
తెలంగాణ పాలకులదీ విధ్వంసకర విధానమే
టీజేఏసీ చైర్మన్ కోదండరాం
ఖమ్మం: సీమాంధ్ర పాలకులు అనుసరించిన అభివృద్ధి విధ్వంసకర విధానాలనే ప్రస్తుత తెలంగాణ పాలకులూ అనుసరిస్తున్నారని టీజేఏసీ చైర్మన్ కోదండరాం విమర్శించారు. సమస్యలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారికి చెడుగా వినిపిస్తోందని అన్నారు. ఆదివారం ఖమ్మంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లాస్థాయి సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక పాలకులు మారారే తప్ప ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవడం లేదన్నారు. తెలంగాణ పునర్‌నిర్మాణంలో తెలంగాణ విద్యావంతుల వేదిక కీలకపాత్ర పోషించాలని సూచించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోవడానికి త్వరలోనే విద్యాయాత్ర చేపడుతామని కోదండరాం ప్రకటించారు.