా మనిషి శరీరంలోని కొన్ని జన్యువులు బతికే ఉంటాయని, చనిపోయిన తర్వాతనే అవి క్రియాశీలకంగా మారుతాయని నేటి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వారు ఈ అభిప్రాయానికి రావడానికి కారణం ఎలుకలు, జీబ్రా చేప, మరికొన్ని జంతువులపై వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు రెండు ల్యాబుల్లో ఇటీవల జరిపిన పరిశోధనల్లో వెల్లడైన అద్భుత విషయాలే కారణం.
రకరకాల జంతువుల్లో 1063 జన్యువులు శరీరానికి ప్రాణం ఉన్నంతకాలం స్తబ్దుగా ఉంటాయని, చనిపోయిన తర్వాత అవి క్రియాశీలకంగా మారుతాయని వారి పరిశోధనల్లో తాజాగా తేలింది. ఇదే ప్రక్రియ మానవుల్లో కూడా కొనసాగే అవకాశం ఉందని వారు అంటున్నారు. దీనివల్ల చనిపోయిన మనిషిని బతికించలేకపోయినా, పాడై పోయిన అవయవాన్ని మార్పిడి చేసేందుకు కావాల్సినంత సమయం చిక్కుతుందన్నది వారి అభిప్రాయం.
చనిపోయిన జంతువుల్లోని ఆర్‌ఎన్‌ఏను విశ్లేషించగా ప్రాణం పోయాక వాటిలో అప్పటివరకు స్తబ్దుగా ఉన్న జన్యువులు 24 నుంచి 48 గంటల్లోగా క్రియాశీలకంకాగా, కొన్ని జంతువుల్లో రెండు, మూడు రోజుల తర్వాత కూడా క్రియాశీలకంగా మారాయని యూనివర్శిటీ పరిశోధకలు తెలిపారు. ఇవి ప్రాణి శరీరంలోని వ్యవస్థలన్నింటినీ మూసివేయడంలో భాగంగా జరుగుతుందని భావించినప్పటికీ ప్రాణం పోయాక కూడా జన్యువులు బతికి ఉండడం, అవి క్రియాశీలకంగా మారుతున్నాయని తెలియడం విశేషమని, భవిష్యత్తులో మనిషికి ప్రాణంపోసే దిశగా ఉపయోగపడే ముందడుగని వారు అంటున్నారు.