► లేకుంటే పన్ను మినహాయింపు కోల్పోయే ప్రమాదం
► రాజకీయ పార్టీల విరాళాలపై కేంద్రం చట్ట సవరణ!
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలన్నీ తమకొచ్చే విరాళాలపై ప్రతి ఏడాదీ డిసెంబర్‌లోగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం చట్ట సవరణ చేయనుంది. అలా దాఖలు చేయని పక్షంలో పన్ను మినహాయింపును కోల్పో యే ప్రమాదం ఉంది. అలాగే బ్యాంకుల నుంచి ఎలక్ట్రోరల్ బాండ్లను కొని పార్టీలకు విరాళాలిచ్చే వ్యక్తి గుర్తింపును రహస్యంగా ఉంచేలా చట్టాన్ని మార్చనున్నారు. దీనిపై కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు పన్ను మినహాయింపును అనుభవిస్తున్నాయని, కానీ సగంపైగా పార్టీలు సరైన సమయంలో ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడం లేదన్నారు.
ఈ నేపథ్యంలో పార్టీలకొచ్చే విరాళాలపై పారదర్శకత పెంచేందుకు డిసెంబర్‌లోపు ఆదాయపు పన్ను రిటర్నులు తప్పనిసరిగా దాఖలు చేసేలా 2017–18 బడ్జెట్‌లో ఆర్థిక బిల్లు ద్వారా చట్టాన్ని సవరించనున్నట్లు చెప్పా రు. ఉదాహరణకు 2018–19 అంచనా సంవత్సరానికి గాను(2017, ఏప్రిల్ 1 నుం చి ఆర్థిక సంవత్సరం ప్రారంభం) డిసెంబర్ 31, 2018లోపు రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇలా చేయని పార్టీలకు పన్ను మినహాయింపును రద్దు చేసేలా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు.