
న్యూ ఢిల్లీ: చాలా రోజుల తరువాత బ్లాక్ మనీ అంశం పార్లమెంట్‌లో వెలుగులోకి వచ్చింది. గత పదేళ్లలో స్విస్ బ్యాంకులో ఎంత నల్లధనం జమ అయ్యిందనే ప్రశ్నను కాంగ్రెస్ ఎంపీ విన్సెంట్ హెచ్. పాలా. ప్రభుత్వాన్ని అడిగారు. విదేశాల నుంచి స్వదేశానికి నల్లధనాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలపమని విన్సెంట్ పార్లమెంట్‌లో లేవనెత్తారు. అంతేకాకుండా బ్లాక్‌మనీ వ్యవహారంలో ఎంతమందిని అరెస్టు చేశారని పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని అడిగారు.
పార్లమెంట్‌లో కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నకు బదులుగా ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. గత పదేళ్లలో భారత్ నుంచి స్విస్ బ్యాంకుల్లో జమచేసిన బ్లాక్‌మనీకి సంబంధించి అధికారికంగా అంచనా లేదని తెలియజేశారు. అయితే, విదేశాలలో నిల్వ చేసిన నల్లధనాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ఇటీవలి కాలంలో అనేక చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు.
‘‘ది బ్లాక్ మనీ ఇంపోసిషన్ ఆఫ్ టాక్స్ యాక్ట్-2015’’ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2017 జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం విదేశాలలో బ్లాక్‌మనీ జమచేసిన వారి కేసులపై సమర్థవంతంగా వ్యవహరిస్తుంది. బ్లాక్‌మనీపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. ఈ సిట్‌కు ఛైర్మన్, వైస్ చైర్మన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు వ్యవహరిస్తారు. ఇతర దేశాల్లో ఉన్న నల్లధనాన్ని తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలతో భారత్ కలిసి పనిచేస్తోంది.
బ్లాక్ మనీ యాక్ట్ కింద ఇప్పటివరకు 107 ఫిర్యాదులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బ్లాక్ మనీ యాక్ట్ సెక్షన్ 10 (3) / 10 (4) ప్రకారం, 2021 మే 31 వరకు 166 కేసులలో అసెస్‌మెంట్ ఆర్డర్లను జారీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. కాగా ఇందులో రూ .8,216 కోట్లు రికవరీ చేశామని కేంద్రం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment