మరిన్ని సేవలపై పన్ను పోటు... | More services tax pressure | Sakshi
Sakshi News home page

మరిన్ని సేవలపై పన్ను పోటు...

Published Tue, Mar 1 2016 5:12 AM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM

మరిన్ని సేవలపై పన్ను పోటు...

మరిన్ని సేవలపై పన్ను పోటు...

న్యూఢిల్లీ: కొన్ని సర్వీసులకు ఇప్పటిదాకా ఇస్తున్న పన్ను మినహాయింపులను ఉపసంహరించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. మరికొన్నింటికి మాత్రం మినహాయింపులను ఇచ్చారు. సీనియర్ అడ్వకేట్లు.. ఇతర అడ్వొకేట్లకు అందించే సర్వీసులపై 14 శాతం పన్ను విధించనున్నట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అలాగే ప్రజా రవాణా సేవలు అందించే స్టేజ్ క్యారియర్లను నెగటివ్ లిస్టు నుంచి తొలగించారు. ఈ సర్వీసులపై జూన్ 1 నుంచి 5.6% సర్వీస్ ట్యాక్స్ విధించనున్నట్లు జైట్లీ తెలిపారు. మరోవైపు, సేవా పన్నుల ఎగవేతల్లో ప్రాసిక్యూషన్‌కు సంబంధించి బడ్జెట్‌లో కొన్ని మార్పులు ప్రతిపాదించారు. వీటి ప్రకారం పన్నులు వసూలు చేసి, వాటిని ఖజానాకు జమ చేయని పక్షంలోనే  పన్ను చెల్లింపుదారుపై చర్యలకు అవకాశం ఉంటుంది. ప్రాసిక్యూషన్‌కు అర్హమయ్యే ఎగవేత పరిమాణాన్ని రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్లకు పెంచారు. టెలికాం స్పెక్ట్రమ్‌ను బదలాయించడం సర్వీసు పరిధిలోకి వస్తుందని, దీనికి సేవాపన్ను వర్తిస్తుందని జైట్లీ స్పష్టంచేశారు.

 మినహాయింపులూ ఉన్నాయ్..
అందరికీ ఇళ్లు (హెచ్‌ఎఫ్‌ఏ), ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) తదితర పథకాల కింద చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టులపై 5.6% సర్వీస్ ట్యాక్స్‌ను ఎత్తివేస్తున్నట్లు జైట్లీ తెలిపారు. పీఎంఏవైలో భాగంగా 60 చ.మీ. కన్నా తక్కువ కార్పెట్ ఏరియా ఉండే హౌసింగ్ ప్రాజెక్టులకు కూడా మార్చి 1 నుంచి ఇది వర్తిస్తుంది. అటు, సెబీ, ఐఏఆర్‌డీఏఐ, పీఎఫ్‌ఆర్‌డీఏ తదితర నియంత్రణ సంస్థల సర్వీసులపైనా ఏప్రిల్ 1 నుంచి 14% సర్వీస్ ట్యాక్స్‌ను కూడా ఉపసంహరిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ వంటి వాటితో బాధపడే వారి సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ‘నిరామయా’ ఆరోగ్య బీమా పథకంలో భాగమైన జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల సర్వీసులకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సేవా పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. ప్రస్తుతం వీటిపై 14% సర్వీస్ ట్యాక్స్ ఉంటోంది.

 మరిన్ని విశేషాలు ..
నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్ చెయిన్ డెవలప్‌మెంట్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల్య యోజన  భాగస్వామ్య సంస్థలు అందించే సేవలపై ట్యాక్స్‌ను ఉపసంహరించారు. ఇది ప్రస్తుతం 14 శాతంగా ఉంది.

దేశీ షిప్పింగ్ సంస్థలకు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లలోని కొన్ని కోర్సులకు సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది.

నిర్దిష్ట పరిమితికి మించి సెంట్రల్ ఎక్సైజ్ చెల్లించాల్సిన వారు దాఖలు చేయాల్సిన రిటర్నుల సంఖ్యను ఏకంగా 27 నుంచి 13కి తగ్గించారు. ఇకపై నెలకొకటి చొప్పున పన్నెండు నెలలకు పన్నెండు, వార్షికంగా ఒకటి దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే నెలవారీ రిటర్నులకు ఈ-ఫైలింగ్ విధానం ఉండగా.. త్వరలో వార్షిక రిటర్నులకు కూడా దీన్ని అందుబాటులోకి తేనున్నారు. అటు సర్వీస్ ట్యాక్స్ అసెసీలు వార్షికంగా మూడు రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement