కేవలం 72 గంటల్లో..4000 ఈ-మెయిల్స్
కేవలం 72 గంటల్లో..4000 ఈ-మెయిల్స్
Published Tue, Dec 20 2016 11:41 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
న్యూఢిల్లీ : బ్లాక్మనీ హోల్డర్స్పై ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనూహ్య స్పందన వస్తోంది. పాత నోట్ల రద్దు అనంతరం బ్లాక్మనీ హోల్డర్స్ వివరాలు తెలిసిన వాళ్లు తమకు డైరెక్ట్ గా సమాచారం అందించాలంటూ ప్రభుత్వం ఓ ఈ-మెయిల్ అడ్రస్ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ-మెయిల్ అడ్రస్కు కేవలం 72 గంటల్లోనే 4,000 మెసేజ్లు అందాయి. శుక్రవారం నుంచి తీసుకొచ్చిన blackmoneyinfo@incometax. gov మెయిల్కు మంచి స్పందన వస్తున్నట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్లు, ఇతర అస్పష్టమైన ఆదాయ వివరాలు కూడా ఇటు పన్ను అధికారులు, ఇతర విచారణ ఏజెన్సీలకు భారీగా అందుతున్నట్టు పేర్కొంది. డిపాజిట్ల చేసిన నివేదికలు తమకు రోజువారీ అందుతున్నాయని, దాని ప్రకారం ఏజెన్సీలు వీటిపై దృష్టిసారిస్తున్నట్టు ఆర్థికశాఖ అధికారులు చెప్పారు.
ఈ సమాచారంతో జరుపుతున్న దాడుల్లో కూడా భారీగా కొత్త కరెన్సీ నోట్లు, పాత కరెన్సీ నోట్లు, బంగారం వెలుగులోకి వస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కుంభకోణాల్లో బ్యాంకు అధికారులు సైతం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. పన్ను ఎగవేత దారులకు మరో చివరి అవకాశంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథక వివరాలు తెలుపుతూ ఈ ఈ-మెయిల్ అడ్రస్ను ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకొచ్చింది. బ్లాక్మనీ హోల్డర్స్ వివరాలు తెలిసిన వాళ్లు డైరెక్ట్గా ప్రభుత్వానికి సమాచారం అందించేలా ఈ-మెయిల్ను ప్రవేశపెట్టినట్టు రెవెన్యూ కార్యదర్శ హస్ముఖ్ అథియా తెలిపారు. బ్లాక్మనీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తూ ప్రభుత్వం పాత నోట్లను రద్దుచేసిన సంగతి తెలిసిందే..
Advertisement
Advertisement