న్యూఢిల్లీ: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) తీసుకురావడాన్ని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా సమర్థించుకున్నారు. ఎల్‌టీసీజీ నుంచి ఈక్విటీలను మినహాయించడం వల్ల ఆస్తుల విలువలు అధిక స్థాయికి చేరతాయని, దీనివల్ల చిన్న ఇన్వెస్టర్లకు రిస్క్ బాగా పెరిగిపోయే అవకాశాలుంటాయని చెప్పారాయన. 14 ఏళ్ల తర్వాత ఎల్‌టీసీజీని తిరిగి తీసుకురావడం వెనుక ఉన్న కారణాలను వెల్లడిస్తూ... ‘‘ఇతర అన్ని రకాల సాధనాల్లో పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఉంది. ఈక్విటీలకు మినహాయింపు ఇవ్వడం వల్ల పక్కదారి పడుతుంది.
నాలుగైదు సాధనాల్లో ఒకదానికి పన్ను లేకపోతే చాలా మంది తమ నిధుల్ని అందులోనే పెట్టాలనుకుంటారు. దాంతో డిమాండ్ పెరిగి, పెద్ద ఎత్తున నిధులు షేర్లు, ఫండ్స్ వెంట పడితే వాటి విలువలు అనూహ్యంగా పెరిగిపోతాయి. కొన్ని సందర్భాల్లో ఈ విలువలు ఆయా కంపెనీల వాస్తవ విలువలను కూడా ప్రతిఫలించేలా ఉండవు. దానివల్ల చిన్న ఇన్వెస్టర్లకు అధిక ముప్పు ఉంటుంది’’ అని అధియా వివరించారు. ఒక పెట్టుబడి విభాగాన్ని పూర్తిగా పన్నుకు దూరంగా ఉంచడం సరికాదన్నారు. పీహెచ్‌డీ చాంబర్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అధియా ఈ మేరకు మాట్లాడారు.
దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం, కొన్ని రోజుల నుంచి అంతర్జాతీయంగా మార్కెట్ల తగ్గుదలలో భాగమేనని, ఎల్‌టీసీజీ తీసుకురావడం వల్ల కాదన్నారు. సోమవారం దేశీయ మార్కెట్లలో ఎఫ్‌ఐఐలు నికర కొనుగోలుదారులుగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. భారత్ ఇప్పటికీ పెట్టుబడుల పరంగా ఆకర్షణీయంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఏడాదిలోపు పెట్టుబడులపై 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను ఉండగా, దీర్ఘకాలిక పెట్టుబడులపై మూలధన లాభాల పన్ను లేదు. ఈ నేపథ్యంలో 10 శాతం ఎల్‌టీసీజీని కేంద్రం ప్రతిపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment