అతిపెద్ద ‘జన్యువుల’ జాబితా
వాషింగ్టన్: ఎప్పుడూ జలుబు, జ్వరం అంటూ బాధపడే వారిని తరచూ చూస్తూనే ఉంటాం. మరి కొందరేమో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ చురుగ్గా ఉంటారు. అయితే దీనికి కారణాలను అన్వేషించే క్రమంలో 2,504 మంది జన్యువులను పరిశీలించి జన్యు వ్యత్యాసాలతో(జీనోమ్ వేరియేషన్స్) కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద జాబితాను శాస్త్రవేత్తలు రూపొందించారు. కొందరికి మాత్రమే రోగ నిరోధక శక్తి ఎందుకు ఎక్కువగా ఉంటుందో కనుక్కునేందుకు ఈ జాబితా దోహదపడుతుందని వారు చెబుతున్నారు.
ఈ జన్యు రూపాంతరాల కారణంగా వ్యాధులు ఎలా సంక్రమిస్తాయో పూర్తిగా తెలుసుకుంటే సులువైన చికిత్స అందించేందుకు ఉపయోగపడుతుంది. అమెరికా, బ్రిటన్, చైనా, జర్మనీ, కెనడాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనలు చేసింది. ఈ పరిశోధన కోసం ఆఫ్రికా, తూర్పు, దక్షిణ ఆసియా, యూరప్, అమెరికాకు చెందిన 2,504 మంది జన్యువులను వారు పరిశీలించారు. మానవ జన్యు క్రమంలోని దాదాపు 8.8 కోట్ల ప్రదేశాల్లో తేడాలు ఉన్నట్లు ఈ బృందం కనుగొంది. వారికి అందుబాటులో ఉన్న డేటాబేస్‌ను ఆధారంగా చేసుకుని జన్యువుల మధ్య తేడాలతో ఈ జాబితాను తయారుచేశారు.