న్యూఢిల్లీ: కష్టకాలంలో కాసులు రాబట్టుకునే మార్గాలపై కేంద్ర సర్కారు దృష్టి పెట్టింది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.8 వరకు ఎక్సైజ్ సుంకం పెంచుకునేందుకు వీలుగా సోమవారం చట్ట సవరణ చేసింది. ఆర్థిక బిల్లు, 2020లో ఈ మేరకు సవరణను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ సవరణకు, ఆర్థిక బిల్లు 2020కు లోక్‌సభ ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం తెలియజేసింది. దీంతో ప్రత్యేక పరిస్థితుల్లో పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం లీటర్‌కు రూ.18 వరకు, డీజిల్‌పై రూ.12 వరకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం కింద పెంచుకోవడానికి వీలుంటుంది.
సవరణ ముందు వరకు పెట్రోల్‌పై గరిష్టంగా రూ.10, డీజిల్‌పై రూ.4 వరకే ఎక్సైజ్ సుంకం విధించేందుకు కేంద్ర సర్కారుకు చట్ట పరంగా అవకాశం ఉండేది. కాగా, అంతర్జాతీయంగా చమురు ధరలు అత్యంత కనిష్టాలకు చేరడంతో.. ఆదాయ పెంపు చర్యల్లో భాగంగా డీజిల్, పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3 చొప్పున కేంద్రం ఎక్సైజ్ సుంకం పెంచుతూ ఈ నెల 14న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనివల్ల సర్కారుకు రూ.39,000 కోట్ల అదనపు ఆదాయం వార్షికంగా సమకూరనుంది. ఈ పెంపుతో చట్ట పరంగా ఎక్సైజ్ సుంకం గరిష్ట స్థాయిలకు చేరింది. అందుకే చట్టంలో సవరణలు తీసుకొచ్చింది.
పార్లమెంట్ నిరవధిక వాయిదా
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం బడ్జెట్ సమావేశాలు మరో 11 రోజులు మిగిలి ఉండగానే పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడింది. సభ్యులంతా సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని లోక్‌సభాపతి ఓం బిర్లా సూచించారు. కొంతమంది ఎంపీలు క్వారంటైన్‌లోకి వెళ్లిపోవడంతోపాటు కరోనా విస్తరిస్తున్నందున తృణమూల్ కాంగ్రెస్, శివసేన తదితర పార్టీలు పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉండటంతో పార్లమెంట్ నిరవధిక వాయిదాకు నిర్ణయించారు. రాజ్యసభలో కేంద్ర పాలిత ప్రాంతాల బడ్జెట్‌పై చర్చ అనంతరం త్వరలో పదవీ విరమణ చేయనున్న 57 మంది సభ్యులకు చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.
► రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ బిల్లు, జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ వర్సిటీ బిల్లులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు.
► స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు పార్లమెంట్ ఘన నివాళులర్పించింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో మృతి చెందిన భద్రతా సిబ్బందికి కూడా నివాళులర్పించింది.
► జనతా కర్ఫ్యూ పాటించిన మార్చి 22వ తేదీ దేశానికి సూపర్ సండే అని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment