
నా వయసు 21 ఏళ్లు. డిగ్రీ చదువుకుంటున్నాను. నా ఎత్తు ఐదడుగుల మూడు అంగుళాలు మాత్రమే. నా ఫ్రెండ్స్ అందరూ నాకంటే అంతో ఇంతో ఎత్తుగా ఉన్నవారే. దాంతో ఎంతో ఆత్మన్యూనతకు గురవుతున్నాను. ఎలాగైనా పొడువు పెరగాలని ఉంది. టీవీల్లో ఎత్తు పెంచే అడ్వరై్టజమెంట్లు చూస్తున్నాను. ఆ ప్రకటనల్లో చూపించే మందులు వాడటం ఎత్తు పెరుగుతానా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.
మీ వయసులో ఉన్న వారి ఫీలింగ్స్ అలాగే ఉంటాయి. మీ వయసులో ఇలా అందరితోనూ పోల్చుకుంటూ ఉంటారు. ఐదడుగుల మూడు అంగుళాలంటే మీరు కాస్తంత రీజనబుల్ ఎత్తు ఉన్నట్లే అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది మీకంటే కూడా పొట్టిగా ఉంటారు. పొడవునకు సంబంధించిన జన్యువులు తల్లిదండ్రుల నుంచి వస్తాయి. అయినప్పటికీ ఇందుకు ఎవరూ బాధ్యులు కాదు. ఎందుకంటే ఒక్కోసారి తల్లిదండ్రుల ఎత్తు కాకుండా తాతముత్తాతల ఎత్తు కూడా పిల్లలకు రావచ్చు. అప్పుడు తల్లిదండ్రులు మామూలు ఎత్తులో ఉన్నా తాతముత్తాతల పొట్టిదనమూ పిల్లలకు రావచ్చు. ఇక దాంతోపాటు తినే ఆహారంలోని పోషకాలూ పిల్లల ఎత్తు పెరగడానికి దోహదం చేసే విషయమూ వాస్తవమే.
అయితే ఎముకల చివర్లలో ఉండే గ్రోత్ ప్లేట్లలో పొడుగు పెరిగే అంశం వాళ్ల పదహారేళ్ల నుంచి పద్ధెనిమిదేళ్ల వయసులో ఆగిపోతుంది. మీరు మూడేళ్ల కిందటే ఆ వయసు దాటిపోయారు కాబట్టి దీని గురించి అస్సలు ఆలోచించకండి. మీ దృష్టినంతా చదువుపై కేంద్రీకరించండి. ఇక ఎత్తు పెంచుతామంటూ టీవీల్లో వచ్చే ప్రకటనల్లో కనిపించేవన్నీ ఏమాత్రం ప్రయోజనం ఇవ్వని వాణిజ్యపరమైన ఉత్పాదనలు మాత్రమే. వాటితో ఎత్తు పెరగడం అసాధ్యం. మీరు ఇప్పుడున్న ఎత్తు భారతీయ ప్రమాణాల ప్రకారం మీరు మంచి హైటే. కాబట్టి ఇలాంటి బోగస్ వాణిజ్య ప్రకటనలు చూసి మోసపోకండి.
Comments
Please login to add a commentAdd a comment