రిబేట్ ఆశ
‘సహకార’ రైతులకు రెండేళ్లుగా అందని రాయితీ
ఉమ్మడి జిల్లాలో రూ. 8.26 కోట్ల బకాయిలు
నిరీక్షిస్తున్న 6,236 మంది కర్షకులు
సహకార సంఘాల్లో దీర్ఘకాలిక రుణం తీసుకుని సకాలంలో వాయిదాలు చెల్లిస్తున్న రైతులకు ఆరు శాతం రిబేట్ అందడం లేదు. రెండేళ్లుగా ఈ సొమ్ము మంజూరు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 6,236 మంది రైతులకు సంబంధించి రూ.8.26 కోట్లు మంజూరు కావాల్సి ఉంది. ఈ సొమ్ము కోసం కర్షకులు ఆశతో ఎదురు చూస్తున్నారు.
సదాశివనగర్ (ఎల్లారెడ్డి) : సహకార సంఘాల్లో దీర్ఘకాలిక రుణం పొందిన రైతులు సకాలంలో రుణ వాయిదాలు చెల్లిస్తే ప్రభుత్వం ఆరు శాతం రిబేట్ రూపంలో చెల్లిస్తుంది. ఇందుకోసం రుణగ్రహీతలు ఏటా ఫిబ్రవరి 28లోగా రుణ వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. రాయితీ లభిస్తుందన్న ఆశతో చాలా మంది సకాలంలో వాయిదాలు చెల్లిస్తున్నారు. అయితే రెండేళ్లుగా ఈ రిబేట్ సొమ్ము మంజూరవడం లేదు. ఈ సొమ్ము కోసం అర్హులైన రుణ గ్రహీతలు సహకార సంఘాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతూనే ఉన్నారు.
2014–15, 2015–16 సంవత్సరాలకు సంబంధించి రిబేట్ రావాల్సి ఉంది. కామారెడ్డి జిల్లాలో 56 సింగిల్ విండోలు, నిజామాబాద్ జిల్లా పరిధిలో 84 సింగిల్ విండోల పరిధిలో 6,236 మంది రైతులకు రూ. 8 కోట్ల 26 లక్షల 898 రిబెట్ మంజూరు కావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.