Rebates
-
ఐటీ పోర్టల్‌లో అప్డేట్.. ఆ మినహాయింపు దూరం!
ఆదాయపు పన్ను పోర్టల్‌లో ఇటీవలి అప్డేట్ కారణంగా కొత్త పన్ను విధానాన్ని ఉపయోగిస్తున్న పన్ను చెల్లింపుదారులు ముఖ్యమైన మినహాయింపును కోల్పోయే ప్రమాదం వచ్చింది.ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 87A కింద లభించే ఈ మినహాయింపు, తక్కువ-ఆదాయం ఉన్నవారికి (రూ. 7 లక్షల లోపు) రూ. 25,000 వరకు పన్ను మినహాయింపును అందిస్తుంది.ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో అప్డేట్ చేసిన ట్యాక్స్ ఫైలింగ్ యుటిలిటీని ఉపయోగించి కొత్త పన్ను విధానం కింద రిటర్న్స్ ఫైల్ చేస్తున్న ట్యాక్స్ పేయర్లు స్వల్పకాలిక మూలధన లాభాలను నమోదు చేసినట్లయితే రూ. 25,000 వరకు లభించే పన్ను మినహాయింపునకు దూరం కావాల్సి వస్తోంది.ఈ రిబేట్ అనేది ఆదాయపు పన్నుపై ఇచ్చే రాయితీ. ఇది తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు వారి పన్నును తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. కేంద్ర బడ్జెట్ 2023లో మార్పుల ప్రకారం, మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉంటే రూ. 25,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.అసలేమైంది? మినహాయింపు అర్హత కోసం పోర్టల్ 'మొత్తం పన్ను విధించదగిన ఆదాయాన్ని' గణించే విధానంలో వ్యత్యాసం కారణంగా సమస్య తలెత్తుతోంది. చార్టర్డ్ అకౌంటెంట్ల ప్రకారం, ప్రస్తుత వ్యవస్థ ఈ గణనలో స్వల్పకాలిక మూలధన లాభాలను (STCG) తప్పుగా చేర్చింది.ఇది స్వల్పకాలిక మూలధన లాభాలు కలిగినవారు ఆదాయం పరిమితి రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉన్నప్పటికీ పన్ను మినహాయింపును తొలగిస్తోంది.కాగా జూలై 5 లోపు రిటర్న్స్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులు స్వల్పకాలిక మూలధన లాభాలతో సంబంధం లేకుండా మినహాయింపును క్లెయిమ్ చేయగలిగారు. ఆ తర్వాత రిటర్న్స్ ఫైల్ చేస్తున్నవారికే ఈ సమస్య వస్తోంది. స్వల్పకాలిక మూలధన లాభాలు మినహా స్థూల మొత్తం ఆదాయం రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉంటే, సెక్షన్ 111A స్పష్టంగా మినహాయింపును అనుమతిస్తుంది. కానీ పోర్టల్‌లో లోపం కారణంగా ఇలాంటి వారు మినహాయింపునకు దూరం కావాల్సి వస్తోంది. -
ఏపీ: అన్నదాతలకు అక్టోబర్‌లో సున్నా వడ్డీ రాయితీ
సాక్షి, అమరావతి: చిన్న, సన్నకారు రైతులతోపాటు వాస్తవ సాగుదారులకు పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీజన్ ముగియకుండానే వడ్డీ రాయితీ జమ చేస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఈ పథకం కింద ఖరీఫ్–2019 సీజన్లో 14.27 లక్షల మంది రైతులకు రూ.289.42 కోట్లు, రబీ 2019–20 సీజన్లో 6.28 లక్షల మందికి రూ.128.47 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం జమ చేసింది. అలాగే టీడీపీ హయాంలో 42.32 లక్షల మందికి బకాయిపడిన రూ.784.72 కోట్లను కూడా చెల్లించింది. ఇప్పుడు ఖరీఫ్–2020 సీజన్‌కు సంబంధించి అర్హత గల ప్రతి రైతుకు వచ్చే అక్టోబర్‌లో వడ్డీ రాయితీ జమ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఖరీఫ్–2020 సీజన్లో 86.17 లక్షల మంది రైతులకు రూ.1.47 లక్షల కోట్ల రుణాలిచ్చారు. వీరిలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్నవారు కనీసం 20 లక్షల మందికి పైగా ఉంటారని అంచనా. నిబంధనల ప్రకారం.. పంట రుణాలపై 7 శాతం వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తాయి. ఇందులో రైతులు తీసుకున్న పంట రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీని కేంద్రం భరిస్తోంది. మిగిలిన 4 శాతం వడ్డీని గతంలో రైతులే చెల్లించేవారు. ప్రస్తుతం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. తీసుకున్న రుణ మొత్తాన్ని వాయిదాలతో సహా ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతుల పొదుపు ఖాతాలకు ఈ వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది. రూ.లక్ష వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోగా తిరిగి చెల్లించిన రైతులందరూ ఈ వడ్డీ రాయితీకి అర్హులు. ఏ పంటపై రుణం తీసుకున్నారో ఆ పంటను మాత్రమే సాగు చేయాల్సి ఉంటుంది. వారు వేసిన పంటను తప్పనిసరిగా ఈ–క్రాప్ బుకింగ్‌లో నమోదు చేయించుకుని ఉండాలి. ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ పథకంపై రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లించే విధంగా రైతుల్లో చైతన్యం తెస్తున్నారు. అలాగే వారు సాగు చేసిన పంట వివరాలను తప్పనిసరిగా ఈ–క్రాప్ బుకింగ్ చేయించారో, లేదో పరిశీలించనున్నారు. గడువు తేదీలోగా రుణాలు చెల్లించిన రైతుల జాబితాను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల వద్ద ప్రదర్శించనున్నారు. అర్హులైన రైతుల వివరాలను వైఎస్సార్‌ఎస్‌వీపీఆర్ పోర్టల్‌లో గడువు తేదీలోపు బ్యాంకులు అప్లోడ్ చేసేలా పర్యవేక్షించనున్నారు. సకాలంలో చెల్లించి రాయితీ పొందండి.. ఖరీఫ్–2020 సీజన్లో రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకుని సెప్టెంబర్ నెలాఖరులోపు తిరిగి చెల్లించిన వారందరికీ 4 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. గడువులోగా వడ్డీతో సహా పంట రుణాన్ని చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సమీప రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాలి. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
కొత్త వాహనంపై 5 శాతం రిబేటు
న్యూఢిల్లీ: స్క్రాపేజీ (తుక్కు) విధానం కింద పాత కార్లను వదిలించుకుని, కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి 5 శాతం రిబేటు లభిస్తుందని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ‘ఇలా కొత్త కారు కొనుగోలు చేసే వారికి ఆటోమొబైల్ కంపెనీలు దాదాపు 5 శాతం రిబేటు ఇస్తారు‘ అని ఆయన తెలిపారు. ‘స్క్రాపేజీ విధానంలో నాలుగు అంశాలు ఉన్నాయి. వాటిలో రిబేటు కూడా ఒకటి. దీనితో పాటు కాలుష్యం వెదజిమ్మే పాత వాహనాలపై హరిత పన్ను మొదలైనవి విధించడం, ఫిట్నెస్ టెస్టు, పొల్యూషన్ టెస్టు చేయించుకోవడం తప్పనిసరి చేయడం మొదలైనవి ఉన్నాయి. టెస్టింగ్ కోసం దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్లు అవసరం. వీటి ఏర్పాటుపై దృష్టి పెడుతున్నాం’ అని మంత్రి చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఇక స్క్రాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడంలో ప్రైవేట్ సంస్థలు, రాష్ట్రాల ప్రభుత్వాలనకు కేంద్రం తగు సహయా సహకారాలు అందిస్తుందని తెలిపారు. టెస్టుల్లో విఫలమైన వాహనాలను నడిపే వారికి భారీ జరిమానాలు విధించడంతో పాటు వాహనాన్ని జప్తు కూడా చేయొచ్చని పేర్కొన్నారు. ఆటోమొబైల్‌కు వరం.. స్క్రాపేజీ విధానం.. ఆటోమొబైల్ రంగానికి వరంగా మారుతుందని గడ్కరీ చెప్పారు. దీనితో అత్యంత లాభసాటి రంగంగా ఆటోమొబైల్ పరిశ్రమ ఎదగగలదని, భారీ స్థాయిలో ఉపాధి కల్పించగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ. 4.5 లక్షల కోట్లుగా ఉన్న దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ టర్నోవరు.. రాబోయే రోజుల్లో 30 శాతం పైగా వృద్ధి చెందగలదని.. దాదాపు రూ. 10 లక్షల కోట్లకు చేరగలదని గడ్కరీ వివరించారు. టర్నోవరులో రూ.1.45 లక్షల కోట్లుగా ఉన్న ఎగుమతులు.. రూ. 3 లక్షల కోట్లకు చేరగలదన్నారు. స్క్రాపేజీ పాలసీ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే తుక్కుగా మార్చిన వాహనాల నుంచి.. ఉక్కు, ప్లాస్టిక్, రబ్బరు, అల్యూమినియం వంటి ముడి సరుకు లభ్యత పెరుగుతుందని, దీనితో ఆటోమొబైల్ పరికరాల తయారీ ఖర్చులు 30–40 శాతం దాకా తగ్గగలదని గడ్కరీ చెప్పారు. -
విద్యుత్ బిల్లు.. ముందే చెల్లిస్తే రిబేటు!
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ బిల్లులను ముందుగానే చెల్లించే వినియోగదారులకు చార్జీలను తగ్గించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు రిటైల్ టారిఫ్ ఖరారు నిబంధనలను సవరించాలని సూచించింది. 2020–21లో అమలు చేయనున్న విద్యుత్ టారిఫ్‌ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు త్వరలో సమర్పించనున్నాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ముందస్తు బిల్లుల చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రిబేటును ప్రతిపాదించే అవకాశాలున్నాయి. వర్కింగ్ కాపిటల్ భారం తగ్గుదల.. గత ఆగస్టులో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అవసరమైన విద్యుత్ కొనుగోళ్ల కోసం డిస్కంలు కనీసం ఒకరోజు ముందు ఉత్పత్తి కంపెనీలకు బిల్లుల చెల్లింపులు జరపాలని ఆదేశించింది. దీంతో డిస్కంలు వ్యయప్రయాసలు పడుతూ ముందస్తు చెల్లింపులు జరుపుతున్నాయి. దీంతో ఉత్పత్తి కంపెనీలపై వర్కింగ్ కాపిటల్ భారం తగ్గుతోంది. జనరేటింగ్ టారిఫ్ తగ్గించాలి.. వర్కింగ్ కాపిటల్ తగ్గుతున్న నేపథ్యంలో ఉత్పత్తి కంపెనీలకు డిస్కంలు చెల్లించే జనరేటింగ్ టారిఫ్‌ను తగ్గించాలని తాజాగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సూచించింది. ఉత్పత్తి కంపెనీల వర్కింగ్ కాపిటల్ భారం తగ్గితే ఆ మేరకు డిస్కంలకు పూర్తిస్థాయి పరిహారం అందించడానికి ప్రస్తుత రిబేటు విధానం సరిపోదని, కొత్త విధానాన్ని ఈఆర్సీ రూపొందించాలని కోరింది. అదే విధంగా వినియోగదారులూ ముందస్తుగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తే డిస్కంలకు వర్కింగ్ కాపిటల్ భారం తప్పనుంది. ఆ మేరకు ముందస్తుగా చెల్లింపులు జరిపితే రిబేటు అందించేందుకు వారి విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరింది. -
రిబేటు.. డౌటే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : వాయిదాల ప్రకారం రుణాలు చెల్లించినవారికి ఇవ్వాల్సిన ‘రిబేటు’కు రాష్ట్ర ప్రభుత్వం ఎగనామం పెట్టింది. తొమ్మిదేళ్లు గడిచినా ఖాతాల్లో వడ్డీ రాయితీ జమ కాకపోవడం అన్నదాతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో 2009 నుంచి ఇప్పటివరకు 15,130 మంది రైతులకు రూ.300 కోట్ల మేర దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేశారు. అప్పులు పొందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సభ్యులు కోళ్లఫారాలు, డెయిరీ ఫామ్‌లు నిర్వహిస్తూ, జీవాలను పోషిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వీరు ఆర్థిక సంవత్సరం ముగింపు (మార్చి 31వ తేదీ)లోపు నిర్దేశించిన వాయిదా సొమ్ము జమ చేస్తే అప్పు కింద కట్టే వడ్డీలో 6శాతం తగ్గింపును ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తుంది. ప్రకృతి విపత్తులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పౌల్ట్రీ, డెÆయిరీ నిర్వహణలో నష్టం వచ్చినా, వ్యాధులు సోకి గొర్రెలు, మేకలు మృత్యువాతపడినా.. అప్పులు చేసి నగలు తాకట్టు కుదవ పెట్టి గడువులోపే కిస్తీలు కట్టారు. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ సహకార సంఘాలు: 48 మొత్తం సభ్యుల సంఖ్య: 64,100 2009 నుంచి జరిగిన రుణ వితరణ: రూ.300 కోట్లు వాయిదాలు సకాలంలో చెల్లించిన రైతులు: 15,130 వడ్డీలో 6% శాతం తగ్గింపు రూపేణా అందాల్సింది: రూ.8.13 కోట్లు రూ.8.13 కోట్ల మేర బకాయి రిబేటు రూపేణా సహకార సంఘాల సభ్యులకు రూ.8.13 కోట్ల మేర రావాల్సివుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సకాలంలో ఈ నిధులు విడుదలయ్యాయి. ఆయన మరణానంతరం వడ్డీ తగ్గింపు నిధుల ఊసే లేకుండా పోయింది. దీంతో తొమ్మిదేళ్లుగా ఈ నిధుల కోసం రైతాంగానికి ఎదురుచూపులు తప్పడం లేదు. అప్పట్లో నిర్ణీత వ్యవధిలో ఈ సొమ్ము రైతుల పద్దులో జమ కావడంతో సకాలంలో అప్పులు చెల్లించేందుకు మొగ్గు చూపేవారు. ఈసారి కూడా రిబేటు బకాయిలు విడుదల చేయకపోతే మార్చిలో చెల్లించాల్సిన వాయిదాలను వాయిదా వేస్తామని అన్నదాతలు అంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు తదితర మండలాల్లో వేలాది మంది రైతులు దీర్ఘాకాలిక రుణాలు పొందారు. డిస్కౌంట్ నిధులను ఇవ్వకపోవడం మంచి పద్ధతి కాదని పీఏసీఎస్ చైర్మన్లు.. డీసీసీబీ పాలకవర్గం దృష్టికి తెచ్చినా అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కావడంతో డీసీసీబీ మిన్నకుండిపోయింది. బకాయిలు వాస్తవమే రైతులకు 6శాతం వడ్డీ రాయితీ బకాయి పడ్డ మాట వాస్తవమే. ఈ అంశంపై కొంతకాలం క్రితం ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించాం. వారం, పది రోజుల్లో నిధులు విడుదలయ్యే అవకాశముంది. నిధులు రాగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. – సింగిరెడ్డి పెంటారెడ్డి, డీసీసీబీ చైర్మన్ -
రుణాలపై రిబేటేదీ..?
సేద్యం చేసుకుని ఆర్థికంగా ఎదిగేందుకు కోఆపరేటివ్ బ్యాంక్‌ల ద్వారా వ్యక్తిగత దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది. తీసుకున్న రుణాలకు రైతు చెల్లించ వడ్డీలో ప్రభుత్వం ఆరు శాతం రిబేట్ భరించాల్సి ఉండగా రెండేళ్లుగా పైసా ఇవ్వడం లేదు. దీంతో అసలు, వడ్డీ తడిసిమోపెడవుతుండడంతో రైతులు కిస్తులు చెల్లించలేకపోతున్నారు. మరో వైపు బాకీ చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేస్తుండడంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. రాజాపేట (ఆలేరు) : సహకారం సంఘాల్లో రైతులు తీసుకున్న వ్యక్తిగత, దీర్ఘకాలిక రుణంపై ఇవ్వాల్సిన ఆరు శాతం వడ్డీరాయితీపై ప్రభుత్వం జాప్యం చేస్తోంది. రెండేళ్లుగా రిబేట్ ఇవ్వకపోవడంతో రైతులపై అప్పుల భారం ఎక్కువవుతోంది. డీసీసీబీ ద్వారా కోఆపరేటీవ్ బ్యాంకులు రైతుల అభివృద్ధికి వ్యక్తిగత, దీర్గకాలిక రుణాలను జారీ చేస్తాయి. వీటిలో ప్రధానంగా 5 ఎకరాలు పైబడిన రైతులకు ట్రాక్టర్ల కోసం రూ.5లక్షల రుణాలను అందజేసింది. ఇలా ఉమ్మడి జిల్లా పరిధిలో 107 బ్యాంకుల్లో 3,818 మంది రైతులు ట్రాక్టర్ల కోసం రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలు చెల్లించే క్రమంలో ప్రభుత్వం వడ్డీలో ఆరు శాతం రాయితీ ఇస్తుంది. ఈ వడ్డీ రాయితీని ప్రభుత్వం గతేడాది నుంచి చెల్లించడంలేదు. జిల్లాలో ట్రాక్టర్ల కోసం రుణం పొందిన రైతులు గడువులోగా కిస్తీ చెలిస్తూ రిబేట్ కోసం ఎదురుచూస్తున్నారు. రెండేళ్లుగా ప్రభుత్వం రిబేట్ చెల్లించకపోవడం.. ప్రస్తుత కిస్తీ గడువు జనవరి 31లోపు చెల్లించాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తుండడంతో రైతులకు ఎటూ పాలుపోవడంలేదు. జనవరి 31లోపు రుణాలు చెల్లించాలని బ్యాంకు అధికారులు ఇప్పటికే రైతులకు నోటీసులు జారీ చేశారు. దీంతో అసలు, వడ్డీ చెల్లించాల్సి రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వడ్డీ రాయితీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.250 కోట్లు రిబేట్ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. రుణాల చెల్లింపులు ఇలా.. కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా రైతులకు 6 శాతం రిబేట్‌పై రూ.5లక్షలు వ్యక్తిగత దీర్ఘకాలిక రుణం అందజేసింది. ఈ రుణాన్ని అసలు, వడ్డీ కలిపి 9 సంత్సరాల కాలపరిమి తిలో రైతులు చెల్సించాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాంకు అధికారులు రైతుల పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్, బాండ్లు వంటివి తీసుకుని రుణాలు ఇస్తారు. రుణం తీసుకున్న రైతు మొదటి సంవత్సరానికి రూ.98,340 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో అసలు రూ.32,090, వడ్డీ 66,250 మొత్తం రూ.98,340 అవుతుంది. వడ్డీ రూ.66,250లో 6 శాతం రిబేట్ సుమారుగా రూ.30,000 పోను రూ.36,250, అసలు రూ.32090 మొత్తం రూ.68,240 రైతు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా రుణంతీరే వరకు ఏటా మొత్తం చెల్లింపులో తేడా లేకున్నా వడ్డీ తగ్గుతూ.. అసలు పెరుగుతూ వస్తుంది. కాగా రెండు సంవత్సరాలుగా 6 శాతం రిబేట్ రాకపోవడంతో రైతుపై సుమారు రూ.60 వేల వరకు భారం పడుతోంది. ఇప్పటికే పంటల దిగుబడి లేక ఇబ్బందులు పడుతున్న తమపై ప్రభుత్వం కనికరం చూపడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండేళ్లకు సంబంధించిన రిబేట్ వెంటనే మంజూచేసి ఆదుకోవాలని కోరుతున్నారు. రైతులకు రిబేట్ అందించాలి పీఏసీఎస్‌లలో రెండు సంవత్సరాలుగా 6శాతం రిబేట్ రావడంలేదు. ప్రభుత్వం వెంటనే రైతులకు రిబేటు అందించాలి. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు అప్పుల్లో ఉన్నారు. ప్రభుత్వం రిబేట్ చెల్లించకుంటే ట్రాక్టర్లను బ్యాంకు అధికారులకు అప్పగిస్తాం.– బైర పాండు, రైతు, బేగంపేట రెండేళ్లుగా రిబేట్ రాలేదు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో వ్యవసాయ సేద్యం కోసం ట్రాక్టర్లకు వ్యక్తిగత దీర్ఘకాలిక రుణాలు పొందిన రైతులకు రావాల్సిన 6 శాతం రిబేట్ రెండు సంత్సరాలుగా రాలేదు. ఈ విషయాన్ని రైతులు పలుమార్లు మా దృష్టికి తెచ్చారు. ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – ప్రసాద్, ఏజీఎం, నల్లగొండ -
షరతుతో.. ప్రీమియం తగ్గుతుంది!
► క్లెయిమ్ సమయంలో కొంత భరించటానికి సిద్ధపడాలి ► మిగిలిన మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది ► భారం తగ్గినందుకు ప్రీమియంలో రిబేట్ ► దీనివల్ల లాభనష్టాలు రెండూ ఉంటాయి ► గ్రూపు హెల్త్ పాలసీ ఉన్న వారికి అనుకూలం నలుగురు సభ్యులున్న కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కావాలంటే తక్కువలో తక్కువ ఏడాదికి ప్రీమియం రూ.15వేలు అయినా చెల్లించుకోవాలి. సామాన్యులకు ఇది కొంచెం భారమే. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఓ మార్గం ఉంది. అది... క్లెయిమ్ చేసినపుడు ఆ భారాన్ని బీమా కంపెనీతో కలసి పంచుకోవడానికి సిద్ధ పడితే చాలు.! ప్రీమియం తగ్గించేందుకు కంపెనీలు సిద్ధం. ఒక్క ఆరోగ్య బీమాలోనే కాదు మోటారు బీమాలోనూ ఈ సదుపాయం ఉంది. దీనికి సంబంధించిన వివరాలను తెలియజేసేదే ఈ కథనం. ఎవరికి ప్రయోజనమంటే... పనిచేస్తున్న సంస్థలో గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉన్న వారికి ఈ తరహా పాలసీలు నప్పుతాయి. అంటే ఇవి అచ్చం సూపర్ టాపప్ ప్లాన్ మాదిరిగా పనిచేస్తాయ్. ఉదాహరణకు రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ అందిస్తున్న లైఫ్‌లైన్ క్లాసిక్ గురించి చెప్పుకోవాలి. మోటారు బీమాలో... మోటారు వాహనాల బీమా విభాగంలోనూ కంపెనీలు ఈ తరహా పాలసీలను ఎప్పటి నుంచో అందిస్తున్నాయి. ఇలా మినహాయింపులతోనూ, మినహాయింపులు లేకుండానూ ఉన్నాయి. మినహాయింపులతో ఎంచుకుంటే... రూ.2,500, రూ.5,000, రూ.7,500, రూ.15,000 వీటిలో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. క్లెయిమ్ వచ్చినప్పుడు ఎంచుకున్న మేరకు పాలసీదారుడు తన జేబు నుంచి భరించాలి. మిగిలిన మొత్తాన్ని కంపెనీలు చెల్లిస్తాయి. కారు ఖరీదును బట్టే... రూ.5 లక్షల ధరలోపు ఉన్న కార్ల బీమా పాలసీల్లో డిడక్టబుల్కు, అది లేకుం డా ఇచ్చే పాలసీలకు మధ్య ప్రీమియం వ్యత్యాసం తక్కువే. ఖరీదైన కార్లలో ప్రీమియం తగ్గింపు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మారుతి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ మోడల్‌కు రెండో ఏడాది వార్షిక ప్రీమియం రూ.10,000కు పైనే ఉంది. రూ.5,000 డిడక్టబుల్ ఎంచుకుంటే ప్రీమియం రూ.8,000కు దిగొస్తుంది. వ్యత్యాసం రూ.2,000. కానీ ఒక్క క్లెయిమ్ ఎదురైనా మిగిలే ప్రీమియం కంటే తన జేబు నుంచి భరించాల్సిన మొత్తమే ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవాలి. కో–పే ఆప్షన్ లేదా ఫిక్స్డ్ డిడక్టబుల్! క్లెయిమ్‌లో నిర్ణీత శాతాన్ని పాలసీదారుడు సొంతంగా భరించాల్సి ఉంటుంది. సాధారణంగా వృద్ధులైన వారికి అందించే ఆరోగ్య బీమా పాలసీల్లో కంపెనీలు ఈ ‘కో–పే’ను ఎప్పటి నుంచో తప్పనిసరిగా అమలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆప్షన్‌ను ప్రీమియం తగ్గాలని ఆశించే ఇతర వయస్కులైన వారికీ ఆఫర్ చేస్తున్నాయి. ఎంత మేర...? పైన చెప్పుకున్నట్టు శ్రీకర్ వార్షిక ప్రీమియం రూ.14,000. అతడు 30 శాతం కో–పే ఆప్షన్ ఎంచుకున్నాడని అనుకుందాం. అప్పుడు అతడికి తగ్గే ప్రీమియం సైతం 25 నుంచి 30 శాతం మధ్య ఉంటుంది. దాంతో వార్షిక ప్రీమియం కనీసం రూ.4,000 తగ్గే వెసులుబాటు లభిస్తుంది. లాభమా... నష్టమా...? పనిచేస్తున్న సంస్థ నుంచి ఆరోగ్య బీమా కవరేజీ ఉన్న వారు విడిగా మరో ఆరోగ్యబీమా పాలసీ తీసుకునేట్టు అయితే, అలాగే ఆర్థికపరమైన రిస్క్ భరించగలిగే సామర్థ్యం ఉన్న వారు ఈ కో–పే ఆప్షన్ ఎంచుకోవచ్చని ఐసీఐసీఐ లాంబార్డ్ క్లెయిమ్స్ విభాగం చీఫ్ సంజయ్‌దత్తా సూచించారు. అయితే ఏటా రూ.4,000 ప్రీమియం తగ్గుతుంది కదా అని 30 శాతం కో–పే ఆప్షన్‌ను శ్రీకర్ ఎంచుకున్నాడని అనుకుందాం. 9 ఏళ్ల తర్వాత అనుకోకుండా కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఆసుపత్రిలో చేర్పించడంతో బిల్లు రూ.2,00,000 వచ్చిం దనుకుంటే... అప్పుడు శ్రీకర్ సొంతంగా రూ.60,000 భరించాల్సి వస్తుంది. కానీ, ఈ కో–పే కారణంగా 9 ఏళ్లలో అతడు మిగుల్చుకున్నది రూ.36,000 మాత్రమే. ఒకవేళ ఆస్పత్రి బిల్లు ఇంకా ఎక్కువే వస్తే ఈ భారం మరింత పెరుగుతుంది. శ్రీకర్ ఓ ప్రైవేటు ఉద్యోగి. వయసు 30. నెల వేతనం రూ.25వేలు. భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూ.5 లక్షల ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలని అనుకున్నాడు. వార్షికంగా చెల్లించాల్సిన ప్రీమియం రూ.14,000. కానీ, అంత మొత్తం అంటే శ్రీకర్ ఒకడుగు వెనక్కి వేశాడు. ‘ప్రీమియం తగ్గే అవకాశం లేదా...? అని ప్రశ్నించాడు. బీమా కంపెనీ ప్రతినిధి నుంచి ఉందనే సమాధానం వినిపించింది. ప్రీమియం తగ్గిస్తాం కానీ... ‘క్లెయిమ్ వచ్చినప్పుడు కొంత భారాన్ని మీరు మోయాల్సి ఉంటుంది’ అని బీమా కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశాడు. -
రిబేట్ ఆశ
‘సహకార’ రైతులకు రెండేళ్లుగా అందని రాయితీ ఉమ్మడి జిల్లాలో రూ. 8.26 కోట్ల బకాయిలు నిరీక్షిస్తున్న 6,236 మంది కర్షకులు సహకార సంఘాల్లో దీర్ఘకాలిక రుణం తీసుకుని సకాలంలో వాయిదాలు చెల్లిస్తున్న రైతులకు ఆరు శాతం రిబేట్ అందడం లేదు. రెండేళ్లుగా ఈ సొమ్ము మంజూరు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 6,236 మంది రైతులకు సంబంధించి రూ.8.26 కోట్లు మంజూరు కావాల్సి ఉంది. ఈ సొమ్ము కోసం కర్షకులు ఆశతో ఎదురు చూస్తున్నారు. సదాశివనగర్ (ఎల్లారెడ్డి) : సహకార సంఘాల్లో దీర్ఘకాలిక రుణం పొందిన రైతులు సకాలంలో రుణ వాయిదాలు చెల్లిస్తే ప్రభుత్వం ఆరు శాతం రిబేట్ రూపంలో చెల్లిస్తుంది. ఇందుకోసం రుణగ్రహీతలు ఏటా ఫిబ్రవరి 28లోగా రుణ వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. రాయితీ లభిస్తుందన్న ఆశతో చాలా మంది సకాలంలో వాయిదాలు చెల్లిస్తున్నారు. అయితే రెండేళ్లుగా ఈ రిబేట్ సొమ్ము మంజూరవడం లేదు. ఈ సొమ్ము కోసం అర్హులైన రుణ గ్రహీతలు సహకార సంఘాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతూనే ఉన్నారు. 2014–15, 2015–16 సంవత్సరాలకు సంబంధించి రిబేట్ రావాల్సి ఉంది. కామారెడ్డి జిల్లాలో 56 సింగిల్ విండోలు, నిజామాబాద్ జిల్లా పరిధిలో 84 సింగిల్ విండోల పరిధిలో 6,236 మంది రైతులకు రూ. 8 కోట్ల 26 లక్షల 898 రిబెట్ మంజూరు కావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
రూ. 10,000 కోట్లు రాయితీల్లో కోత ఇదీ...
ఆహార సబ్సిడీ రూ.1.39 లక్షల కోట్ల నుంచి రూ.1.34 లక్షల కోట్లకు న్యూఢిల్లీ: ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై రాయితీలను వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో నాలుగు శాతానికి పైగా తగ్గించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సబ్సిడీ బిల్లు కింద 2,31,781.61 కోట్లు కేటాయించారు. 2015-16 సంవత్సరంలో సబ్సిడీ బిల్లు సవరించిన అంచనాల ప్రకారం 2,41,856.58 కోట్లుగా ఉండగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనిని దాదాపు 10 వేల కోట్ల రూపాయల మేర తగ్గించారు. 2015-16 లో ఆహార సబ్సిడీ బిల్లు రూ. 1,39,419 కోట్లుగా ఉండగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దానిని రూ. 1,34,834.61 కోట్లకు తగ్గించారు. అలాగే.. ఎరువుల సబ్సిడీని రూ. 72,437.58 కోట్ల నుంచి రూ. 70,000 కోట్లకు, పెట్రోలియం సబ్సిడీని రూ. 30,000 కోట్ల నుంచి వచ్చే ఏడాదిలో రూ. 26,947 కోట్లకు కుదించారు. ♦ వచ్చే ఏడాది ఎరువుల సబ్సిడీకి 70 వేల కోట్లు కేటాయింపులు జరిపారు. అందులో యూరియా సబ్సిడీకి రూ. 51,000 కోట్లు, అనియంత్రిత ఫాస్ఫరిక్, పొటాసిక్ ఎరువులకు రూ. 19,000 కోట్లు కేటాయించారు. ♦ యూరియా సబ్సిడీ రూ. 51 వేల కోట్లలో.. రూ. 40 వేల కోట్లను దేశీయ యూరియాకు, మిగతా మొత్తాన్ని దిగుమతి చేసుకునే యూరియాకు సబ్సిడీగా పేర్కొన్నారు. ♦ అనియంత్రిత పాస్ఫరిక్, పొటాసిక్ ఎరువులకుకేటాయించిన రూ. 19 వేల కోట్లలో దేశీయంగా ఉత్పత్తి చేసే ఎరువులకు రూ. 12 వేల కోట్లు, దిగుమతి చేసుకునే ఎరువులకు రూ. 6,999.99 కోట్లు కేటాయించారు. ఇందులోనే సిటీ కంపోస్ట్ ఉత్పత్తికి సాయంగా రూ. 1 లక్ష కేటాయించారు. ♦ పెట్రోలియం సబ్సిడీ కింద రూ. 26,947 కోట్లు కేటాయించగా.. అందులో రూ. 19,802.79 కోట్లు ఎల్పీజీ సబ్సిడీ కింద, మిగతా మొత్తాన్ని కిరోసిన్ సబ్సిడీ కింద కేటాయింపులు జరిపారు.