సాక్షి, అమరావతి: ఇన్నాళ్లూ తమ అధినేత నిప్పులాంటి వాడని పదేపదే డప్పు కొట్టిన టీడీపీ శ్రేణులు స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టై జైలుకు వెళ్లడంతో తీవ్ర నిర్వేదంలో కూరుకుపోయాయి. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో పలు అవినీతి ఆరోపణలు, కేసుల నుంచి చాకచక్యంగా తప్పించుకున్న ఆయన తొలిసారి జైలుకు వెళ్లడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ వ్యవహారంలో రెండు రోజులుగా పలు నాటకీయాలు పరిణామాలు చోటు చేసుకుంటున్నా పార్టీ శ్రేణులు, నాయకులు బయటకు రావడానికి ఇష్టపడడంలేదు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పదేపదే ఫోన్లు చేసి ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని, నిరసనలకు దిగాలని సూచిస్తున్నా క్షేత్రస్థాయిలో స్పందన శూన్యం. అక్కడక్కడా ఒకటీ అరా ప్రచారం కోసమేనని స్పష్టమవుతోంది.
ఆదివారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు చేయాలని పార్టీ పిలుపు ఇచ్చినా పట్టుమని పది చోట్ల కూడా జరగలేదు. తమను పోలీసులు హౌస్ అరెస్టు చేశారని చెబుతూ నియోజకవర్గ ఇన్‌చార్జీలు బయటకు రావడంలేదు. కనీసం పది మంది అయినా బయటకు రాకపోవడంతో ఏం చేయాలో తోచక ముఖ్య నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ద్వితీయ, తృతీయ స్థాయి క్యాడర్ సైతం పట్టించుకోకపోవడంపై పారీ్టలో ఆందోళన వ్యక్తమవుతోంది.
కృష్ణా, గుంటూరులో మరీ తీసికట్టు
టీడీపీకి బాగా పట్టుందని చెప్పుకునే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కనీస స్పందన లేకపోవడం పార్టీ ముఖ్య నాయకులకు ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబును విచారించిన సిట్ కార్యాలయం ఉన్న తాడేపల్లి, విజయవాడ కోర్టు పరిసరాల్లో అలజడి సృష్టించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.
విజయవాడ నగర నాయకులు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, కేశినేని చిన్ని, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలకు చెందిన బొండా ఉమా, యార్లగడ్డ వెంకట్రావు లాంటి నేతలు గృహ నిర్బంధం పేరుతో బయట కనపడకపోవడం చర్చనీయాంశమైంది. ముఖ్య నాయకులు ఫోన్లు చేసి ఏదో ఒక కార్యక్రమం చేయాలని వారిని కోరుతున్నా ఒక్కరు కూడా స్పందించలేదు. రకరకాల కారణాలు చెబుతూ ఏమీ చేయలేమని చేతులెత్తేశారు.
కళ్లెదుట పక్కా ఆధారాలు..
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణాన్ని సీఐడీ సాక్ష్యాధారాలతో వివరంగా బయట పెట్టడం, చంద్రబాబు అవినీతి చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుండడం టీడీపీ యంత్రాంగానికి ఇబ్బందిగా మారింది. దీన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక నేతలు సతమతమవుతున్నారు. పక్కా ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తుండడంతో అవినీతిని కొట్టి పారేయలేకపోతున్నారు. తమ నేత నిజాయితీపరుడని, దార్శనికుడని, చాణక్యుడని చెప్పుకునే వారంతా తాజా పరిణామంతో డీలా పడిపోయారు.
రాజకీయాల్లో మర్రిచెట్టులా పాతుకుపోయి అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయడంలో నైపుణ్యం కలిగిన తమ అధినేతను రాష్ట్ర ప్రభుత్వం జైలుకు పంపించిందనే విషయాన్ని టీడీపీ నేతలు, శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఏ రకంగానూ చంద్రబాబు అవినీతి సమర్థిచలేమని నాయకులు మదనపడుతున్నారు. అందుకే బయటకు రావడానికి ఇష్టపడడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment