
గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద రోడ్డుపై పడుకున్న పవన్‌కల్యాణ్
సాక్షి, అమరావతి/గన్నవరం/గరికపాడు (జగ్గయ్యపేట): తప్పుచేయని నేతలను ఈ ప్రభుత్వం అరెస్టు చేస్తోందంటూ జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆయన స్పందిస్తూ.. చంద్రబాబుకు జనసేన సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్థరాత్రి అరెస్టు విధానాన్ని రాష్ట్రంలో అవలంబిస్తున్నారు.
గతేడాది అక్టోబరులో విశాఖపట్నంలో కూడ జనసేనపట్ల పోలీసు వ్యవస్థ, ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో అందరూ చూశారు. ఏ తప్పు చేయని మా పార్టీ నాయకులపై హత్యాయత్నం కేసులు పెట్టి అరెస్టుచేశారు. ఇప్పుడు చంద్రబాబు విషయంలో నంద్యాలలో జరిగిన సంఘటన కూడా అలాంటిదే. ఆయన అరెస్టును జనసేన ఖండిస్తోంది. ఒక నాయకుడు అరెస్టయితే, ఆయనకు మద్దతుగా పార్టీ అనుచరులు, వాళ్ల పార్టీ క్యాడర్ కచ్చితంగా బయటకొస్తారు. అది ప్రజాస్వామ్యంలో భాగం. వాళ్లు ఇళ్లలోంచి బయటకు రాకూడదనుకుంటే ఎలా? దీనిని కచ్చితంగా రాజకీయ కక్షసాధింపు చర్యగా చూస్తున్నాం’ అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
పవన్ ప్రత్యేక విమానం ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరణ..
ఇక పవన్‌కళ్యాణ్ ప్రత్యేక విమానం ల్యాండింగ్‌కు గన్నవరం ఎయిర్‌పోర్ట్ అధికారులు అనుమతి నిరాకరించారు. తొలుత కృష్ణాజిల్లా ఎస్పీ పి.జాషువా ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్‌కు శాంతిభద్రతల సమస్యను వివరిస్తూ విమానం ల్యాండింగ్‌కు అనుమతులు ఇవ్వవద్దని లేఖలో కోరారు. దీంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు అనుమతివ్వలేదు. మరోవైపు.. చంద్రబాబు అరెస్టుకు సంఘీభావం తెలపడానికి పవన్ కళ్యాణ్ విజయవాడ రావడానికి ప్రయత్నిస్తే హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లోనే పోలీసులు అడ్డుకున్నారని గన్నవరంలో జనసేన నేత నాదెండ్ల ఆరోపించారు.
రోడ్డుపై పడుకుని పవన్ నిరసన
అరెస్టయిన చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు పవన్ శనివారం రాత్రి విజయవాడ చేరుకునేందుకు రోడ్డు మార్గాన బయల్దేరారు. దీంతో ఆ పార్టీ నేతలు
నాదెండ్ల మనోహర్ సహా కొందరు కార్యకర్తలు జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్దకు చేరుకున్నారు. అయితే, పవన్‌ను గరికపాడు చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ నుంచి విజయవాడకు బయల్దేరినప్పటికీ, ఆ తర్వాత మరోసారి అనుమంచిపల్లి వద్ద పోలీసులు నిలువరించారు.
ఆంక్షల నేపథ్యంలో అనుమతిలేదని పోలీసులు ఎంత నచ్చచెప్పినప్పటికీ పవన్ వినకపోవటంతో పాటు ఆయన మొండిగా రోడ్డుపై పడుకున్నారు. దాదాపు రెండు గంటలపాటు ఇలా హైడ్రామా నడిచింది. చివరికి ఆయనతోపాటు నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనంలో తరలించారు. వీరిని ఎక్కడికి తరలిస్తున్నదీ పోలీసులు వెల్లడించలేదు. మరోవైపు.. పవన్, ఆ పార్టీ శ్రేణుల తీరుతో జాతీయ రహదారికి ఇరువైపుల ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా, పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌ను చిల్లకల్లు మీదుగా విజయవాడకు పోలీసులు తరలించారు.