నేటి నుంచి గరీబ్ కల్యాణ్
నల్ల కుబేరులకు మరో అవకాశం
► అప్రకటిత నగదులో 50 శాతం పన్నుగా చెల్లించి బయటపడొచ్చన్న కేంద్రం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్ క్యలాణ్ యోజన(పీఎంజీకేవై)లో భాగంగా 50 శాతం పన్ను చెల్లించి బయటపడే పథకాన్ని శనివారం నుంచి అమల్లోకి తెస్తున్నామని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. ఈ పథకం ద్వారా అప్రకటిత నగదు ప్రకటించేందుకు నల్ల కుబేరులకు మరో అవకాశమిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పన్ను చెల్లించేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, పన్ను చట్టాల కింద ఎలాంటి విచారణ ఉండబోదని, మార్చి 31 వరకూ డిక్లరేషన్లు సమర్పించవచ్చని తెలిపారు.
పీఎంజీకేవైలో నల్లధనాన్ని ప్రకటించకుండా... ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో చూపితే మొత్తం 77.25 శాతం మేర పన్నులు, జరిమానా కట్టాల్సి ఉంటుందన్నారు. పీఎంజీకేవైలో, లేదా ఆదాయపు పన్ను దాఖలులో చూపకపోతే అదనంగా మరో 10 శాతం పన్ను చెల్లించాలని అధియా పేర్కొన్నారు. గరీబ్ కల్యాణ్ అమలు కోసం పన్ను చట్టాలు(రెండో సవరణ)2016 బిల్లును గత నెల్లో లోక్‌సభ ఆమోదించింది. శనివారం నుంచి బ్యాంకుల వద్ద దొరికే చలాన్లు నింపి డిక్లరేషన్లు సమర్పించాలని అధియా వెల్లడించారు. ముందుగా పన్నులు చెల్లించి రసీదు చూపితేనే పథకం వర్తిస్తుందని తెలిపారు. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగం ప్రతీ బ్యాంకు ఖాతా వివరాల్ని రాబడుతోందని, ఐటీ, ఈడీ ఇతర విచారణ సంస్థలు ఖాతాల సమాచారంపై నిఘా పెట్టాయని చెప్పారు.
డిసెంబర్ 30 తర్వాత విత్‌డ్రాపై సమీక్షిస్తాం
డిసెంబర్ 30 అనంతరం ఖాతాల నుంచి విత్‌డ్రా పరిమితిని సమీక్షిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాల నుంచి వారానికి రూ. 24 వేలు, ఏటీఎంల నుంచి రోజుకు రూ. 2.5 వేల పరిమితి కొనసాగుతోంది.