ప్రజల కోసం పనిచేయట్లేదు
ప్రభుత్వంపై కోదండరాం ఆరోపణలు
హైదరాబాద్: బలిదానాలు, త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇసుక, భూదందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మునిగిపో యారని టీజేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం తీవ్రంగా ఆరోపించారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రెండో విడత అమరుల స్ఫూర్తియాత్ర శనివారం ఇక్కడ సికింద్రాబాద్‌లోని అమరవీరుల స్తూపం నుంచి ప్రారంభమైంది. అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాలు, బలిదానాలతో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఆ ప్రజల కోసం పనిచేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ప్రజల కోసం చేయాలన్నా, బాధ్యతాయుతంగా ఉండాలన్నా రాష్ట్ర ప్రజలందరూ సంఘటితంగా కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కాంట్రాక్టులు, ప్రభుత్వ పథకాల నిధుల వాటాల్లో మునిగితేలుతూ వాగ్ధానాల్ని విస్మరించారని విమర్శించారు.
అందుకే తాము ప్రజల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. ప్రజలు ఏ ఆకాంక్షతో ఈ ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చారో అంత తొందరగానే దానికి విరుద్ధంగా పనిచేస్తోందని, అందుకే ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నామని కోదండరాం అన్నారు. గతంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, జేఏసీ నేతలు రఘు, సత్యం గౌడ్, రమేష్, గోపాల్‌రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ యాత్ర 8 నుంచి 10వ తేదీ వరకు సిరిసిల్ల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సాగనుంది.