Genome Variations
-
నాలుగైదేళ్లలో జన్యుసవరణ జొన్నలు, రాగులు!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: చిరుధాన్య వంగడాల అభివృద్ధికి జన్యు సవరణ (జీనోమ్ ఎడిటింగ్) సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్) డెప్యూటీ డైరెక్టర్ జనరల్ (క్రాప్ సైన్స్) డాక్టర్ టి. ఆర్. శర్మ వెల్లడించారు. అంతర్జాతీయ చిరుధాన్య సమ్మేళనం 5.0 ముగింపు ఉత్సవంలో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన శర్మ ‘సాక్షి సాగుబడి’తో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. పోషకాల నాణ్యతను పెంపొందించడానికి, ‘యాంటీ న్యూట్రియంట్ల’ను పరిహరించడానికి జొన్న, రాగి విత్తనాలకు జన్యు సవరణ ప్రక్రియ చేపట్టినట్లు డా. శర్మ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చిరుధాన్యాలపై గతంలో పెద్దగా పరిశోధనలు జరగనందున జన్యుసవరణ కష్టతరంగా మారిందన్నారు. అందువల్ల జన్యు సవరణకు ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉందన్నారు. ఈ పరిశోధనలు శైశవ దశలో ఉన్నాయని, ఈ వంగడాలు అందుబాటులోకి రావటానికి 4–5 ఏళ్ల సమయం పడుతుందన్నారు. మెరుగైన చిరుధాన్యాల వంగడాల అభివృద్ధి దిశగా ఇప్పటికే గణనీయమైన అభివృద్ధి సాధించామని, ఈ కృషిలో భాగంగానే జన్యు సవరణ(జీనోమ్ ఎడిటింగ్) సాంకేతికతను కూడా చేపట్టామన్నారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో రానున్న కాలంలోనూ చిరుధాన్యాల ప్రోత్సాహానికి సంబంధిత వర్గాలందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సమ్మేళనంలో వివిధ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి, రానున్న పదేళ్లలో చిరుధాన్యాల అభివృద్ధికి చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికను త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆహార, పౌష్టికాహార భద్రత కోసం పర్యావరణ అనుకూల సుస్థిర వ్యవసాయ పద్ధతులను ఐసిఏఆర్ ప్రోత్సహిస్తోందన్నారు. ఆహార వ్యవస్థలో సంబంధితులందరూ పరస్పరం సహకరించుకుంటూ చిరుధాన్యాలను ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకురావాలని డా. శర్మ సూచించారు. (చదవండి: చిరుధాన్యాలు నిరుపేదలకూ అందాలి!) -
ఆధునిక మానవుని పుట్టుకపై అధ్యయనం..మనది ఒకే మూలం కాదట
ఆధునిక మానవుని మూలాలు ఎక్కడున్నాయి? ఆఫ్రికా అన్నది అందరూ చెప్పే సమాధానం. తొలి మానవులు అక్కడే పుట్టి, అక్కణ్నుంచే ప్రపంచమంతా వ్యాపించారని దశాబ్దాలుగా వింటూ వస్తున్నాం కూడా. అంతవరకూ నిజమే అయినా మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామన్న సిద్ధాంతం మాత్రం తప్పంటోంది ఓ తాజా అధ్యయనం. మన మూలాలు ఆఫ్రికాలోని కనీసం రెండు విభిన్న జాతుల్లో ఉన్నాయని చెబుతోంది. కనుక ఆధునిక మానవుని జన్మస్థలం ఫలానా అంటూ ఇదమిత్థంగా తేల్చి చెప్పలేమన్నది దాని సారాంశం.. మన ఆవిర్భావానికి ఒకే మూలమంటూ లేదని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. 10 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికావ్యాప్తంగా ఉనికిలో ఉన్న పలు ఆదిమ మానవ జాతులు హోమోసెపియన్గా పిలిచే ఆధునిక మానవుని పుట్టుకకు కారణమని అంటోంది. ‘‘ఆ కాలంలో ఆఫ్రికాలో నివసించి, క్రమంగా ఆ ఖండమంతటా వ్యాపించి పరస్పరం కలిసిపోయిన కనీసం రెండు ఆదిమ జాతులు మన ఆవిర్భావానికి మూలం. ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారి జన్యు డేటాను లోతుగా పరిశోధించిన మీదట ఈ నిర్ణయానికి వచ్చాం’’ అని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు చెబుతున్నారు. దీని వివరాలను జర్నల్ నేచర్‌లో ప్రచురించారు. ‘‘మన ఆవిర్భావానికి కారకుడైన ఆదిమ మానవులు ఒకే జాతికి చెందిన వారని మానవ వికాసంపై దశాబ్దాలుగా జరిగిన పరిశోధనల్లో చాలావరకు చెప్పుకొచ్చాయి. వారు ఆఫ్రికాలో తొలుత చెట్లపై నివసించి, అనంతరం క్రమంగా నేల మీదికి దిగారన్నది వాటి సారాంశం. కానీ ఆఫ్రికావ్యాప్తంగా మానవ ఆవాసాలకు సంబంధించిన శిలాజ, పురాతత్వ రికార్డులు ఈ వాదనతో సరిపోలడం లేదు. ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో సంచరించిన ఒకటికి మించిన ఆదిమ జాతులు వేలాది ఏళ్లపాటు పరస్పర వలసలు తదితరాల ద్వారా కలగలిసిపోయి క్రమంగా ఆధునిక మానవుని ఆవిర్భావానికి దారితీశాయన్నది మా పరిశోధనలో తేలింది. హేతుబద్ధంగా ఆలోచించినా ‘ఒకే మూలం’ సిద్ధాంతం కంటే ఇదే సమంజసంగా తోస్తోంది కూడా’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా జెనెటిసిస్ట్ డాక్టర్ బ్రెన్నా హెన్ వివరించారు. ఆ ఆధారాలే ఉంటేనా...! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరి మూలాలూ కచ్చితంగా 10 లక్షల ఏళ్ల నాటి ఈ రెండు ఆదిమ జాతుల్లోనే ఉన్నట్టు కచ్చితంగా చెప్పగలమని బృందం సభ్యుడైన విస్కాన్సిన్–మాడిసన్ వర్సిటీ పాపులేషన్ జెనెటిసిస్ట్ ఆరన్ రాగ్స్డేల్ అంటున్నారు. ఎలా చూసినా మనందరి జన్మస్థానం ఆఫ్రికా లోని ఒకే ప్రాంతమన్న వాదనకు కాలం చెల్లినట్టేనని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘కాకపోతే 10 లక్షల ఏళ్ల నాటి మానవ శిలాజ తదితర జన్యు ఆధారాలేవీ ఇప్పటిదాకా మనకు దొరకలేదు. లేదంటే ఆధునిక మానవుని (హోమోసెపియన్) ఆవిర్భావం, విస్తరణ తదితరాలపై ఈ పాటికే మరింత స్పష్టత వచ్చేది’’ అన్నారాయన. ఇలా చేశారు... డాక్టర్ హెన్ సారథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశల్లోని ప్రఖ్యాత సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. ఆఫ్రికాలోని పలు ప్రాంతాలకు చెందిన 290 మంది జన్యు అమరికను వారు లోతుగా విశ్లేషించారు. దాంతోపాటు ఆఫ్రికాలో ఉన్న భిన్న జాతుల వారి డీఎన్ఏను ఇందుకు ఎంచుకున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో సియెరా లియోన్‌లో నివసించే మెండే రైతు జాతి, ఇథియోపియాలో ఆదిమ వేటగాళ్ల నుంచి రూపాంతరం చెందిన గుముజ్ జాతి, అమ్హరాగా పిలిచే అక్కడి రైతులతో పాటు నమా అనే దక్షిణాఫ్రికాలోని వేటగాళ్ల సంతతి నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించారు. వాటిలోని వైవిధ్యాన్ని బట్టి లక్షల ఏళ్ల క్రితం ఆ డీఎన్ఏలు ఎలా ఉండేవో, ఇన్నేళ్ల పరిణామక్రమంలో ఏ విధంగా మారుతూ వచ్చాయో అత్యాధునిక సాఫ్ట్వేర్ ఆధారంగా సిమ్యులేషన్ విధానంలో ఆవిష్కరిస్తూ వచ్చారు. ఇప్పటిదాకా లభించిన అతి పురాతన మానవ శిలాజం (3 లక్షల ఏళ్ల నాటిది) ఆఫ్రికాకు చెందినదే. అంతేగాక అతి పురాతన రాతి పనిముట్లు కూడా అక్కడే దొరికాయి. ప్రధానంగా ఈ రెండింటి ఆధారంగానే ఆఫ్రికానే మన జన్మస్థానమని గత అధ్యయనాల్లో చాలావరకు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆఫ్రికావాసుల డీఎన్ఏను బ్రిటిష్ వారి డీఎన్ఏతోనూ, క్రొయేషియాలో దొరికిన దాదాపు 50 వేల ఏళ్ల నాటి మన పూర్వీకుడైన నియాండర్తల్ మానవుని డీఎన్ఏతోనూ పోల్చి చూశారు. ఆఫ్రికావ్యాప్తంగా ఒకటికి మించిన ఆదిమ జాతులు వేల ఏళ్ల క్రమంలో తమలో తాము కలిసిపోయిన ఫలితంగానే మనం పుట్టుకొచ్చామని తేల్చారు. కనీసం రెండు ప్రధాన ఆదిమ జాతులు మన ఆవిర్భావానికి మూల కారకులని డాక్టర్ హెన్ సూత్రీకరించారు. వాటికి స్టెమ్1, స్టెమ్2గా పేరు పెట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పరిగణించదగ్గ ‘పశ్చాత్తాపం’
గతానికీ, వర్తమానానికీ జరిగే అనంతమైన సంభాషణే చరిత్ర అంటాడు చరిత్రకారుడు ఇ.హెచ్ కార్. చరిత్రలో జరిగిన తప్పిదాలను మార్చలేం. ఆనాటి ఘటనలకు కొత్త రంగు పులమలేం. కానీ తప్పిదాలకు కారకులైన వ్యక్తులైనా, దేశాలైనా, సంస్థలైనా పశ్చాత్తాపపడి క్షమాపణ కోరటం నాగరిక లక్షణం. అమెరికాకు చెందిన జన్యు శాస్త్రవేత్తల బృందం రెండురోజుల క్రితం ఈ పనే చేసింది. తమ వల్లా, తమ మౌనం వల్లా చరిత్రలో జరిగిపోయిన ఘోర తప్పిదాలకు పశ్చాత్తాపపడింది. క్షమాపణ చెప్పింది. అమెరికన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ జెనెటిక్స్(ఏఎస్‌హెచ్‌జీ) జన్యు శాస్త్రవేత్తలకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ. 8,000 మంది సభ్యులుండే ఈ సంస్థ విడుదల చేసిన 27 పేజీల నివేదిక చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. సంస్థ నియమించిన నిపుణుల కమిటీ ఈ నివేదికను రూపొందించింది. పాత రికార్డులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వివిధ సందర్భాల్లో సభ్యులు చేసిన ప్రకటనలనూ, కళ్ల ముందు ఘోరాలు జరుగుతున్నా తమ శాస్త్రవేత్తలు ఉదాసీనంగా ఉండిపోయిన వైనాన్నీ ఈ నివేదిక బయటపెట్టింది. జంతువుల్లోనూ, ధాన్యాల్లోనూ మేలు జాతి రకాలున్నట్టే మనుషుల్లో కూడా వేర్వేరు తరగతుల వారుంటారని, జన్యుపరమైన ఎంపికల ద్వారా ‘అధమ’ రకం వారిని ‘నిరోధిస్తే’ ‘శ్రేష్ఠ మానవజాతి’ రూపొందుతుందని కొందరు ప్రబుద్ధులు 19వ శతాబ్దంలో ప్రతిపాదించారు. ప్రకృతిలో జరిగే పరిణామక్రమానికి ‘సహజ ఎంపిక’ అనే పద్ధతి ఉంటుందని, అన్ని రకాల పరిస్థితులనూ తట్టుకుని నిలబడగలిగే శక్తిమంతమైన జీవులు మాత్రమే మనుగడలో ఉంటాయని డార్విన్ చేసిన ప్రతిపాదన అలాంటివారికి ఆయుధమైంది. దీన్నుంచే శ్రేష్ఠ మానవాభివృద్ధి శాస్త్రం(యుజెనిక్స్) పుట్టుకొచ్చింది. బ్రిటన్‌లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరున్న ఫ్రాన్సిస్ గాల్టన్ 1883లో ఈ యుజెనిక్స్కు ఊపిరిపోశాడు. యూరోపియన్లలో ఆనాడు ప్రబలంగా ఉన్న ఆధిపత్య భావజాలంలో నుంచి, సాంస్కృతిక భయాందోళనల నుంచి ఈ సిద్ధాంతం పుట్టి ఆ రెండింటినీ మరిన్ని రెట్లు పెంచింది. వేరే జాతుల సంపర్కం తమ జాతి ఉన్నతిని దెబ్బతీస్తుందని శ్వేతజాతీయులు వణికిపోయారు. జన్యు శాస్త్రంలో వెల్లడవుతున్న అంశాల్లో తమకు అనుకూలమైనవి మాత్రమే వెల్లడిస్తూ, ప్రతికూల అంశాలను బయటకు రానీయకపోవడం ద్వారా శాస్త్రవేత్తలు సైతం దీనికి దోహదపడ్డారు. అమెరికాలో నల్లజాతీయులను అధములుగా చిత్రించి, వారిని బానిసలుగా వినియోగించుకోవటానికీ, వారిపై దుర్మార్గాలను కొనసాగించటానికీ యుజెనిక్స్ దోహదపడింది. నాజీ జర్మనీలో దీన్ని అడ్డం పెట్టుకుని యూదులపై సాగించిన దౌష్ట్యం అంతా ఇంతా కాదు. అక్కడ వేలాదిమందికి సంతాన నిరోధ శస్త్రచికిత్సలు చేయించటం, లక్షలమంది ప్రాణాలు బలిగొనడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. నిజానికి అంతకు చాలా ముందు నుంచే అమెరికాలోనూ ఈ మాదిరి ఉన్మాదమే ఉంది. వివిధ రాష్ట్రాల్లో వేలాదిమంది శ్వేతేతర జాతివారికి, మానసిక రోగులకూ, నేరస్థులకూ ‘చట్టబద్ధం’గా బలవంతపు శస్త్రచికిత్సలు చేశారు. 1926లో ఆవిర్భవించిన ఏఎస్‌హెచ్‌జీ దీన్నంతటినీ సరిదిద్ది జన్యుశాస్త్రానికి విశ్వసనీయత కలిగించాల్సివుండగా అది గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. కొన్నిసార్లు కళ్లముందు జరిగే దుర్మార్గాలను ప్రోత్సహించేలా మాట్లాడింది. జన్యు శాస్త్రంతో సంబంధంలేని సైకాలజిస్టు ఆర్థర్ జెన్సన్, భౌతిక శాస్త్రవేత్త విలియం షాక్లీ వంటివారు నల్లజాతీయులు తమ జన్యువుల వల్ల మే«ధాపరంగా అధములని చెప్పినా సంస్థ నోరెత్తలేదు. పరిశోధనల పేరుతో అనైతిక నిర్ధారణలు చేస్తున్నా మౌనంగా ఉండిపోయింది. తమ నిర్వాకం, నిర్వా్యపకత్వం పెను తప్పిదమని ఏఎస్‌హెచ్‌జీ ఇప్పుడు అంగీకరించటం విశేషం. అంతేకాదు...శ్రేష్ఠ జాతి సిద్ధాంతం చాటున సంతాన నిరోధ శస్త్ర చికిత్సలు దండిగా ప్రోత్సహించిన విలియం అలన్ పేరిట ఉన్న అత్యున్నత పురస్కారం పేరును మార్చబోతున్నట్టు ప్రకటించింది. జన్యు శాస్త్రంలో విశేష కృషి చేసినవారికి ఏటా ఈ పురస్కారం ఇస్తున్నారు. రెండు దశాబ్దాలనాడు మానవ జన్యు ప్రాజెక్టు ప్రపంచ జనాభాలో 99.9 శాతం మంది ఒకే రకమైన జన్యు పదార్థం కలిగివున్నారని తేల్చిచెప్పింది. అయినప్పటికీ జాతిపరమైన ఆధిపత్య భావజాలం ప్రపంచంలో ఇప్పటికీ ప్రబలంగానే ఉంది. మన దేశంలో కుల మతాల్లో అది వ్యక్తమవుతుండగా అమెరికా, యూరప్‌లలో రంగు ప్రాధాన్యం పొందుతోంది. ‘మా బ్రీడ్ వేరు...మా బ్లడ్ వేరు’ అంటూ విర్రవిగేవారికీ, మా మతం అత్యున్నతమైనదని భుజాలు చరుచుకునేవారికీ మన దగ్గర కొదవలేదు. తమది అగ్రవర్ణమని, ఇతరులు అధములనుకునే అజ్ఞానులు ఈనాటికీ దండిగా తారసపడుతుంటారు. ఆ సంగతలా ఉంచి శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించాల్సిన ఏఎస్‌హెచ్‌జీ వంటివి ఎందుకు విఫలమయ్యాయి? సంస్థాగత నిర్మాణాల్లో వైవిధ్యానికి చోటీయకపోవటమే ఈ దుర్గతికి కారణం. ఉదాహరణకు ఏఎస్‌హెచ్‌జీ డైరెక్టర్ల బోర్డులో మైనారిటీ జాతులవారు 2017 నాటికి కేవలం 5 శాతం మంది మాత్రమే. అనంతరకాలంలో ఆత్మవిమర్శ చేసుకున్నాక 2021నాటికి అది 40 శాతానికి పెరిగింది. ఆ తర్వాతే మైనారిటీ జాతుల శాస్త్రవేత్తలకు శిక్షణ కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించటం మొదలైంది. మన దేశంలో ఉన్నతాధికారగణంలో, మీడియాలో ఇప్పటికీ ఆధిపత్య కులాలకే ప్రాధాన్యం ఉంటున్నదని ఇటీవల ఒక సర్వేలో వెల్లడైంది. ఇలాంటివి సరిదిద్దనంతకాలం వికృత పోకడలు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే ఏఎస్‌హెచ్‌జీ పశ్చాత్తాప ప్రకటన అన్ని దేశాల్లోనివారికీ కనువిప్పు కావాలి. -
అన్ని జీవుల జన్యుగుట్టు తేల్చే ప్రాజెక్ట్!
మెల్బోర్న్: ప్రపంచంలోని ప్రతి సంక్లిష్ట జాతి జన్యువుల లోగుట్టును విశదీకరించే భారీ ప్రాజెక్టు పూర్తైతే జీవశాస్త్రంలో సంచలనాలు చూడవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పదేళ్లలో దాదాపు 18 లక్షల స్పీసిస్ (ప్రజాతులు) జీనోమ్ సీక్వెన్సింగ్ చేసే ద ఎర్త్ బయోజీనోమ్ ప్రాజెక్ట్ (ఈబీపీ)కు 2018లో శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు లక్ష్యాలు, పురోగతి తదితర వివరాలను మంగళవారం సైన్స్ జర్నల్స్‌లో ప్రచురించారు. ఈ ప్రాజెక్టు పూరై్తతే ఇంతవరకు జరిగిన బయోలాజికల్ రీసెర్చ్ రూపురేఖలు మారతాయి. విశేషాలు.. ► ఈ ప్రాజెక్టులో 22 దేశాలకు చెందిన 44 సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. సుమారు 5వేల మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు. ► ప్రాజెక్టుకు దాదాపు 470 కోట్ల డాలర్ల వ్యయమవుతుందని అంచనా. ► సంక్లిష్ట జీవులు ఎలా ఉద్భవించాయి? జీవ వైవిధ్యత ఎలా మనుగడ సాగిస్తోంది? తదితర ప్రశ్నలకు సమాధానాలు ఈ ప్రాజెక్టుతో లభిస్తాయని అంచనా. ► హ్యూమన్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ ప్రేరణతో 2016లో ఈబీపీని ప్రతిపాదించారు, 2018 నవంబర్‌లో అధికారికంగా ప్రారంభించారు. ► ప్రతి కుటుంబం (టాక్జానమీలో ఫ్యామిలీ) నుంచి కనీస ఒక్క జీనోమ్ సీక్వెన్సింగ్‌ను తొలిదశలో పూర్తి చేయాలని సంకల్పించారు. ► రెండోదశలో సుమారు 1.8లక్షల జాతుల సీక్వెన్సింగ్ చేస్తారు, మూడోదశలో అన్ని జీవుల సీక్వెన్సింగ్ పూర్తవుతుంది. ► ఏకకణ జీవుల నుంచి మానవుల వరకు భూమిపై ఉన్న అన్ని జీవుల జీనోమ్ సీక్వెన్సింగ్ ఈ ప్రాజెక్టులో పూర్తి చేస్తారు. అంటే దాదాపు ప్రతి ప్రాణి జన్యు గుట్టును ఈ ప్రాజెక్టు బహిర్గతం చేస్తుంది. ► దీనివల్ల భవిష్యత్‌లో వైద్య, ఫార్మా రంగాల్లో ఊహించని పురోగతి సాధించవచ్చని పరిశోధకుల అంచనా. -
కరోనా వైరస్: వామ్మో! డబుల్ కాదు.. ట్రిపుల్..!
ఢిల్లీ: భారత్‌లో రోజు నమోదవుతున్న కరోనా కేసులను చూసి పరిశోధకులు ఒక్కింతా విస్మయానికి గురవుతున్నారు. దేశంలో సుమారు రోజు మూడు లక్షల పైగా కరోనా కేసులు, 2వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. పరిశోధకులు భారత్‌లో కరోనా డబుల్ మ్యూటేషన్ ఉన్నట్లుగా తొలుత భావించగా, ప్రస్తుతం భారత్‌లో కరోనా ట్రిపుల్ మ్యూటేషన్ కూడా ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ట్రిపుల్ మ్యూటేషన్ వలనే భారీ ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ట్రిపుల్ మ్యూటేషన్‌లో మూడు కోవిడ్ స్ట్రెయిన్లు కలిపి కొత్త వేరియంట్‌గా మారాయని భావిస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో నమోదైన కేసుల్లో ట్రిపుల్ మ్యూటేంట్ కనిపించిందని పరిశోధకులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్లు కనిపిస్తూనే ఉన్నాయని సైంటిస్టులు పేర్కొన్నారు. ‘ట్రిపుల్ మ్యూటేంట్‌తో వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దాంతో పాటు వెంటనే అనారోగ్యానికి గురయ్యేలా చేస్తోంద’ని మెక్ గిల్ యూనివర్సిటీ ఎపిడమియాలజీ ప్రొఫెసర్ మధుకర్ తెలిపారు. ఈ మ్యూటేషన్లకు సరిపోయే వ్యాక్సిన్లు మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసుల్లో (జీనోమ్ సీక్వెన్స్) జన్యు శ్రేణిలను కేవలం ఒక శాతం కంటే తక్కువగా స్టడీ చేస్తున్నామన్నారు. ఇది భారత్‌కు పెను సవాల్‌గా మారనుందని తెలిపారు. ట్రిపుల్ మ్యుటేషన్ ఎంత వరకు ప్రభావం చూపనుంది..! డబుల్ మ్యూటేషన్‌తో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. దేశంలో కరోనా మొదటి వేవ్‌లో పది మందిల్లో ఒకరు లేదా ఇద్దరికి వైరస్ వ్యాప్తి చెందగా, ప్రస్తుత డబుల్ మ్యూటేషన్‌తో వైరస్ వ్యాప్తి ఎనిమిదికి చేరింది. డబుల్ మ్యూటేషన్‌తో చివరికి చిన్న పిల్లలు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ట్రిపుల్ మ్యూటేషన్ అంతకుమించి వేగంగా వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ట్రిపుల్ మ్యూటేషన్స్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను పెంచుతున్నాయి. ప్రస్తుతానికి వైరస్ జెనోమ్ను స్టడీ చేయడానికి 10 ల్యాబ్‌లు మాత్రమే ఉన్నాయి. చదవండి: కొత్తరకం వైరస్‌పై కొవాగ్జిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది: ఐసీఎంఆర్ -
అతిపెద్ద ‘జన్యువుల’ జాబితా
వాషింగ్టన్: ఎప్పుడూ జలుబు, జ్వరం అంటూ బాధపడే వారిని తరచూ చూస్తూనే ఉంటాం. మరి కొందరేమో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ చురుగ్గా ఉంటారు. అయితే దీనికి కారణాలను అన్వేషించే క్రమంలో 2,504 మంది జన్యువులను పరిశీలించి జన్యు వ్యత్యాసాలతో(జీనోమ్ వేరియేషన్స్) కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద జాబితాను శాస్త్రవేత్తలు రూపొందించారు. కొందరికి మాత్రమే రోగ నిరోధక శక్తి ఎందుకు ఎక్కువగా ఉంటుందో కనుక్కునేందుకు ఈ జాబితా దోహదపడుతుందని వారు చెబుతున్నారు. ఈ జన్యు రూపాంతరాల కారణంగా వ్యాధులు ఎలా సంక్రమిస్తాయో పూర్తిగా తెలుసుకుంటే సులువైన చికిత్స అందించేందుకు ఉపయోగపడుతుంది. అమెరికా, బ్రిటన్, చైనా, జర్మనీ, కెనడాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనలు చేసింది. ఈ పరిశోధన కోసం ఆఫ్రికా, తూర్పు, దక్షిణ ఆసియా, యూరప్, అమెరికాకు చెందిన 2,504 మంది జన్యువులను వారు పరిశీలించారు. మానవ జన్యు క్రమంలోని దాదాపు 8.8 కోట్ల ప్రదేశాల్లో తేడాలు ఉన్నట్లు ఈ బృందం కనుగొంది. వారికి అందుబాటులో ఉన్న డేటాబేస్‌ను ఆధారంగా చేసుకుని జన్యువుల మధ్య తేడాలతో ఈ జాబితాను తయారుచేశారు.