ఏసీ రెస్టారెంట్లలోనే ఇక సేవల పన్ను
ఆర్థిక మంత్రిత్వశాఖ వివరణ
► బిల్లులో 60 శాతాన్ని మినహాయించి మిగిలిన 40 శాతంపై ట్యాక్స్
► దీని ప్రకారం ‘ఎఫెక్టివ్ రేట్’ 5.6%
న్యూఢిల్లీ: సేవల పన్నుకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం ఒక కీలక వివరణ ఇచ్చింది. ఎయిర్ కండీషనింగ్ (ఏసీ) లేదా సెంట్రల్ హీటింగ్ (సీహెచ్) సదుపాయం ఉన్న రెస్టారెంట్లకు మాత్రమే సేవల పన్ను వర్తిస్తుంది. అటువంటి సదుపాయం లేని రెస్టారెంట్లు వినియోగదారుల నుంచి సేవల పన్ను వసూలు చేయాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది.
మరిన్ని ముఖ్యాంశాలు...
ఎయిర్ కండీషనింగ్ లేదా సెంట్రల్ హీటింగ్ లేని రెస్టారెంట్లు తమ కస్టమర్ల నుంచి ఎటువంటి సేవల పన్ను నూ వసూలు చేయవు. ఏసీలేని హోటళ్లు, మెస్సులు. ఫుడ్ కోర్టులకు ట్యాక్స్ నుంచి మినహాయింపు.
♦ ఒకవేళ అలాంటి సదుపాయం ఉంటే మొత్తం బిల్లు సొమ్ములో 60 శాతాన్ని మినహాయించి మిగిలిన 40 శాతానికి మాత్రమే సేవల పన్ను ఉంటుంది. ఈ విధంగా చూస్తే మొత్తంగా సేవల పన్ను (ఎఫెక్టివ్ రేట్) 5.6 శాతంగా ఉంటుంది.
♦ సేవల పన్ను వర్తించకూడదంటే... రెస్టారెంట్‌లోని ఏ భాగంలోనూ ఏసీ లేదా సీహెచ్‌లు ఉండకూడదు.
♦ జూన్ 1 నుంచీ సేవల పన్నును 14 శాతానికి (విద్యా సుంకాన్ని కలుపుకుని) పెంచారు. దీని ప్రకారం, చార్జ్ చేసిన మొత్తంపై ఎఫెక్టివ్ రేటు 5.6 శాతం ఉంటుంది.
♦ జూన్ 1కి ముందు 12.36 శాతం సేవల పన్ను ఉన్నప్పుడు ఎఫెక్టివ్ రేట్ 4.94 శాతం.
♦ జూన్ 1 నుంచీ సేవల పన్ను పెంపు వల్ల హోటల్లో, రెస్టారెంట్లో భోజనం మాత్రమే కాదు. మొబైల్, ఇంటర్నెట్, విమాన ప్రయాణాలు, ఇంటర్నెట్‌లో తీసుకునే రైలు టికెట్లు, కేబుల్ సర్వీసులు, బ్యూటీ పార్లర్స్, హెల్త్ క్లబ్స్, వినోదం... ఇలా దాదాపు అన్ని సేవలూ ప్రియమయ్యాయి. పర్యాటకం, ఆతిథ్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, రవాణా, రియల్టీ, ఆటో రంగాలపై ప్రధానంగా ఈ భారం పడుతోంది.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రకంగా సేవల పన్ను పెంపు భారం అయ్యింది.
♦ దేశీయ పరోక్ష పన్నుల వ్యవస్థ 2016 ఏప్రిల్ 1 నుంచీ ‘వస్తువులు, సేవల పన్ను’గా (జీఎస్‌టీ) మారుతోంది. ఈ కొత్త వ్యవస్థకు అనుగుణంగా సేవల పన్ను రేట్లను పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 2015-16 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా చెప్పారు.
ప్రభుత్వానికి లాభమెంత?
సేవల పన్ను ద్వారా కేంద్రానికి వచ్చిన మొత్తం గత ఆర్థిక సంవత్సరం రూ.1.68 లక్షల కోట్లు. తాజా పెంపు వల్ల ఈ మొత్తం 25 శాతం వృద్ధితో రూ.2.09 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అంటే... దాదాపు రూ. 40 వేల కోట్ల రూపాయలు జనం జేబుల్లోంచి ప్రభుత్వ ఖజానాలోకి చేరుతాయన్న మాట.