Public education
-
Fact Check: చిన్నారుల భవితను చిదిమేసే యత్నం
సాక్షి, అమరావతి: పేదలకు మంచి చదువు అందించి, వారిని ఉన్నత స్థాయికి చేర్చాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. ప్రపంచ పోటీని తట్టుకుని, విజయం సాధించేలా పేదల పిల్లలకు చదువు, సదుపాయాలు అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకంటే మిన్నగా రూపుదిద్దారు. బడుగుల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి బోధన అందిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియంతో పిల్లల బంగారు భవితకు బాటలు పడుతున్నాయి. ఇదే చంద్రబాబుకు, రామోజీరావుకు, ఇతర ఎల్లో మీడియాకు నచ్చడంలేదు. ఇంగ్లిష్ మీడియంతో విద్య నాశనమైపోయిందంటూ మరోసారి విషాన్ని చిమ్మింది రామోజీ విషపుత్రిక ఈనాడు. గత చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలకు దన్నుగా నిలిచినా ప్రశ్నించలేదు రామోజీరావు. ప్రభుత్వ స్కూళ్లలో సరైన బెంచీలు, మరుగుదొడ్లు, చివరకు చాక్‌పీస్‌లు లేకపోయినా చంద్రబాబు, రామోజీ పట్టించుకోలేదు. ఇప్పుడు పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులు చెప్పడం తప్పంటున్నారు. చిన్నారుల భవితను చిదిమేసే యత్నమే తప్ప మరొకటి కాదు. సిలబస్ ఒక్కటే సిలబస్‌తో సర్కస్ అంటూ రాసిన రాతల్లో వాస్తవమే లేదు. రాష్ట్రంలోని 1,000 స్కూళ్లు సీబీఎస్ఈ బోర్డుకి అనుసంధానించారు. 44,478 స్కూళ్లలోనూ ఎన్సీఈఆర్టీ సిలబస్ మాత్రమే బోధిస్తున్నారు. పరీక్షలు నిర్వహించే బోర్డులు వేరయినా, సిలబస్ మాత్రం ఒకటే. ప్రైవేటు పాఠశాలల్లోనూ ఇదే విధానం అమల్లో ఉంది. మొదటగా వచ్చే ఏడాది పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్షలు రాస్తారు. ఇంగ్లిష్ చదవలేని పరిస్థితి ఎక్కడ ఉంది? విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఇంగ్లిష్ మీడియంపై గల ఆసక్తి, వారి అభిప్రాయం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పిల్లల్లో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని పెంచేందుకు బైలింగ్యువల్ పుస్తకాలు, డిక్షనరీలు అందించారు. ఇటీవల ముగిసిన ఫార్మేటివ్‌తో పాటు సమ్మేటివ్–1 పరీక్షలను 93 శాతం పైగా విద్యార్థులు ఇంగ్లిష్‌లోనే రాశారు. మరి ఇంగ్లిష్ చదవలేని పరిస్థితి ఎక్కడుంది? టోఫెల్లో కమ్యూనికేషన్స్ స్కిల్స్, ఇంగ్లిష్ స్పీకింగ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్‌ను స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీల ద్వారా శిక్షణనిస్తోంది. ఇందుకోసం స్కూళ్లలో ప్రత్యేకంగా పీరియడ్ కేటాయించారు. బోధనను ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులకు అప్పగించారు. ఆంగ్లం డిగ్రీ, పీజీ స్థాయి విద్యార్హత ఉన్న ఇతర సబ్జెక్టు ఉపాధ్యాయులు కూడా టోఫెల్ బోధించవచ్చు. తెలుగు ఉపాధ్యాయులకు ఈ బాధ్యత అప్పగించలేదు. ఐబీ సుదీర్ఘ ప్రక్రియ ఐబీ కరిక్యులమ్‌లో విద్యార్థులకు కరిక్యులమ్‌తో పాటు కో–కరిక్యులమ్ అంశాలను కూడా నేర్పిస్తారు. ఇది 2025 జూన్ నుంచి ఏటా ఒక తరగతికి పెంచే 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రక్రియ. ఒకేసారి ఉపాధ్యాయులు, విద్యార్థులపై భారం పడేది కాదు. ఐబీ విద్యతో విద్యార్థుల నైపుణ్యాలను అంతర్జాతీయ స్థాయికి పెరుగుతాయి. ఐబీ సర్టిఫికెట్లకు అంతర్జాతీయంగా విలువ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించడానికి పటిష్టమైన ప్రణాళిక, సమర్థవంతమైన భాగస్వాముల సహకారం విద్యా శాఖ తీసుకుంది. ట్యాబ్స్ ద్వారా విద్యార్థులకు ఉత్తమమైన ఈ కంటెంట్‌ను అందిస్తున్నారు. వీటిలో భాగంగా బైజూస్ ఈ కంటెంట్‌ను ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందించింది. పాఠ్య పుస్తకాల్లోని కాన్సెప్టులను సులభ శైలిలో దృశ్య–శ్రవణ మాధ్యమాల్లో బోధిస్తోంది. దీనివల్ల ఉపాధ్యాయులకు బోధన సులభం అవడంతో పాటు విద్యార్థుల్లో అవగాహన సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయి. తల్లిదండ్రులకు సర్వే వివరాలు సర్వేలు వ్యవస్థ బలాబలాలను తెలుసుకుని, మెరుగైన విధానాలు రూపొందించేందుకు ఉద్దేశించినవి. గత సర్వేల ఆధారంగా టీచింగ్ ఎట్ రైట్ లెవెల్, లిప్, సాల్ట్ తదితర కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నారు. విద్యార్థుల ఫలితాలు ప్రభుత్వ వెబ్సైట్లో ఎక్కడా ఉంచరు. టెన్త్‌లో కూడా విద్యార్థుల వ్యక్తిగత ఫలితాలు వెబ్సైట్లో ఉంచరన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి పాఠశాలలో ప్రభుత్వం చేసిన సర్వే వివరాలు వారి తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచారు. సర్వే రిపోర్టులతో శాస్త్రీయంగా సంస్కరణల గత ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వకపోవడంతో విద్యా వ్యవస్థ దిగజారిందని ఆసర్, నాస్ వంటి సర్వేలు తేల్చాయి. దాంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నాణ్యతను పెంచుతోంది. టీచింగ్ ఎట్ రైట్ లెవెల్, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం, సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి కార్యక్రమాలు వీటిలో కొన్ని. ఆసర్ నివేదిక ఆధారంగా రూపొందించిన టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ కార్యక్రమంలో విద్యా బోధనలో నూతన విధానాలను అవలంభిస్తున్నారు. ఇందుకోసం ప్రథమ్ సంస్థతో కలిసి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌ను అన్ని స్కూళ్లకు అందించారు. ఇది సత్ఫలితాలనిస్తోంది. ఎంపిక చేసిన కొన్ని జిల్లాల్లో ప్రాథమికోన్నత స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ‘లిప్’ ప్రోగ్రాం అందిస్తున్నారు. ఫార్మేటివ్ అసెస్‌మెంట్స్‌కు ‘కేంద్రీకృత ప్రశ్న పత్రాల తయారీ’ విధానం ద్వారా అన్ని పాఠశాలల్లో ఒకే తరహా ప్రశ్నపత్రాలు విద్యార్థులకు అందిస్తున్నారు. విద్యార్థుల తప్పులను శాస్త్రీయంగా విశ్లేషించి నిపుణులతో వీడియోలను రూపొందించి అందజేస్తున్నారు. -
సమస్యల చదువు!
► సమస్యల సుడిగుండంలో ప్రభుత్వ విద్య ► పర్యవేక్షణ అధికారుల లేమి కానరాని మౌలిక వసతులు ► కోట్లు వెచ్చిస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే పర్యవేక్షణాధికారుల లేమి, కానరాని మౌలిక వసతులు, మరుగుదొడ్లు, గదులు, తాగునీరు సమస్యలతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. జిల్లాలోని 16 మండలాల్లో ఇన్చార్జి ఎంఈవోలే కొనసాగుతున్నారు. ఉప విద్యాధికారుల పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రాథమిక పాఠశాలల విద్యవ్యవస్థ మెరుగు కోసం రూ.కోట్లు వెచ్చిస్తున్నా.. ప్రభుత్వ విద్య పేదల దరిచేరడం లేదు. బోధన, బోధనేతర సిబ్బంది కొరత వెంటాడుతోంది. సమస్యల కారణంగా ప్రతిఏటా వందలాది మంది విద్యార్థులు ప్రైవేటువైపు మళ్లుతున్నారు. కరీంనగర్‌ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా 425 ప్రాథమిక పాఠశాలలు, 75 ప్రాథమికోన్నత పాఠశాలలు, 149 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 11 కేజీబీవీలు, 11 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,42,471 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన తీరుపై తల్లిదండ్రులు నమ్మకం కోల్పోయి పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్చడానికే ఎక్కుగా మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామం అటు విద్యాశాఖను ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. పరిస్థితి ఇలానే ఉంటే.. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు ఏ మేరకు మిగులుతాయో అనే గుబులు పట్టుకుంది. అందరూ ఇన్‌చార్జిలే జిల్లా విద్యాశాఖనుపర్యవేక్షకుల కొరత వేధిస్తోంది. జిల్లాలోని అన్ని మండలాల్లో రెగ్యులర్ ఎంఈవోలు లేక సీనియర్ ప్రధానోపాధ్యాయులకే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కొత్తగా ఏర్పడ్డ కరీంనగర్–1, కొత్తపల్లి, గన్నేరువరం, ఇల్లందకుంట మండలాలకు ఇప్పటివరకు ఎంఈవో పోస్టులు మంజూరేచేయలేదు. దీంతో అక్కడ కూడా సీనియర్ హెచ్ఎంలే ఎంఈవోలుగా కొనసాగుతున్నారు. ఇన్చార్జిల పాలన ఫలితంగా జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పర్యవేక్షణ లోపిస్తోంది. మధ్యాహ్న భోజన పథకం అమలు గాడితప్పుతోంది. ఉప విద్యాధికారులూ ఇన్‌చార్జిలే ఉన్నత పాఠశాలలను పర్యవేక్షించే ఉప విద్యాధికారుల పోస్టులు కరీంనగర్, హుజూరాబాద్‌తో పాటు జిల్లా పరిషత్ డెప్యూటీ ఈవో, ఆర్‌ఎంఎస్‌ఏ డిప్యూటీ ఈవోలంతా ఇన్‌చార్జీలే. అలాగే ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు 120 మంది సబ్జెక్టు టీచర్లు కొరతగా ఉన్నారు. దీంతో ఆయా పాఠశాలల్లో విద్యార్ధులకు విషయ పరిజ్ఞానం దెబ్బతింటోంది. ఇక ప్రాథమిక విద్యను బలోపేతం చేయాల్సిన సర్వశిక్షాభియాన్ అధికారి లేకపోవడంతో జిల్లా విద్యాశాఖాధికారే అదనంగా సర్వశిక్షాభియాన్ పీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చెట్ల కిందే చదువులు .. ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు లేక.. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులూ ఇబ్బందులెదుర్కొంటున్నారు. పాఠశాల ఆవరణలో.. హాలులో.. చెట్ల కిందే చదువులు కొనసాగుతున్నాయి. 327 తరగతి గదులకు మేజర్ మరమ్మతులు ,359 గదులు కూల్చివేయాలని సర్వశిక్షాభియాన్ ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినా నేటికి ఫలితం లేదు. జిల్లాలో 206 అదనపు తరగతుల గదుల నిర్మాణాల అవసరమన్న ప్రతిపాదనలకు ఇప్పటికీ మోక్షం లేదు. పాఠశాల భవనాలు శిథిలావస్థ దశకు చేరుకున్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియదు. దీంతో వర్షాలు కురిస్తే చాలు.. స్కూలుకు సెలవు ఇవ్వాల్సిందే. టాయిలెట్లు ఉండవు.. ప్రహరీలు లేవు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటోన్న సమస్యల్లో మూత్రశాలలు.. ప్రహరీలు లేకపోవడం గమనార్హం. మల, మూత్ర విసర్జన వసతుల లేక ముఖ్యంగా విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లాలో విద్యాశాఖ వివరాల ప్రకారం బడుల్లో బాలురవి 117, బాలికలవి 87 మరుగుదొడ్లు నిరూపయోగంగా ఉన్నాయి. బాలురకు 20, బాలికలకు 87 మరుగుదొడ్లు అవసరమని ప్రతిపాదనలు పంపి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. దీంతో బహిర్భూమి కోసం విద్యార్థినులు ఇళ్లకు వెళ్తున్నారు. స్కూళ్లలో విద్యార్థినుల ఎన్రోల్మెంట్ తగ్గడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరం ఆరంభం వరకు ప్రతి పాఠశాలలో టాయిలెట్లు నిర్మించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఇప్పటివరకు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కాలేదు. విద్యాశాఖ మాత్రం పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు వెల్లడించడం గమనార్హం. 72 స్కూళ్లలో ప్రహరీలు లేవు. స్థానికత ఏదీ? జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3,006 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల 134 మంది విద్యావాలంటీర్లను నియమించారు. వీరంతా సమయపాలన పాటించడం లేదని సమాచారం. ఉపాధ్యాయులు సమయానికి రాక.. సరిగ్గా బోధించకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటుకు పంపేందుకు మొగ్గుచూపుతున్నారు. ఉపాధ్యాయులు తాము పనిచేసేచోట ఉంటున్నవారు వెయ్యిలోపే. మిగిలినవారంతా పట్టణాలు, నగరాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మారుమూల ప్రాంతాలవారికి బస్సు మిస్ అయితే.. ఆ రోజంతా విద్యార్థులు ఆటపాటలతో గడపాల్సిందే. ఉపాధ్యాయులంద రూ ప్రార్థన సమయానికి పాఠశాలలో ఉండాలని నిబంధన ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని సమాచారం. కొందరు ప్రార్థన ముగిశాక.. మరికొందరు ఓ పీరియడ్ ముగిశాక చేరుకుంటున్నట్లు సమాచారం. వేధిస్తున్న వంట గదుల కొరత ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం మధాహ్న భోజనం అందిస్తోంది. ఈ పథకం కింద జిల్లాలో 1,42,471 మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. వీరికి వంట చేసి పెట్టేందుకు 3,723 మంది వంటమనుషులు, హెల్పర్లు ఉన్నారు. పథకంలో భాగంగా ప్రతి ఏజెన్సీకి ఓ వంటగది ఉండాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో గత విద్యాసంవత్సరం తొలి విడతగా 522 షెడ్లు మంజూరు చేసింది. ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ.రెండున్నర లక్షలు కేటాయించింది. అయితే ఇప్పటివరకు 380 షెడ్ల నిర్మాణం పూర్తయింది. రెండో విడతలో.. 919 వంటషెడ్లు మంజూరైనా.. కేవలం 369 మాత్రమే ప్రగతిలో ఉన్నాయి. -
ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయొద్దు
నల్లగొండ రూరల్ : ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడానికే ప్రైవేటు యూనివర్సిటీల ప్రతిపాదనను ముందుకు తీసుకొస్తుందని ప్రొఫెసర్ అంజిరెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పీఆర్టీయూ భవన్లో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు ప్రతిపాదనపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ నేపథ్యాన్ని పక్కనబెట్టి మానవీయ విలువలు, సంబంధాలను దెబ్బతీసే విధంగా కార్పొరేట్ పెట్టుబడిదారులను ప్రోత్సహించడమే అన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు తెలంగాణ సమాజానికి మంచిది కాదన్నారు. రిలయన్స్, మహింద్రా, అశోక్ లీలాండ్, టాటా, బిర్లా వంటి సంస్థలు వ్యాపార లాభార్జన కోసమే వారి కంపెనీలు పనిచేస్తాయని, వారికి కావాల్సిన మ్యాన్‌ఫవర్ కోసం ప్రైవేటు యూనివర్సిటీలను పెడుతున్నాయన్నారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణ, సైదులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ లేని తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చిన పాలకులు నేడు ఆబాధ్యతల నుంచితప్పుకుని బహుళజాతి కంపెనీలకు విద్యారంగాన్ని అప్పగిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో పలు తీర్మాణాలు చేశారు. ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు విరమించుకోవాలని, ప్రభుత్వ యూనివర్సిటీలో బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయాలని, కేజీ టు పీజీ ఉచిత విద్యపై విధి విధానాలను ప్రకటించాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, కొఠారి కమీషన్ సూచనమేరకు జీడీపీలో 6శాతం నిధులు ఖర్చు చేయాలని, కార్పొరేట్ విద్య సంస్థను రద్దు చేసి ప్రైవేటు విద్యా సంస్థలను నియంత్రించి, ప్రభుత్వ రంగంలో విద్యావ్యవస్థను అభివృద్ధి చేయాలని తీర్మానించారు. ఈ సమావేశంలో వివిధ సంఘా ల ప్రతినిధులు పన్నాల గోపాల్‌రెడ్డి, కె.రత్నయ్య, వెంకటేశ్వర్లు, వెంకులు, లక్ష్మినారాయణ, సోమయ్య, ఇందూరు సాగర్, అశోక్‌రెడ్డి, మహేశ్, రమేష్, జి.వెంకన్నగౌడ్, ఎ.నాగయ్య, హరికృష్ణ, కేశవులు, పి.రవి, హరిందర్, మాదగోని, భిక్షపతి, ప్రభాకర్, నర్సింహ, రాజు తదితరులున్నారు. -
తెలంగాణ పాలకులదీ విధ్వంసకర విధానమే
టీజేఏసీ చైర్మన్ కోదండరాం ఖమ్మం: సీమాంధ్ర పాలకులు అనుసరించిన అభివృద్ధి విధ్వంసకర విధానాలనే ప్రస్తుత తెలంగాణ పాలకులూ అనుసరిస్తున్నారని టీజేఏసీ చైర్మన్ కోదండరాం విమర్శించారు. సమస్యలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారికి చెడుగా వినిపిస్తోందని అన్నారు. ఆదివారం ఖమ్మంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లాస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక పాలకులు మారారే తప్ప ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవడం లేదన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ విద్యావంతుల వేదిక కీలకపాత్ర పోషించాలని సూచించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోవడానికి త్వరలోనే విద్యాయాత్ర చేపడుతామని కోదండరాం ప్రకటించారు. -
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
ఖమ్మం: ప్రభుత్వ విద్యను బలోపేతం చేయూలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న కార్పొరేట్ విద్యాసంస్థలతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశా రు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘం(టీఎస్ యూటీఎఫ్) జిల్లా ప్రథమ మహాసభ శనివారం ఖమ్మంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ సంఘం నాయకులు యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చుక్కా రామయ్య మాట్లాడుతూ విద్యా విధానంలో మార్పులు వచ్చాయని అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని, ముందుగా ఈ సంవత్సరం విద్యా ప్రణాళికలను విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యాయులు హక్కుల కోసం ఉద్యమాలు చేయడంతోపాటు బోధన మెరుగు పర్చుకోవాలని సూచించారు. విద్యను మత పూరితం గా చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని, దీనిని ప్రతిఘటించాలని పిలుపు నిచ్చారు. బోధన నిత్యనూతనంగా.. ఉపాధ్యాయులు నిరంతర విద్యార్థిగా ఉంటూ కొత్త విషయాలను తెలుసుకొని నిత్యనూతనంగా విద్యాబోధన కోసం ప్రయత్నించాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ సూచించారు. ఖైదీలకు ఉరిశిక్ష వేసిన వారికి కూడా ఎందుకు శిక్ష వేస్తున్నారో చెబుతారని, కానీ పాఠశాలలు మూసివేస్తున్నాప్పుడు ఎందుకు అవకాశం ఇవ్వడంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీఎస్‌యూటీ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 50శాతం ఫిట్ మెంట్‌తో నూతన వేతన స్కేల్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి బడ్జెట్లో పీఆర్సీ ప్రస్థావన లేకపోవడం శోచనీయమని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాధ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకు కల్పిస్తున్నట్లు తెలిపారు. అంకితభావంతో పనిచేయాలి: ఖమ్మం ఎంపీ పొంగులేటి సందేశం బడుగు, బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా మహాసభకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఉన్న ఎంపీ అనివార్య కారణాలతో సమావేశానికి హాజరు కాలేక పోయారు. దీంతో ఆయన తన సందేశాన్ని పంపించగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు దుర్గాభవానీ ఎంపీ ప్రసంగాన్ని సభలో చదివి వినిపించారు. సమాజ దశ, దిశను మార్చే మహోన్నతమైన స్థానంలో ఉన్న ఉపాధ్యాయులు కర్తవ్య నిర్వాహణలో ఆదర్శంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ అధ్య ఉపన్యాసం చేయగా ప్రముఖ వైద్యులు వై. రవీంద్రనాధ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు తుళ్లూరి బ్రహ్మయ్య, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు, జిల్లా పరిషత్ మైనార్టీ విభాగం కో-ఆప్షన్ సభ్యులు జీయావుద్దీన్ అహ్మద్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.