సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : వాయిదాల ప్రకారం రుణాలు చెల్లించినవారికి ఇవ్వాల్సిన ‘రిబేటు’కు రాష్ట్ర ప్రభుత్వం ఎగనామం పెట్టింది. తొమ్మిదేళ్లు గడిచినా ఖాతాల్లో వడ్డీ రాయితీ జమ కాకపోవడం అన్నదాతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో 2009 నుంచి ఇప్పటివరకు 15,130 మంది రైతులకు రూ.300 కోట్ల మేర దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేశారు. అప్పులు పొందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సభ్యులు కోళ్లఫారాలు, డెయిరీ ఫామ్‌లు నిర్వహిస్తూ, జీవాలను పోషిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వీరు ఆర్థిక సంవత్సరం ముగింపు (మార్చి 31వ తేదీ)లోపు నిర్దేశించిన వాయిదా సొమ్ము జమ చేస్తే అప్పు కింద కట్టే వడ్డీలో 6శాతం తగ్గింపును ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తుంది. ప్రకృతి విపత్తులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పౌల్ట్రీ, డెÆయిరీ నిర్వహణలో నష్టం వచ్చినా, వ్యాధులు సోకి గొర్రెలు, మేకలు మృత్యువాతపడినా.. అప్పులు చేసి నగలు తాకట్టు కుదవ పెట్టి గడువులోపే కిస్తీలు కట్టారు.
ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ సహకార సంఘాలు: 48
మొత్తం సభ్యుల సంఖ్య: 64,100
2009 నుంచి జరిగిన రుణ వితరణ: రూ.300 కోట్లు
వాయిదాలు సకాలంలో చెల్లించిన రైతులు: 15,130
వడ్డీలో 6% శాతం తగ్గింపు రూపేణా అందాల్సింది: రూ.8.13 కోట్లు
రూ.8.13 కోట్ల మేర బకాయి
రిబేటు రూపేణా సహకార సంఘాల సభ్యులకు రూ.8.13 కోట్ల మేర రావాల్సివుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సకాలంలో ఈ నిధులు విడుదలయ్యాయి. ఆయన మరణానంతరం వడ్డీ తగ్గింపు నిధుల ఊసే లేకుండా పోయింది. దీంతో తొమ్మిదేళ్లుగా ఈ నిధుల కోసం రైతాంగానికి ఎదురుచూపులు తప్పడం లేదు. అప్పట్లో నిర్ణీత వ్యవధిలో ఈ సొమ్ము రైతుల పద్దులో జమ కావడంతో సకాలంలో అప్పులు చెల్లించేందుకు మొగ్గు చూపేవారు.
ఈసారి కూడా రిబేటు బకాయిలు విడుదల చేయకపోతే మార్చిలో చెల్లించాల్సిన వాయిదాలను వాయిదా వేస్తామని అన్నదాతలు అంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు తదితర మండలాల్లో వేలాది మంది రైతులు దీర్ఘాకాలిక రుణాలు పొందారు. డిస్కౌంట్ నిధులను ఇవ్వకపోవడం మంచి పద్ధతి కాదని పీఏసీఎస్ చైర్మన్లు.. డీసీసీబీ పాలకవర్గం దృష్టికి తెచ్చినా అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కావడంతో డీసీసీబీ మిన్నకుండిపోయింది.
బకాయిలు వాస్తవమే
రైతులకు 6శాతం వడ్డీ రాయితీ బకాయి పడ్డ మాట వాస్తవమే. ఈ అంశంపై కొంతకాలం క్రితం ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించాం. వారం, పది రోజుల్లో నిధులు విడుదలయ్యే అవకాశముంది. నిధులు రాగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. – సింగిరెడ్డి పెంటారెడ్డి, డీసీసీబీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment