గ్రాఫీన్‌తో సరికొత్త ఇంధనం! | Periodical research | Sakshi
Sakshi News home page

గ్రాఫీన్‌తో సరికొత్త ఇంధనం!

Published Mon, Nov 12 2018 1:20 AM | Last Updated on Mon, Nov 12 2018 1:20 AM

Periodical research - Sakshi

ఏటికేడాదీ పెరిగిపోతున్న కాలుష్యానికి చెక్‌ పెట్టేందుకు స్వీడన్‌లోని లింక్‌పింగ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న పరిష్కారాన్ని సిద్ధం చేశారు. కాలుష్యకారక కార్బన్‌డైయాౖMð్సడ్‌ను నీటితో కలిపి ఎథనాల్, మీథేన్‌ వంటి ఇంధనాలను తయారు చేయవచ్చునని వీరు నిరూపించారు. రేపటితరం అద్భుత పదార్థంగా చెబుతున్న గ్రాఫీన్‌ సాయంతో తాము ఈ అద్భుతాన్ని సాధించగలిగామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జియాన్‌వూ సన్‌ తెలిపారు.

సిలికాన్, కార్బన్‌లతో తయారైన క్యూబిక్‌ సిలికాన్‌ కార్బైడ్‌కు గ్రాఫీన్‌ను పూతగా పూసినప్పుడు అది సూపర్‌ కండక్టర్‌గా వ్యవహరిస్తుందని.. ఇది కార్బన్‌డైయాక్సైడ్‌తో కూడిన నీటిని ఆక్సిజన్, హైడ్రోజన్‌లుగా విడగొడుతుందని, వీటి నుంచి మీథేన్, ఎథనాల్‌లను తయారు చేయవచ్చునని వివరించారు. ఇలాంటి సూపర్‌ కండక్టర్లతో ప్రసార సమయంలో జరిగే విద్యుత్తు నష్టాన్ని లేకుండా చేయవచ్చునని జియాన్‌వూ సన్‌ అంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూపర్‌ కండక్టర్లు అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల్లో మాత్రమే పనిచేస్తూండగా.. కొత్తవి మాత్రం సాధారణ ఉష్ణోగ్రతల్లోనూ పనిచేస్తాయని తెలిపారు.

జన్యువులకు.. దీర్ఘాయుష్షుకు సంబంధం లేదు!
వినడానికి కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుందిగానీ.. జన్యువులకు, దీర్ఘాయుష్షుకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు కాలికో లైఫ్‌ అనే కంపెనీ శాస్త్రవేత్తలు. దాదాపు 40 కోట్ల మందితో కూడిన  వంశవృక్షాలను పరిశీలించి మరీ తాము ఈ అంచనాకు వచ్చామని అంటున్నారు ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త గ్రాహం రూబీ! జన్యువులతో చాలా విషయాలు తెలుస్తాయన్నది నిజమేనని.. కాకపోతే ఆయుష్షుకు మాత్రం ఇది వర్తించదని రూబీ అంటారు.

జన్యుమార్పుల ఆధారంగా తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే ఆయుష్షు 15 – 30 శాతం మాత్రమేనని గతంలోనే లెక్కకట్టారు. జీవనశైలి, సామాజిక, సాంస్కృతిక కారణాలు, ప్రమాదాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకోకుండా లెక్కించడం ద్వారా ఈ అంచనా ఏర్పడింది. తాజా అధ్యయనంలో కాలికో రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు ఆన్‌సిస్ట్రీ వెబ్‌సైట్‌లోని అమెరికా, యూరప్‌లకు చెందిన 40 కోట్ల మంది వివరాలను విశ్లేషించారు. ఒకే కుటుంబం.. ఇంటిపేరున్న వారిలో ఎవరి ఆయుష్షు ఎంత? అన్నది లెక్కకట్టింది. ఇది ఏడు శాతం కూడా లేదని స్పష్టమైంది. మొత్తమ్మీద చూస్తే  ఆయుష్షుకు.. మన జన్యువులకు అస్సలు సంబంధం లేదన్నది ఈ అధ్యయనం సారాంశం.

సెల్‌ఫోన్‌తో హెచ్‌ఐవీని గుర్తించవచ్చు!
మనిషిని నిలువునా నిర్వీర్యం చేసేసే హెచ్‌ఐవీని ఎంత వేగంగా గుర్తిస్తే అంతమేలన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పటివరకూ ఉన్న పద్ధతులతో ఇది అసాధ్యం. అందుకే బ్రైగమ్‌ అండ్‌ విమెన్స్‌ హాస్పిటల్‌ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. అందరి చేతుల్లో ఉండే మొబైల్‌ఫోన్‌ సాయంతో పనిచేసే ఈ సరికొత్త టెక్నాలజీ.. చుక్క రక్తంతోనే హెచ్‌ఐవీ వ్యాధి ఉన్నదీ లేనిదీ స్పష్టం చేసేస్తుంది. ప్రస్తుతం ఖరీదైన పాలిమరేస్‌ చెయిన్‌ రియాక్షన్‌ సాయంతో హెచ్‌ఐవీ వైరస్‌ను గుర్తిస్తున్నారు.

బ్రైగమ్‌ శాస్త్రవేత్తలు నానోటెక్నాలజీ సాయంతో ఓ మైక్రోప్రాసెసర్, మొబైల్‌ఫోన్‌ ద్వారా వైరస్‌ తాలూకూ ఆర్‌ఎన్‌ఏ న్యూక్లియిక్‌ యసిడ్లను గుర్తించే ఓ వ్యవస్థను సిద్ధం చేశారు. త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో తయారైన ఓ యంత్రాన్ని మొబైల్‌ఫోన్‌కు అనుసంధానించుకుని చుక్క రక్తం వేస్తే సరి.. 99.1 శాతం కచ్చితత్వంతో హెచ్‌ఐవీ వైరస్‌ను గుర్తించవచ్చు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీని ఇతర వైరస్, బ్యాక్టీరియా గుర్తింపునకూ ఉపయోగించవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త షఫీ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement