షరతుతో.. ప్రీమియం తగ్గుతుంది!
► క్లెయిమ్ సమయంలో కొంత భరించటానికి సిద్ధపడాలి
► మిగిలిన మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది
► భారం తగ్గినందుకు ప్రీమియంలో రిబేట్
► దీనివల్ల లాభనష్టాలు రెండూ ఉంటాయి
► గ్రూపు హెల్త్ పాలసీ ఉన్న వారికి అనుకూలం
నలుగురు సభ్యులున్న కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కావాలంటే తక్కువలో తక్కువ ఏడాదికి ప్రీమియం రూ.15వేలు అయినా చెల్లించుకోవాలి. సామాన్యులకు ఇది కొంచెం భారమే. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఓ మార్గం ఉంది. అది... క్లెయిమ్ చేసినపుడు ఆ భారాన్ని బీమా కంపెనీతో కలసి పంచుకోవడానికి సిద్ధ పడితే చాలు.! ప్రీమియం తగ్గించేందుకు కంపెనీలు సిద్ధం. ఒక్క ఆరోగ్య బీమాలోనే కాదు మోటారు బీమాలోనూ ఈ సదుపాయం ఉంది. దీనికి సంబంధించిన వివరాలను తెలియజేసేదే ఈ కథనం.
ఎవరికి ప్రయోజనమంటే...
పనిచేస్తున్న సంస్థలో గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉన్న వారికి ఈ తరహా పాలసీలు నప్పుతాయి. అంటే ఇవి అచ్చం సూపర్ టాపప్ ప్లాన్ మాదిరిగా పనిచేస్తాయ్. ఉదాహరణకు రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ అందిస్తున్న లైఫ్‌లైన్ క్లాసిక్ గురించి చెప్పుకోవాలి.
మోటారు బీమాలో...
మోటారు వాహనాల బీమా విభాగంలోనూ కంపెనీలు ఈ తరహా పాలసీలను ఎప్పటి నుంచో అందిస్తున్నాయి. ఇలా మినహాయింపులతోనూ, మినహాయింపులు లేకుండానూ ఉన్నాయి. మినహాయింపులతో ఎంచుకుంటే... రూ.2,500, రూ.5,000, రూ.7,500, రూ.15,000 వీటిలో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. క్లెయిమ్ వచ్చినప్పుడు ఎంచుకున్న మేరకు పాలసీదారుడు తన జేబు నుంచి భరించాలి. మిగిలిన మొత్తాన్ని కంపెనీలు చెల్లిస్తాయి.
కారు ఖరీదును బట్టే...
రూ.5 లక్షల ధరలోపు ఉన్న కార్ల బీమా పాలసీల్లో డిడక్టబుల్‌కు, అది లేకుం డా ఇచ్చే పాలసీలకు మధ్య ప్రీమియం వ్యత్యాసం తక్కువే. ఖరీదైన కార్లలో ప్రీమియం తగ్గింపు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మారుతి స్విఫ్ట్ ఎల్‌ఎక్స్‌ఐ మోడల్‌కు రెండో ఏడాది వార్షిక ప్రీమియం రూ.10,000కు పైనే ఉంది. రూ.5,000 డిడక్టబుల్ ఎంచుకుంటే ప్రీమియం రూ.8,000కు దిగొస్తుంది. వ్యత్యాసం రూ.2,000. కానీ ఒక్క క్లెయిమ్ ఎదురైనా మిగిలే ప్రీమియం కంటే తన జేబు నుంచి భరించాల్సిన మొత్తమే ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవాలి.
కో–పే ఆప్షన్ లేదా ఫిక్స్‌డ్ డిడక్టబుల్!
క్లెయిమ్‌లో నిర్ణీత శాతాన్ని పాలసీదారుడు సొంతంగా భరించాల్సి ఉంటుంది. సాధారణంగా వృద్ధులైన వారికి అందించే ఆరోగ్య బీమా పాలసీల్లో కంపెనీలు ఈ ‘కో–పే’ను ఎప్పటి నుంచో తప్పనిసరిగా అమలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆప్షన్‌ను ప్రీమియం తగ్గాలని ఆశించే ఇతర వయస్కులైన వారికీ ఆఫర్ చేస్తున్నాయి.
ఎంత మేర...?
పైన చెప్పుకున్నట్టు శ్రీకర్ వార్షిక ప్రీమియం రూ.14,000. అతడు 30 శాతం కో–పే ఆప్షన్ ఎంచుకున్నాడని అనుకుందాం. అప్పుడు అతడికి తగ్గే ప్రీమియం సైతం 25 నుంచి 30 శాతం మధ్య ఉంటుంది. దాంతో వార్షిక ప్రీమియం కనీసం రూ.4,000 తగ్గే వెసులుబాటు లభిస్తుంది.
లాభమా... నష్టమా...?
పనిచేస్తున్న సంస్థ నుంచి ఆరోగ్య బీమా కవరేజీ ఉన్న వారు విడిగా మరో ఆరోగ్యబీమా పాలసీ తీసుకునేట్టు అయితే, అలాగే ఆర్థికపరమైన రిస్క్ భరించగలిగే సామర్థ్యం ఉన్న వారు ఈ కో–పే ఆప్షన్ ఎంచుకోవచ్చని ఐసీఐసీఐ లాంబార్డ్ క్లెయిమ్స్ విభాగం చీఫ్ సంజయ్‌దత్తా సూచించారు. అయితే ఏటా రూ.4,000 ప్రీమియం తగ్గుతుంది కదా అని 30 శాతం కో–పే ఆప్షన్‌ను శ్రీకర్ ఎంచుకున్నాడని అనుకుందాం. 9 ఏళ్ల తర్వాత అనుకోకుండా కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఆసుపత్రిలో చేర్పించడంతో బిల్లు రూ.2,00,000 వచ్చిం దనుకుంటే... అప్పుడు శ్రీకర్ సొంతంగా రూ.60,000 భరించాల్సి వస్తుంది. కానీ, ఈ కో–పే కారణంగా 9 ఏళ్లలో అతడు మిగుల్చుకున్నది రూ.36,000 మాత్రమే. ఒకవేళ ఆస్పత్రి బిల్లు ఇంకా ఎక్కువే వస్తే ఈ భారం మరింత పెరుగుతుంది.
శ్రీకర్ ఓ ప్రైవేటు ఉద్యోగి. వయసు 30. నెల వేతనం రూ.25వేలు. భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూ.5 లక్షల ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలని అనుకున్నాడు. వార్షికంగా చెల్లించాల్సిన ప్రీమియం రూ.14,000. కానీ, అంత మొత్తం అంటే శ్రీకర్ ఒకడుగు వెనక్కి వేశాడు. ‘ప్రీమియం తగ్గే అవకాశం లేదా...? అని ప్రశ్నించాడు. బీమా కంపెనీ ప్రతినిధి నుంచి ఉందనే సమాధానం వినిపించింది. ప్రీమియం తగ్గిస్తాం కానీ... ‘క్లెయిమ్ వచ్చినప్పుడు కొంత భారాన్ని మీరు మోయాల్సి ఉంటుంది’ అని బీమా కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశాడు.