![pawan withdrew the quash petition: Andhra pradesh](/styles/webp/s3/article_images/2024/10/21/HIGH_COURT_OF_ANDHRA_.jpg.webp?itok=aVFMluOG)
అనుమతించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన నేతలపై కోర్టుల్లో దాఖలైన పరువు నష్టం కేసులన్నింటినీ ఉపసంహరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో, గుంటూరు కోర్టులో తనపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టేయాలని కోరుతూ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. అప్పట్లో వలంటీర్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు దాఖలైన పరువు నష్టం కేసును కొట్టేయాలని పవన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
చట్ట ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకునేందుకు వీలుగా ఈ వ్యాజ్యం ఉపసంహరణకు అనుమతివ్వాలని కోరుతూ శనివారం పవన్ తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు. అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో విచారణ జరపాలని కోరారు. ఇందుకు కోర్టు అంగీకరించింది. తమ క్వాష్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని, అందుకు అనుమతివ్వాలని పవన్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ పిటిషన్ ఉపసంహరణకు అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులిచ్చారు.
కాగా, గతేడాది ఏలూరులో పవన్ మాట్లాడుతూ ఏపీలో పెద్ద సంఖ్యలో ఆడ పిల్లలు కనిపించకుండా పోతున్నారని, దీని వెనుక వలంటీర్లు ఉన్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ పరువు, ప్రతిష్టకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని, పవన్‌పై సంబంధిత కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేయాలని గుంటూరు కోర్టు పీపీని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పీపీ గుంటూరు కోర్టులో పవన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment