జన్యులోపాలతో కొన్ని వ్యాధులొస్తాయి.. కొన్ని జన్యువులు సరిగా పనిచేస్తే ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు! ఇవి మనకు తెలిసిన విషయాలే గానీ.. జన్యువులను కచ్చితంగా మనకు కావాల్సినట్లు ఆన్.. ఆఫ్ చేయగల పరిజ్ఞానం లేకపోవడం వల్లనే ఇప్పటికీ వ్యాధులు కొనసాగుతున్నాయి. త్వరలోనే పరిస్థితి మారనుంది అంటున్నారు నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త జూలియస్ లక్స్. తన బృందంతో కలసి ఇటీవలే జన్యువులను ప్రకృతి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ కచ్చితంగా ఆన్.. ఆఫ్ చేయగల ఓ పరికరాన్ని రూపొందించారు.
ఈ పరికరం పేరు స్మాల్ ట్రాన్స్‌క్రిప్షన్ యాక్టివేటింగ్ ఆర్‌ఎన్‌ఏ (స్టార్). మన కణాల్లోని డీఎన్‌ఏ మాదిరిగా ప్రతి కణంలోనూ రైబోన్యూక్లియిక్ యాసిడ్ (ఆర్‌ఎన్‌ఏ) ఉంటుంది. దాదాపు 60 రకాల ఆర్‌ఎన్‌ఏలు వేర్వేరు పనులు చేస్తుంటాయని అంచనా. మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ డీఎన్‌ఏలోని సమాచారాన్ని మోసుకెళ్తే.. ట్రాన్స్‌ఫర్ ఆర్‌ఎన్‌ఏకు మరో ప్రత్యేకమైన పని ఉంటుంది. ఈ ఆర్‌ఎన్‌ఏ పోగుల్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా అవి జన్యువులను ఆన్.. ఆఫ్ చేసేలా చేయగలిగారు.
జన్యువుల పనితీరులో సహజ సిద్ధంగా మార్పులు వచ్చేందుకు అవకాశమున్నా వాటి ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది. జూలియస్ అభివృద్ధి చేసిన ఆర్‌ఎన్‌ఏ మాత్రం అలా కాదు. సహజసిద్ధ మార్పుల కంటే దాదాపు 8000 రెట్లు ఎక్కువ సమర్థమైంది. వ్యాధుల గురించి తెలుసుకునేందుకు, మెరుగైన చికిత్సలు అందించేందుకు ఈ స్టార్ ఆర్‌ఎన్‌ఏ ఎంతో ఉపయోగపడుతుందని జూలియస్ అంటున్నారు. పరిశోధన వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ సంచికలో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment