రూ. 10,000 కోట్లు రాయితీల్లో కోత ఇదీ...
ఆహార సబ్సిడీ రూ.1.39 లక్షల కోట్ల నుంచి రూ.1.34 లక్షల కోట్లకు
న్యూఢిల్లీ: ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై రాయితీలను వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో నాలుగు శాతానికి పైగా తగ్గించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సబ్సిడీ బిల్లు కింద 2,31,781.61 కోట్లు కేటాయించారు. 2015-16 సంవత్సరంలో సబ్సిడీ బిల్లు సవరించిన అంచనాల ప్రకారం 2,41,856.58 కోట్లుగా ఉండగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనిని దాదాపు 10 వేల కోట్ల రూపాయల మేర తగ్గించారు. 2015-16 లో ఆహార సబ్సిడీ బిల్లు రూ. 1,39,419 కోట్లుగా ఉండగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దానిని రూ. 1,34,834.61 కోట్లకు తగ్గించారు. అలాగే.. ఎరువుల సబ్సిడీని రూ. 72,437.58 కోట్ల నుంచి రూ. 70,000 కోట్లకు, పెట్రోలియం సబ్సిడీని రూ. 30,000 కోట్ల నుంచి వచ్చే ఏడాదిలో రూ. 26,947 కోట్లకు కుదించారు.
♦ వచ్చే ఏడాది ఎరువుల సబ్సిడీకి 70 వేల కోట్లు కేటాయింపులు జరిపారు. అందులో యూరియా సబ్సిడీకి రూ. 51,000 కోట్లు, అనియంత్రిత ఫాస్ఫరిక్, పొటాసిక్ ఎరువులకు రూ. 19,000 కోట్లు కేటాయించారు.
♦ యూరియా సబ్సిడీ రూ. 51 వేల కోట్లలో.. రూ. 40 వేల కోట్లను దేశీయ యూరియాకు, మిగతా మొత్తాన్ని దిగుమతి చేసుకునే యూరియాకు
సబ్సిడీగా పేర్కొన్నారు.
♦ అనియంత్రిత పాస్ఫరిక్, పొటాసిక్ ఎరువులకుకేటాయించిన రూ. 19 వేల కోట్లలో దేశీయంగా ఉత్పత్తి చేసే ఎరువులకు రూ. 12 వేల కోట్లు, దిగుమతి చేసుకునే ఎరువులకు రూ. 6,999.99 కోట్లు కేటాయించారు. ఇందులోనే సిటీ కంపోస్ట్ ఉత్పత్తికి సాయంగా రూ. 1 లక్ష కేటాయించారు.
♦ పెట్రోలియం సబ్సిడీ కింద రూ. 26,947 కోట్లు కేటాయించగా.. అందులో రూ. 19,802.79 కోట్లు ఎల్‌పీజీ సబ్సిడీ కింద, మిగతా మొత్తాన్ని కిరోసిన్ సబ్సిడీ కింద కేటాయింపులు జరిపారు.