20 నెలల్లో రూ.16వేల కోట్ల నల్లధనం!
న్యూఢిల్లీ: నల్లధనం అదుపునకు చేపట్టిన గట్టి చర్యల నేపథ్యంలో.. గడిచిన 20 నెలల్లో లెక్కలు, వివరాలు వెల్లడించని రూ.16 వేల కోట్ల నల్లధనాన్ని గుర్తించినట్టు కేంద్ర ప్రకటించింది. అదే సమయంలో రూ.1,200 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్టు తెలిపింది. 2014, మార్చి నుంచి 2015 నవంబర్ వరకు ఆదాయపు పన్ను అధికారులు జరిపిన దాడుల్లో కనుగొన్న నల్లధనం వివరాలను రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా బుధవారం తెలిపారు. మొత్తం 774 కేసులు (2015, సెప్టెంబర్ నాటికి) నమోదు చేసినట్టు తెలిపారు.
కాగా, స్వచ్ఛందంగా నల్లధనాన్ని అందజేసేందుకు ఉద్దేశించి ప్రభుత్వం కల్పించిన ‘ఒన్‌టైం 90-డేస్ విండో’ ద్వారా రూ.4,160 కోట్ల విలువచేసే అక్రమ సంపదకు సంబంధించి 635 ప్రకటనలు వచ్చినట్టు పేర్కొన్నారు. పన్ను, జరిమానాల రూపంలో రూ.2,500 కోట్లు ఈ నెలాఖరులోగా వస్తాయని ప్రభుత్వం భావిస్తోందన్నారు. నల్లధనంపై ప్రస్తుత ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని అధియా చెప్పారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కు తీసుకువచ్చే విషయంలో కృతనిశ్చయంతో ఉందన్నారు.