సేద్యం చేసుకుని ఆర్థికంగా ఎదిగేందుకు కోఆపరేటివ్ బ్యాంక్‌ల ద్వారా వ్యక్తిగత దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది. తీసుకున్న రుణాలకు రైతు చెల్లించ వడ్డీలో ప్రభుత్వం ఆరు శాతం రిబేట్ భరించాల్సి ఉండగా రెండేళ్లుగా పైసా ఇవ్వడం లేదు. దీంతో అసలు, వడ్డీ తడిసిమోపెడవుతుండడంతో రైతులు కిస్తులు చెల్లించలేకపోతున్నారు. మరో వైపు బాకీ చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేస్తుండడంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు.
రాజాపేట (ఆలేరు) : సహకారం సంఘాల్లో రైతులు తీసుకున్న వ్యక్తిగత, దీర్ఘకాలిక రుణంపై ఇవ్వాల్సిన ఆరు శాతం వడ్డీరాయితీపై ప్రభుత్వం జాప్యం చేస్తోంది. రెండేళ్లుగా రిబేట్ ఇవ్వకపోవడంతో రైతులపై అప్పుల భారం ఎక్కువవుతోంది. డీసీసీబీ ద్వారా కోఆపరేటీవ్ బ్యాంకులు రైతుల అభివృద్ధికి వ్యక్తిగత, దీర్గకాలిక రుణాలను జారీ చేస్తాయి. వీటిలో ప్రధానంగా 5 ఎకరాలు పైబడిన రైతులకు ట్రాక్టర్ల కోసం రూ.5లక్షల రుణాలను అందజేసింది. ఇలా ఉమ్మడి జిల్లా పరిధిలో 107 బ్యాంకుల్లో 3,818 మంది రైతులు ట్రాక్టర్ల కోసం రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలు చెల్లించే క్రమంలో ప్రభుత్వం వడ్డీలో ఆరు శాతం రాయితీ ఇస్తుంది. ఈ వడ్డీ రాయితీని ప్రభుత్వం గతేడాది నుంచి చెల్లించడంలేదు. జిల్లాలో ట్రాక్టర్ల కోసం రుణం పొందిన రైతులు గడువులోగా కిస్తీ చెలిస్తూ రిబేట్ కోసం ఎదురుచూస్తున్నారు. రెండేళ్లుగా ప్రభుత్వం రిబేట్ చెల్లించకపోవడం.. ప్రస్తుత కిస్తీ గడువు జనవరి 31లోపు చెల్లించాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తుండడంతో రైతులకు ఎటూ పాలుపోవడంలేదు. జనవరి 31లోపు రుణాలు చెల్లించాలని బ్యాంకు అధికారులు ఇప్పటికే రైతులకు నోటీసులు జారీ చేశారు. దీంతో అసలు, వడ్డీ చెల్లించాల్సి రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వడ్డీ రాయితీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.250 కోట్లు రిబేట్ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
రుణాల చెల్లింపులు ఇలా..
కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా రైతులకు 6 శాతం రిబేట్‌పై రూ.5లక్షలు వ్యక్తిగత దీర్ఘకాలిక రుణం అందజేసింది. ఈ రుణాన్ని అసలు, వడ్డీ కలిపి 9 సంత్సరాల కాలపరిమి తిలో రైతులు చెల్సించాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాంకు అధికారులు రైతుల పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్, బాండ్లు వంటివి తీసుకుని రుణాలు ఇస్తారు. రుణం తీసుకున్న రైతు మొదటి సంవత్సరానికి రూ.98,340 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో అసలు రూ.32,090, వడ్డీ 66,250 మొత్తం రూ.98,340 అవుతుంది. వడ్డీ రూ.66,250లో 6 శాతం రిబేట్ సుమారుగా రూ.30,000 పోను రూ.36,250, అసలు రూ.32090 మొత్తం రూ.68,240 రైతు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా రుణంతీరే వరకు ఏటా మొత్తం చెల్లింపులో తేడా లేకున్నా వడ్డీ తగ్గుతూ.. అసలు పెరుగుతూ వస్తుంది. కాగా రెండు సంవత్సరాలుగా 6 శాతం రిబేట్ రాకపోవడంతో రైతుపై సుమారు రూ.60 వేల వరకు భారం పడుతోంది. ఇప్పటికే పంటల దిగుబడి లేక ఇబ్బందులు పడుతున్న తమపై ప్రభుత్వం కనికరం చూపడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండేళ్లకు సంబంధించిన రిబేట్ వెంటనే మంజూచేసి ఆదుకోవాలని కోరుతున్నారు.
రైతులకు రిబేట్ అందించాలి
పీఏసీఎస్‌లలో రెండు సంవత్సరాలుగా 6శాతం రిబేట్ రావడంలేదు. ప్రభుత్వం వెంటనే రైతులకు రిబేటు అందించాలి. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు అప్పుల్లో ఉన్నారు. ప్రభుత్వం రిబేట్ చెల్లించకుంటే ట్రాక్టర్లను బ్యాంకు అధికారులకు అప్పగిస్తాం.– బైర పాండు, రైతు, బేగంపేట
రెండేళ్లుగా రిబేట్ రాలేదు
ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో వ్యవసాయ సేద్యం కోసం ట్రాక్టర్లకు వ్యక్తిగత దీర్ఘకాలిక రుణాలు పొందిన రైతులకు రావాల్సిన 6 శాతం రిబేట్ రెండు సంత్సరాలుగా రాలేదు. ఈ విషయాన్ని రైతులు పలుమార్లు మా దృష్టికి తెచ్చారు. ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – ప్రసాద్, ఏజీఎం, నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment