hasmukh adhiya
-
దశలవారీగా జీఎస్టీలోకి పెట్రోలియం ఉత్పత్తులు
న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులను కూడా వస్తు, సేవల పన్నుల విధానం పరిధిలోకి తెచ్చే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. వీటిని జీఎస్టీలోకి చేర్చడం దశలవారీగా జరగవచ్చని పేర్కొన్నారు. జీఎస్టీని సమగ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, అయితే మరింత మెరుగుపర్చేందుకు చేయాల్సినది ఇంకా చాలా ఉందని అధియా తెలిపారు. మొత్తం రీఫండ్ ప్రక్రియ అంతా కూడా ఆటోమేటిక్‌గా జరిగిపోయేలా తగు విధానాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. రేట్లు, శ్లాబ్స్‌ని మరింత సరళం చేయాల్సిన అవసరం ఉన్న సంగతిని ప్రభుత్వం కూడా గుర్తించిందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాము చేయగలిగినంత చేశామని అధియా పేర్కొన్నారు. జీఎస్టీలో ప్రస్తుతం 5%, 12%, 18%, 28 శాతం చొప్పున నాలుగు శ్లాబులు ఉన్నాయి. ప్రస్తుతం డీజిల్, పెట్రోల్, ముడిచమురు, సహజ వాయువు, విమాన ఇంధనం మొదలైనవి దీని పరిధిలో లేవు. రాష్ట్రాలు వీటిపై విలువ ఆధారిత పన్నులు విధిస్తున్నాయి. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో సింహభాగం వాటా ఉండే విమాన ఇంధనంపై (ఏటీఎఫ్) భారీ పన్నులపై ఆందోళన వ్యక్తం చేస్తూ పౌర విమానయాన శాఖ కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ కూడా రాసింది. సాధ్యమైనంత త్వరగా పూర్తి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభించేలా ఏటీఎఫ్‌ను జీఎస్టీలోకి చేర్చాలని కోరింది. ఆర్థిక శాఖ కూడా ఇందుకు సుముఖంగానే ఉంది. -
అధియాపై ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆగ్రహం
న్యూఢిల్లీ: కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియాపై ఈడీ జాయింట్ డైరెక్టర్ రాజేశ్వర్ సింగ్ మండిపడ్డారు. కుంభకోణాలు చేసిన వారు, వారి సంబంధీకుల విషయంలో రాజేశ్వర్ అనుకూలంగా వ్యవహరించారంటూ ఇటీవల అధియా వ్యాఖ్యానించారు. దీనిపై జూన్ 11న అధియాకు పంపిన లేఖలో రాజేశ్వర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘20 ఏళ్లుగా ఎందరో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారుల నుంచి ‘అద్భుతంగా పనిచేశావంటూ’ ప్రశంసలందుకున్నాను. నేను ఎప్పుడూ తప్పచేయలేదు. మీరు వివిధ సందర్భాల్లో నేను సుప్రీంకోర్టుసహా న్యాయవ్యవస్థనూ ప్రభావితం చేసేందుకు ప్రయత్నించానని తోటి అధికారుల ముందు అవమానకరంగా మాట్లాడారు. అది నన్ను చాలా బాధించింది’ అని లేఖలో పేర్కొన్నారు. అయితే, రాజేశ్వర్ సింగ్‌పై గతంలో ఇచ్చిన అధికారిక ఆదేశాలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదంటూ బుధవారం సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ లేఖ విషయం బయటకొచ్చింది. -
ఎల్టీసీజీ ఇన్వెస్టర్ల మేలుకే!
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ) తీసుకురావడాన్ని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా సమర్థించుకున్నారు. ఎల్టీసీజీ నుంచి ఈక్విటీలను మినహాయించడం వల్ల ఆస్తుల విలువలు అధిక స్థాయికి చేరతాయని, దీనివల్ల చిన్న ఇన్వెస్టర్లకు రిస్క్ బాగా పెరిగిపోయే అవకాశాలుంటాయని చెప్పారాయన. 14 ఏళ్ల తర్వాత ఎల్‌టీసీజీని తిరిగి తీసుకురావడం వెనుక ఉన్న కారణాలను వెల్లడిస్తూ... ‘‘ఇతర అన్ని రకాల సాధనాల్లో పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఉంది. ఈక్విటీలకు మినహాయింపు ఇవ్వడం వల్ల పక్కదారి పడుతుంది. నాలుగైదు సాధనాల్లో ఒకదానికి పన్ను లేకపోతే చాలా మంది తమ నిధుల్ని అందులోనే పెట్టాలనుకుంటారు. దాంతో డిమాండ్ పెరిగి, పెద్ద ఎత్తున నిధులు షేర్లు, ఫండ్స్ వెంట పడితే వాటి విలువలు అనూహ్యంగా పెరిగిపోతాయి. కొన్ని సందర్భాల్లో ఈ విలువలు ఆయా కంపెనీల వాస్తవ విలువలను కూడా ప్రతిఫలించేలా ఉండవు. దానివల్ల చిన్న ఇన్వెస్టర్లకు అధిక ముప్పు ఉంటుంది’’ అని అధియా వివరించారు. ఒక పెట్టుబడి విభాగాన్ని పూర్తిగా పన్నుకు దూరంగా ఉంచడం సరికాదన్నారు. పీహెచ్డీ చాంబర్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అధియా ఈ మేరకు మాట్లాడారు. దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం, కొన్ని రోజుల నుంచి అంతర్జాతీయంగా మార్కెట్ల తగ్గుదలలో భాగమేనని, ఎల్టీసీజీ తీసుకురావడం వల్ల కాదన్నారు. సోమవారం దేశీయ మార్కెట్లలో ఎఫ్ఐఐలు నికర కొనుగోలుదారులుగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. భారత్ ఇప్పటికీ పెట్టుబడుల పరంగా ఆకర్షణీయంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఏడాదిలోపు పెట్టుబడులపై 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను ఉండగా, దీర్ఘకాలిక పెట్టుబడులపై మూలధన లాభాల పన్ను లేదు. ఈ నేపథ్యంలో 10 శాతం ఎల్‌టీసీజీని కేంద్రం ప్రతిపాదించింది. -
నోట్లరద్దుతో ప్రయోజనాలు బోలెడు: కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏడాది క్రితం తీసుకున్న నోట్ల రద్దు ద్వారా చాలా ప్రయోజనాలు జరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. నల్లధనాన్ని వెలికితీయటం, దొంగనోట్లను చెలామణిలోనుంచి తీసేయటం, నగదు లావాదేవీలను తగ్గించటం వంటి లాభాలు జరిగాయంది. ఉగ్రవాదులు, మావోయిస్టుల ఆర్థిక మూలాలకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని.. దీంతోపాటుగా పన్ను పరిధి విస్తృతమవటం, అక్రమంగా సంపాదించినదంతా ఆర్థిక వ్యవస్థలోకి మార్చటం, డబ్బుకు జవాబుదారీ పెంచటం జరిగిందని స్పష్టం చేసింది. డిజిటల్ చెల్లింపులకు నోట్లరద్దు నిర్ణయం ఊతమిచ్చిందని.. తద్వారా నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా భారత్ మారేందుకు ముందడుగు పడిందని తెలిపింది. కాగా నోట్ల రద్దులో కీలకంగా వ్యవహరించిన రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియాను ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా నియమించారు. -
జూలై 1 నుంచే జీఎస్టీ
-
జూలై 1 నుంచే జీఎస్టీ
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) జూలై 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం మంగళవారం స్పష్టంచేసింది. జూలై 1 నుంచి అమలు చేయడం కోసం పనులన్నీ చకచకా జరుగుతున్నాయంది. ‘జూలై 1 నుంచే జీఎస్టీని అమలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్న సమయానికి వ్యాపారులందరూ జీఎస్టీ కింద నమోదయ్యేలా చూసేందుకు సీబీఈసీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్) రాష్ట్రాలతో కలిసి తీవ్రంగా శ్రమిస్తోంది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘జీఎస్టీ అమలు ఆలస్యం అవుతుందని వస్తున్న వార్తలు అవాస్తవాలు. వాటిని నమ్మి తప్పుదారి పట్టకండి’ అని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా ట్విటర్లో పేర్కొన్నారు. 2.29 శాతం పెరగనున్న ముఖ్యమైన ఔషధాల ధరలు జీఎస్టీ అమలైతే చాలా వరకు ముఖ్యమైన ఔషధాల ధరలు 2.29 శాతం వరకు పెరగనున్నాయి. ‘ముఖ్యమైన ఔషధాల జాతీయ జాబితా’లో హెపారిన్, వార్ఫారిన్, డైల్టియాజెమ్, డయాజెపమ్, ఐబూప్రొఫేన్, ప్రొప్రనోలోల్, ఇమాటినిబ్ తదితర మందులు ఉన్నాయి. వీటన్నింటి ధరలు 2.29 శాతం పెరుగుతాయి. జీఎస్టీలో మందులను 12 శాతం శ్లాబ్‌లోకి చేర్చడమే ఇందుకు కారణం. -
గరీబ్ కల్యాణ్‌తో 5 వేల కోట్లే!
ఈ పథకానికి స్పందన అంతంతే: అధియా న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) కింద దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన డిపాజిట్లు మాత్రమే వచ్చాయనీ, ఈ పథకానికి నామమాత్ర స్పందన మాత్రమే లభించిందని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా గురువారం చెప్పారు. నల్లధనం వెల్లడికి అక్రమార్కులకు అవకాశమిస్తూ ప్రభుత్వం గత డిసెంబరు 17న ఈ పథకాన్ని ప్రారంభించింది. లెక్కల్లోకి రాని ఆదాయం తమ వద్ద ఎంత ఉందో అవినీతిపరులు ఈ పథకం కింద ప్రకటించి, ఆ డబ్బును ప్రభుత్వం వద్ద జమ చేయాలి. అందులో 50 శాతాన్ని ప్రభుత్వం పన్ను, సర్‌చార్జీ, జరిమానా కింద వసూలు చేస్తుంది. మరో 25 శాతం ధనాన్ని వడ్డీ ఏమీ లేకుండా ప్రభుత్వం వద్ద కచ్చితంగా నాలుగేళ్లపాటు జమ చేయాలి. ఈ పథకం కింద అక్రమాదాయ వెల్లడికి గడువు మార్చి 31తో ముగిసింది. అక్రమార్కులు ముందుగానే పలు ఇతర ఖాతాల్లో డబ్బు జమ చేసి ఉండటం, పన్ను, సర్‌చార్జి రేట్లు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని హస్ముఖ్ అధియా చెప్పారు. కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖల మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం హస్ముఖ్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. పీఎంజీకేవై కింద వచ్చిన మొత్తాన్ని మాత్రమే వేరుగా చూసి తక్కువగా ఉందనుకోకూడదన్నారు. అదే ఏడాది అంతకన్నా ముందే స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని తీసుకొచ్చామనీ, అలాగే ప్రజలు కూడా నల్లధనాన్ని బ్యాంకు ఖాతా ల్లో జమచేసి పన్ను చెల్లించారని జైట్లీ పేర్కొన్నారు. అందువల్లే పీఎంజీకేవై కింద వెల్లడించిన మొత్తం తక్కువగా ఉందన్నారు. -
డిసెంబర్‌లోపే ఐటీ రిటర్నులు
► లేకుంటే పన్ను మినహాయింపు కోల్పోయే ప్రమాదం ► రాజకీయ పార్టీల విరాళాలపై కేంద్రం చట్ట సవరణ! న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలన్నీ తమకొచ్చే విరాళాలపై ప్రతి ఏడాదీ డిసెంబర్‌లోగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం చట్ట సవరణ చేయనుంది. అలా దాఖలు చేయని పక్షంలో పన్ను మినహాయింపును కోల్పో యే ప్రమాదం ఉంది. అలాగే బ్యాంకుల నుంచి ఎలక్ట్రోరల్ బాండ్లను కొని పార్టీలకు విరాళాలిచ్చే వ్యక్తి గుర్తింపును రహస్యంగా ఉంచేలా చట్టాన్ని మార్చనున్నారు. దీనిపై కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు పన్ను మినహాయింపును అనుభవిస్తున్నాయని, కానీ సగంపైగా పార్టీలు సరైన సమయంలో ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడం లేదన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలకొచ్చే విరాళాలపై పారదర్శకత పెంచేందుకు డిసెంబర్‌లోపు ఆదాయపు పన్ను రిటర్నులు తప్పనిసరిగా దాఖలు చేసేలా 2017–18 బడ్జెట్లో ఆర్థిక బిల్లు ద్వారా చట్టాన్ని సవరించనున్నట్లు చెప్పా రు. ఉదాహరణకు 2018–19 అంచనా సంవత్సరానికి గాను(2017, ఏప్రిల్ 1 నుం చి ఆర్థిక సంవత్సరం ప్రారంభం) డిసెంబర్ 31, 2018లోపు రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇలా చేయని పార్టీలకు పన్ను మినహాయింపును రద్దు చేసేలా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. -
నేటి నుంచి గరీబ్ కల్యాణ్
నల్ల కుబేరులకు మరో అవకాశం ► అప్రకటిత నగదులో 50 శాతం పన్నుగా చెల్లించి బయటపడొచ్చన్న కేంద్రం న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్ క్యలాణ్ యోజన(పీఎంజీకేవై)లో భాగంగా 50 శాతం పన్ను చెల్లించి బయటపడే పథకాన్ని శనివారం నుంచి అమల్లోకి తెస్తున్నామని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. ఈ పథకం ద్వారా అప్రకటిత నగదు ప్రకటించేందుకు నల్ల కుబేరులకు మరో అవకాశమిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పన్ను చెల్లించేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, పన్ను చట్టాల కింద ఎలాంటి విచారణ ఉండబోదని, మార్చి 31 వరకూ డిక్లరేషన్లు సమర్పించవచ్చని తెలిపారు. పీఎంజీకేవైలో నల్లధనాన్ని ప్రకటించకుండా... ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో చూపితే మొత్తం 77.25 శాతం మేర పన్నులు, జరిమానా కట్టాల్సి ఉంటుందన్నారు. పీఎంజీకేవైలో, లేదా ఆదాయపు పన్ను దాఖలులో చూపకపోతే అదనంగా మరో 10 శాతం పన్ను చెల్లించాలని అధియా పేర్కొన్నారు. గరీబ్ కల్యాణ్ అమలు కోసం పన్ను చట్టాలు(రెండో సవరణ)2016 బిల్లును గత నెల్లో లోక్‌సభ ఆమోదించింది. శనివారం నుంచి బ్యాంకుల వద్ద దొరికే చలాన్లు నింపి డిక్లరేషన్లు సమర్పించాలని అధియా వెల్లడించారు. ముందుగా పన్నులు చెల్లించి రసీదు చూపితేనే పథకం వర్తిస్తుందని తెలిపారు. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగం ప్రతీ బ్యాంకు ఖాతా వివరాల్ని రాబడుతోందని, ఐటీ, ఈడీ ఇతర విచారణ సంస్థలు ఖాతాల సమాచారంపై నిఘా పెట్టాయని చెప్పారు. డిసెంబర్ 30 తర్వాత విత్‌డ్రాపై సమీక్షిస్తాం డిసెంబర్ 30 అనంతరం ఖాతాల నుంచి విత్‌డ్రా పరిమితిని సమీక్షిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాల నుంచి వారానికి రూ. 24 వేలు, ఏటీఎంల నుంచి రోజుకు రూ. 2.5 వేల పరిమితి కొనసాగుతోంది. -
20 నెలల్లో రూ.16వేల కోట్ల నల్లధనం!
న్యూఢిల్లీ: నల్లధనం అదుపునకు చేపట్టిన గట్టి చర్యల నేపథ్యంలో.. గడిచిన 20 నెలల్లో లెక్కలు, వివరాలు వెల్లడించని రూ.16 వేల కోట్ల నల్లధనాన్ని గుర్తించినట్టు కేంద్ర ప్రకటించింది. అదే సమయంలో రూ.1,200 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్టు తెలిపింది. 2014, మార్చి నుంచి 2015 నవంబర్ వరకు ఆదాయపు పన్ను అధికారులు జరిపిన దాడుల్లో కనుగొన్న నల్లధనం వివరాలను రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా బుధవారం తెలిపారు. మొత్తం 774 కేసులు (2015, సెప్టెంబర్ నాటికి) నమోదు చేసినట్టు తెలిపారు. కాగా, స్వచ్ఛందంగా నల్లధనాన్ని అందజేసేందుకు ఉద్దేశించి ప్రభుత్వం కల్పించిన ‘ఒన్‌టైం 90-డేస్ విండో’ ద్వారా రూ.4,160 కోట్ల విలువచేసే అక్రమ సంపదకు సంబంధించి 635 ప్రకటనలు వచ్చినట్టు పేర్కొన్నారు. పన్ను, జరిమానాల రూపంలో రూ.2,500 కోట్లు ఈ నెలాఖరులోగా వస్తాయని ప్రభుత్వం భావిస్తోందన్నారు. నల్లధనంపై ప్రస్తుత ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని అధియా చెప్పారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కు తీసుకువచ్చే విషయంలో కృతనిశ్చయంతో ఉందన్నారు.