వస్తు సేవల పన్ను(జీఎస్టీ) జూలై 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం మంగళవారం స్పష్టంచేసింది. జూలై 1 నుంచి అమలు చేయడం కోసం పనులన్నీ చకచకా జరుగుతున్నాయంది.
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) జూలై 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం మంగళవారం స్పష్టంచేసింది. జూలై 1 నుంచి అమలు చేయడం కోసం పనులన్నీ చకచకా జరుగుతున్నాయంది. ‘జూలై 1 నుంచే జీఎస్టీని అమలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్న సమయానికి వ్యాపారులందరూ జీఎస్టీ కింద నమోదయ్యేలా చూసేందుకు సీబీఈసీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్) రాష్ట్రాలతో కలిసి తీవ్రంగా శ్రమిస్తోంది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘జీఎస్టీ అమలు ఆలస్యం అవుతుందని వస్తున్న వార్తలు అవాస్తవాలు. వాటిని నమ్మి తప్పుదారి పట్టకండి’ అని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా ట్విటర్‌లో పేర్కొన్నారు.
2.29 శాతం పెరగనున్న ముఖ్యమైన ఔషధాల ధరలు
జీఎస్టీ అమలైతే చాలా వరకు ముఖ్యమైన ఔషధాల ధరలు 2.29 శాతం వరకు పెరగనున్నాయి. ‘ముఖ్యమైన ఔషధాల జాతీయ జాబితా’లో హెపారిన్, వార్ఫారిన్, డైల్టియాజెమ్, డయాజెపమ్, ఐబూప్రొఫేన్, ప్రొప్రనోలోల్, ఇమాటినిబ్ తదితర మందులు ఉన్నాయి. వీటన్నింటి ధరలు 2.29 శాతం పెరుగుతాయి. జీఎస్టీలో మందులను 12 శాతం శ్లాబ్‌లోకి చేర్చడమే ఇందుకు కారణం.