న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులను కూడా వస్తు, సేవల పన్నుల విధానం పరిధిలోకి తెచ్చే అంశాన్ని జీఎస్‌టీ కౌన్సిల్ పరిశీలిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి హస్‌ముఖ్ అధియా తెలిపారు. వీటిని జీఎస్‌టీలోకి చేర్చడం దశలవారీగా జరగవచ్చని పేర్కొన్నారు. జీఎస్‌టీని సమగ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, అయితే మరింత మెరుగుపర్చేందుకు చేయాల్సినది ఇంకా చాలా ఉందని అధియా తెలిపారు.
మొత్తం రీఫండ్ ప్రక్రియ అంతా కూడా ఆటోమేటిక్‌గా జరిగిపోయేలా తగు విధానాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. రేట్లు, శ్లాబ్స్‌ని మరింత సరళం చేయాల్సిన అవసరం ఉన్న సంగతిని ప్రభుత్వం కూడా గుర్తించిందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాము చేయగలిగినంత చేశామని అధియా పేర్కొన్నారు. జీఎస్‌టీలో ప్రస్తుతం 5%, 12%, 18%, 28 శాతం చొప్పున నాలుగు శ్లాబులు ఉన్నాయి.
ప్రస్తుతం డీజిల్, పెట్రోల్, ముడిచమురు, సహజ వాయువు, విమాన ఇంధనం మొదలైనవి దీని పరిధిలో లేవు. రాష్ట్రాలు వీటిపై విలువ ఆధారిత పన్నులు విధిస్తున్నాయి. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో సింహభాగం వాటా ఉండే విమాన ఇంధనంపై (ఏటీఎఫ్) భారీ పన్నులపై ఆందోళన వ్యక్తం చేస్తూ పౌర విమానయాన శాఖ కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ కూడా రాసింది. సాధ్యమైనంత త్వరగా పూర్తి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభించేలా ఏటీఎఫ్‌ను జీఎస్‌టీలోకి చేర్చాలని కోరింది. ఆర్థిక శాఖ కూడా ఇందుకు సుముఖంగానే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment