నువ్వు నేను జైట్లీ | jaitley budget all Reinforce to villages | Sakshi
Sakshi News home page

నువ్వు నేను జైట్లీ

Published Tue, Mar 1 2016 6:00 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

నువ్వు నేను జైట్లీ

నువ్వు నేను జైట్లీ

చదివింది ఢిల్లీ పార్లమెంట్లో అయినా ఈ సారి బడ్జెట్ తిరిగింది మాత్రం మన ఊరి చుట్టూనే. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేరుగా ఊళ్లోకొచ్చేశారు. గ్రామీణ రంగానికి భారీ కేటాయింపులతో పాటు... పంచాయతీలు, మున్సిపాలిటీలను పరిపుష్టం చేయడానికి ఏకంగా 2.87 లక్షల కోట్లు కేటాయించారు. రెండేళ్లలో కరెంటు లేని గ్రామం ఉండదని, మూడేళ్లలో 6 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కంప్యూటర్ విద్య అందిస్తామని హామీ ఇచ్చారు జైట్లీ. ప్రతి గ్రామానికీ రోడ్డు వేయటమే కాక... నిరుపయోగంగా ఉన్న ఎయిర్‌పోర్టులూ వాడకంలోకి తెస్తారట. ఇవన్నీ జరిగితే.. మన ఊరు... ఇదిగో ఈ చిత్రంలోలానే పచ్చగా కళకళలాడుతుంది.

 నిరుపేదకు సుస్తీ చేస్తే..?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనైతే వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఆరోగ్య శ్రీ తెచ్చారు. మరి మిగతా రాష్ట్రాల సంగతో!!. ఒకరకంగా ఇపుడిది దేశమంతటా విస్తరించనుంది. కుటుంబానికి లక్ష రూపాయల వరకూ బీమా కల్పిస్తారు. వృద్ధులకైతే ఇది 1.3 లక్షలు. అంతేకాదు! చౌక మందుల కోసం మరిన్ని జన ఔషధి స్టోర్లొస్తాయి. కిడ్నీ వ్యాధుల బారినపడ్డవారి సంఖ్య పెరగటంతో జాతీయ డయాలసిస్ ప్రోగ్రామ్ కూడా రాబోతోంది.

పెద్దలకు గౌరవం
ఉద్యోగం వచ్చిన దగ్గర్నుంచి పింఛను కోసం దాచుకుని... తీరా తీసుకునేటపుడు పన్ను కట్టాలంటే... అదీ రిటైరైన సమయంలో!! ఆ బాధ మామూలుగా ఉండదు. జైట్లీకి అర్థమై ఉండొచ్చు. ఎన్‌పీఎస్‌లో ఆ భారం తొలగించారు. పింఛనుకోసం కట్టే బీమా పాలసీలపై కూడా సేవా పన్ను తగ్గించారు.

 కట్టెలపొయ్యి అక్కర్లేదిక..
గ్యాస్ పొయ్యి ఉన్నోళ్లంతా గొప్పోళ్లు కాదిక. ప్రతి ఒక్కరికీ గ్యాస్ ఇవ్వటానికి రూ.2 వేల కోట్లు కేటాయించారు. ఈ ఏడాది కోటిన్నర మందికి... ఐదేళ్లలో 6 కోట్ల మందికి గ్యాస్ పొయ్యిలందుతాయి. ఆధార్ ద్వారా పథకాలన్నీ నేరుగా చేరేలా దానికి చట్టబద్ధత కల్పిస్తారు.

ఊళ్లలోకి విదేశీ నిధులు కూడా..!
వ్యవసాయానికి విదేశీ నిధుల దన్ను కూడా దొరకబోతోంది. ఎందుకంటే దేశంలో ఆహార పదార్థాల ఉత్పత్తి, తయారీ కార్యకలాపాలకు 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని అనుమతిస్తారు. అది కూడా నేరుగా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డే అనుమతిస్తుంది. ఆహారధాన్యాల ధరల్లో హెచ్చుతగ్గుల్ని నియంత్రించడానికి రూ.900 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి కూడా.

ఉద్యోగాల కోసం.. ఉద్యోగుల కోసం
కంపెనీలు పీఎఫ్ భారం లేకుండా కొత్తగా ఉద్యోగాలివ్వటానికి... మూడేళ్ల పాటు కేంద్రమే యాజమాన్య పీఎఫ్ వాటాను చెల్లిస్తుంది. యువతలో స్కిల్స్ అభివృద్ధి చేయటానికి శిక్షణ సంస్థలు ఏర్పాటవుతున్నాయి. సొంత కంపెనీలు పెట్టేలా ప్రోత్సహించడానికి మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులూ రానున్నాయి.

స్కూల్ చలే హమ్..
స్కూలు మారినప్పుడల్లా ఓ సర్టిఫికెట్. ఫస్టొస్తే ఒకటి... సెకండొస్తే మరొకటి.  మార్కుల జాబితాలూ అంతే! స్కూళ్లు మారుతున్నపుడు, జాబ్ ఇంటర్వ్యూకు వెళ్లినపుడు... తీసుకెళ్లాల్సిందే. ఇక బీమా పాలసీల్లా, కంపెనీ షేర్లలా వీటినీ డిజిటల్ రూపంలో దాచుకోవచ్చు. దీనికి డిజిటల్ డిపాజిటరీ వస్తోంది. ఇంకా 62 నవోదయ స్కూల్స్ వస్తాయి. రూ.1000 కోట్లతో ఉన్నత విద్యకు ఫైనాన్సింగ్ ఏజెన్సీ కూడా పెడతారు.

జై కిసాన్..
నిజం! ఈ బడ్జెట్లోనైతే రైతే రాజు. పంట పండుతుందో లేదోననే భయం ఉన్నా... పథకాల పంట మాత్రం పండింది. నష్టపోతే ఆదుకోవటానికి బీమా పథకం. 28.5 లక్షల ఎకరాల కోసం సాగునీటి పారుదల పథకం. బోర్లు ఎండి పోకుండా.. భూగర్భ జలవనరుల పథకం. సేంద్రీయ సాగు ప్రోత్సాహానికి మరో పథకం. దీర్ఘకాలంగా సాగుతూ ఉన్న 89 ప్రాజెక్టులిక శరవేగంగా పూర్తవుతాయి. వర్షాభావ ప్రాంతాల్లో 5 లక్షల చెరువులు, బావులు తవ్వుతారు. సేంద్రీయ ఎరువుల తయారీకి 10 లక్షల కంపోస్ట్ గుంతల్నీ ఏర్పాటు చేస్తారు. వచ్చే మార్చికల్లా 14 కోట్ల భూ కమతాలకూ భూసార ఆరోగ్య కార్డులొస్తాయి.

చిన్నకంపెనీ పెద్ద రిలీఫ్
ఊళ్లలో ఉన్నా, సిటీల్లో ఉన్నా... చిన్న కంపెనీలు ఇక ఖాతా పుస్తకాలు రాయక్కర్లేదు. టర్నోవరు మాత్రం రూ. 2 కోట్లలోపుంటే చాలు. డాక్టరుతో సహా వృత్తి నిపుణులకూ ఈ రిలీఫ్ ఇచ్చారు. వారి సంపాదన ఏడాదికి 50 లక్షలు మించకూడదు.

చిన్న ఉద్యోగికి ఊరటే...
నెల జీతం 41వేలు లోపుంటే.. ఏడాదికి మరో 3వేలు మిగులుతుంది. కాస్త రిబేటు పెంచారు లెండి. హెచ్‌ఆర్‌ఏ కంపెనీ ఇవ్వకపోతే... అలాంటివారికి కూడా కాస్త ఊరటనిచ్చారు. పెరిగిన ధరలతో పోలిస్తే ఇదేం మూలకనే పెదవి విరుపు చిరుద్యోగి సొంతం మరి.

కారు మబ్బులు..
ఊళ్లోకి రాకుండా దూరంగా వె ళ్లే కారును, శ్రీమంతుల్ని కూడా జైట్లీ వదల్లేదు. కార్లపై సెస్సులు వేసి ధరలు పెంచారు. ఏటా రూ.కోటి ఆదాయం దాటే వారిపై మరో 3 శాతం సర్‌చార్జీ వడ్డించారు. పెట్టుబడులపై  డివిడెండ్లు అందుకునేవారినీ బాదారు.

‘పాడికీ పథకాలు’
మన ఒంగోలు గిత్తల్లా కొన్ని పశు జాతులు అంతరించిపోతున్నాయి. అందుకే వీటికి జాతీయ జినోమిక్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. పశుధన్ సంజీవని, నకుల్ స్వాస్థ్య పాత్ర, ఈ-పశుధన్ హాత్ వంటి పథకాలనూ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement