ఈ స్కూటర్‌ను నడపాల్సిన అవసరం లేదు! | Periodical research | Sakshi
Sakshi News home page

ఈ స్కూటర్‌ను నడపాల్సిన అవసరం లేదు!

Published Wed, May 30 2018 1:07 AM | Last Updated on Wed, May 30 2018 1:07 AM

Periodical research - Sakshi

ముందుగా కార్లు అన్నారు.. ఆ తరువాత లారీలు వచ్చేశాయి... మేమేం తక్కువ తిన్నామా? అని విమానాలూ రంగంలోకి దిగాయి. తాజాగా డ్రైవర్‌ లేదా డ్రైవింగ్‌ అవసరం లేని స్కూటర్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఫొటోలో కనిపిస్తున్నది అదే.  ఏబీ డైనమిక్స్‌ అనే సంస్థ తయారు చేసింది దీన్ని. బీఎండబ్ల్యూ సీ1 స్కూటర్‌కు కాస్తా మార్పులు చేసి డ్రైవర్‌ అవసరం లేనిదానిగా మార్చారు.

రోడ్డును, ట్రాఫిక్‌ను గమనించేందుకుబోలెడన్ని సెన్సర్లు, చక్రాలు ఒరిగిపోకుండా ఉండేందుకు కొన్ని ప్రత్యేకమైన ఔట్‌ రిగ్గర్లు దీంట్లో ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. విషయం చాలా సింపుల్‌. ఈ బైక్‌ ప్రత్యేకంగా నడపాల్సిన అవసరం లేదు. సీట్లో కూర్చోవడం మాత్రమే మనం చేయాల్సిన పని. గేర్లు మార్చడం మొదలుకొని యాక్సలరేటర్‌ను నియంత్రించడం వరకూ అన్ని పనులను కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ చేసుకుంటుంది.

  ఇటీవల జరిగిన పరీక్షల్లో ఈ స్కూటర్‌ అన్ని రకాలుగా విజయవంతమమైనట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అతితక్కువ వేగంలోనూ తనను తాను సంభాళించుకుంటూ చక్కర్లు కొట్టడమే కాకుండా తనకంటే ముందు వెళుతున్న వాహనాలను అతి జాగ్రత్తగా ఓవర్‌ టేక్‌ చేసింది కూడా. కారులాంటి నిర్మాణం కారణంగా తాము అన్ని రకాల సెన్సర్లను అక్కడ ఏర్పాటు చేయగలిగామని కంపెనీ ప్రతినిధి రిచర్డ్‌ సింప్సన్‌ చెప్పారు.

ఉమ్మనీటిలో తేడాలతో బిడ్డలో మానసిక సమస్యలు!
గర్భంలో ఉండగా ఉమ్మనీటిపై పర్యావరణ లేదా ఇతర ఒత్తిళ్లు పడితే పుట్టబోయే బిడ్డకు పలు నాడీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముందని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేస్తోంది. స్క్రిజోఫ్రేనియా వంటి మానసిక సమస్యల మూలాలు తెలుసుకునేందుకు ‘లైబర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ బ్రెయిన్‌ డెవలప్‌మెంట్‌’ శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాల్లో ఈ విషయం తెలిసింది.

ఈ వ్యాధికి ఇప్పటికే కొన్ని జన్యుపరమైన కారణాలు ఉన్నట్లు స్పష్టమైనప్పటికీ గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఉమ్మనీరు కూడా ప్రభావం చూపుతుందని తెలియడం ఇదే తొలిసారి. గర్భధారణ సమయంలో వచ్చే ఇబ్బందుల వల్ల ఉమ్మనీటిలో కొన్ని జన్యువులు చైతన్యవంతమై బిడ్డ మెదడు ఎదుగుదుల పనితీరుపై ప్రభావం చూపుతోందని ఫలితంగానే స్క్రిజోఫ్రేనియా వంటి సమస్యలు ఎదురవుతున్నట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వెయిన్‌బర్గ్‌ తెలిపారు.

ఈ జన్యుమార్పులు కూడా ఆడ పిండాల కంటే మగ పిండాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని మగాళ్లలో ఈ సమస్య రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఎందుకు ఉంటోందనేందుకు ఇదే కారణం కావచ్చునని వివరించారు. గర్భం దాల్చినప్పుడు ఉమ్మనీటి పరిస్థితిపై మరింత జాగ్రత్త వహించేందుకు తద్వారా శిశువుల్లో నాడీ సంబంధిత సమస్యలు ఎదురు కాకుండా చూసుకునేందుకు తమ అధ్యయనం పనికొస్తుందని వెయిన్‌బర్గ్‌ అంచనా వేస్తున్నారు.


సముద్రపు ప్లాస్టిక్‌ టీషర్ట్‌ అయింది!
ప్లాస్టిక్‌ చెత్త సమస్యను అధిగమించేందుకు బోలెడంతమంది బోలెడన్ని ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్లాస్టిక్‌ చెత్తను ఇంధనంగా మార్చే ప్రయత్నం చేస్తూంటే ఇంకొందరు టీషర్ట్‌లు తయారు చేస్తున్నారు. ఫొటోలో కనిపిస్తున్నది అదే. కాకపోతే దీన్ని అంతర్జాతీయ కంపెనీ అడిడాస్‌ తయారు చేసింది. మాంఛెస్టర్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆటగాళ్లు ఇకపై దీన్ని వాడనున్నారు.

సముద్రాల్లోకి చేరిపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైకిల్‌ చేసి వీటిని తయారు చేస్తూండటం విశేషం. ప్రజల్లో ప్లాస్టిక్‌ సమస్యపై అవగాహన మరింత పెరిగేందుకు తమ ఆవిష్కరణ ఉపయోగపడుతుందని అడిడాస్‌ అంటోంది. ఈ ఏడాది అమెరికాలో జరిగే టోర్నీలో తొలిసారి క్రీడాకారులు ఈ రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌ టీషర్ట్‌లను వాడతారని చెప్పారు. అడిడాస్‌ ఇలా ప్లాస్టిక్‌ చెత్తతో కొత్త ఉత్పత్తులను తయారు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అందమైన కాలిజోళ్లను తయారు చేసిన విషయం తెలిసిందే. రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌ షూలు, వస్త్రాలు మీకూ కావాలా? అడిడాస్‌ వెబ్‌సైట్‌ నుంచి నేరుగా కొనుగోలు చేయవచ్చు. కాకపోతే కాస్తా ఖరీదు ఎక్కువగా ఉండే అవకాశముంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement