ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి | Public education should be strengthened | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి

Published Sun, Nov 9 2014 4:10 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

Public education should be strengthened

ఖమ్మం:  ప్రభుత్వ విద్యను బలోపేతం చేయూలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న కార్పొరేట్ విద్యాసంస్థలతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశా రు.

 తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘం(టీఎస్ యూటీఎఫ్) జిల్లా ప్రథమ మహాసభ శనివారం ఖమ్మంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ సంఘం నాయకులు యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చుక్కా రామయ్య మాట్లాడుతూ విద్యా విధానంలో మార్పులు వచ్చాయని అన్నారు.

ఎన్నికల హామీలను అమలు చేయాలని,  ముందుగా ఈ సంవత్సరం విద్యా ప్రణాళికలను విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యాయులు హక్కుల కోసం ఉద్యమాలు చేయడంతోపాటు బోధన మెరుగు పర్చుకోవాలని సూచించారు. విద్యను మత పూరితం గా చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని, దీనిని ప్రతిఘటించాలని పిలుపు నిచ్చారు.

 బోధన నిత్యనూతనంగా..
 ఉపాధ్యాయులు నిరంతర విద్యార్థిగా ఉంటూ కొత్త విషయాలను తెలుసుకొని నిత్యనూతనంగా విద్యాబోధన కోసం ప్రయత్నించాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ సూచించారు. ఖైదీలకు ఉరిశిక్ష వేసిన వారికి కూడా ఎందుకు శిక్ష వేస్తున్నారో చెబుతారని,  కానీ పాఠశాలలు మూసివేస్తున్నాప్పుడు ఎందుకు అవకాశం ఇవ్వడంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

టీఎస్‌యూటీ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 50శాతం ఫిట్ మెంట్‌తో నూతన వేతన స్కేల్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి బడ్జెట్‌లో పీఆర్‌సీ ప్రస్థావన లేకపోవడం శోచనీయమని అన్నారు.  జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాధ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులకు కల్పిస్తున్నట్లు తెలిపారు.
 
 అంకితభావంతో పనిచేయాలి: ఖమ్మం ఎంపీ పొంగులేటి సందేశం
 బడుగు, బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా మహాసభకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఉన్న ఎంపీ అనివార్య కారణాలతో సమావేశానికి హాజరు కాలేక పోయారు.

 దీంతో ఆయన తన సందేశాన్ని పంపించగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు దుర్గాభవానీ ఎంపీ ప్రసంగాన్ని సభలో చదివి వినిపించారు. సమాజ దశ, దిశను మార్చే మహోన్నతమైన స్థానంలో ఉన్న ఉపాధ్యాయులు కర్తవ్య నిర్వాహణలో ఆదర్శంగా ఉండాలని అన్నారు.  

 కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ అధ్య ఉపన్యాసం చేయగా ప్రముఖ వైద్యులు వై. రవీంద్రనాధ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు తుళ్లూరి బ్రహ్మయ్య, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు, జిల్లా పరిషత్ మైనార్టీ విభాగం కో-ఆప్షన్ సభ్యులు జీయావుద్దీన్ అహ్మద్,  వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement