పేదలను కొట్టి పెద్దలకు పంచుతారా?
- పెద్దోళ్ల బకాయిలు రద్దు చేయడం సరికాదు
- కేంద్రంపై టీజేఏసీ చైర్మన్ కోదండరాం విమర్శ
జడ్చర్ల: పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో నిల్వలు పెరిగాయని, దీంతో పెద్దొళ్ల బకారుులను రద్దు చేయడం ఎంతమాత్రం సహేతుకం కాదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. పేదల నెత్తులను కొట్టి పెద్దలకు పంచేలా కేంద్రం వ్యవహరించడం సరికాదన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నల్లధనం నియంత్రణకు పెద్ద నోట్లు రద్దు చేయడం స్వాగతించినా, సామాన్యులకు ఇబ్బందులు కలిగించడం సరికాదన్నారు. ఇప్పటికే పెద్దోళ్లకు అనుకూలంగా ఉంటారన్న అనుమానాలు ప్రజల్లో ఉన్న నేపథ్యంలో తాజాగా రూ.7 వేల కోట్ల రుణ బకారుుల రద్దు ప్రజల అనుమానాలకు బలం చేకూరుస్తుందన్నారు.
బకారుులు రద్దు చేయలేదు.. మరో ఖాతాలో వేశామని చెబుతున్నా ఇది చీకటి ఖాతాకిందే లెక్కేసుకునే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. పెద్దనోట్లు రద్దుతో నల్లధనం బయటకు రావవడంతోపాటు పన్నుల జమతో ప్రభుత్వ ఆదాయం పెరిగి సంక్షేమం మెరుగవుతుందని, తమ జీవి తాలు బాగుపడతాయని భావించినా ప్రజలకు ఇటువంటి పరిణామంతో నిరాశ ఏర్పడిందన్నారు. ప్రజల భావనకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలని కోరా రు. పెద్దల బకారుుల వసూళ్ల కోసం వారి ఆస్తులను జప్తు చేయాలని సూచించారు.
తమ డబ్బును విదేశాలకు మళ్లించి.. అదే డబ్బును విదేశీ పెట్టుబడుల పేరుతో దేశంలోకి మళ్లించి పన్ను రారుుతీలు పొందుతున్నవారిని గుర్తించి చర్యలు చేపట్టాలన్నా రు. బంగారం, భూములు, షేర్లు, తదితర ఆస్తుల రూపంలో ఉన్న నల్లధనాన్ని వెలికి తీయాలని సూచించారు. మధ్యతరగతి ప్రజల వద్ద కష్టపడి సంపాదించుకున్న నగదు ఉన్నా వారిలో భయాందోళనలు ఉన్నాయన్నారు. వారి సందేహాలను నివృత్తి చేసి ఊరట కలిగించాలని కోరారు. సమావేశంలో జేఏసీ కో-కన్వీనర్ వెంకట్‌రెడ్డి, జిల్లా జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి తదితరులు పాల్గొన్నారు.