అంతర్జాతీయ సహకార మహాసభ.. ఒకే రంగానికి రెండు చట్టాలెందుకు? | ICA Global Cooperative Conference 2024 full details | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ సహకార మహాసభ.. ముఖ్య విశేషాలు

Published Wed, Nov 20 2024 7:10 PM | Last Updated on Wed, Nov 20 2024 7:38 PM

ICA Global Cooperative Conference 2024 full details

పరస్పరం సహకరించుకోవటం మానవ సహజ లక్షణం. ఈ లక్షణాన్ని ఒక పద్ధతి ప్రకారం కొనసాగించడానికి సహకార సంఘాలు (కోఆపరేటివ్‌ సొసైటీలు) దోహదం చేస్తాయి. ప్రపంచ సహకార వ్యవస్థకు 130 ఏళ్ల చరిత్ర, సుసంపన్న వారసత్వం ఉన్నాయి. ప్రపంచ జనాభాలో 12% మంది ఏదో ఒక సహకార సంఘంలో సభ్యులే.  మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, వందేళ్లకు పైబడి చక్కగా ఆర్థిక సేవలందిస్తున్న ఘనమైన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు (పిఎసిఎస్‌లు), సహకార అర్బన్‌ బ్యాంకులు అనేకం కనిపిస్తాయి. ఈ నెల 14 నుంచి సహకార వారోత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మరో రెండు ముఖ్య విశేషాలు... ఈ నెల 25 నుంచి 30 వరకు న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా అంతర్జాతీయ సహకార మహాసభ జరగబోతోంది.

అంతర్జాతీయ మహాసభ మన దేశంలో జరగటం ఇదే మొదటిసారి. సుమారు రెండు వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఐక్యరాజ్యసమితి 2025వ సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ సహకార సంవత్సరం’గా ప్రకటించింది.  ఈ పండుగకు కూడా ఈ నెల 25న ఉత్సాహపూరిత వాతావరణంలో న్యూఢిల్లీలో తెర లేవనుంది. సహకార విలువలకు తిలోదకాలు, అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం.. వంటి అవశ్యం వదిలించుకోవాల్సిన జాఢ్యాలు మన సహకార వ్యవస్థను పట్టి పీడిస్తున్నప్పటికీ.. మొక్కవోని సహకార స్ఫూర్తి మన సమాజంలో అనుక్షణం వర్థిల్లుతూనే ఉంటుంది. సహకారం కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది! ఈ నేపథ్యంలో తలపండిన సహకారవేత్తల అభిప్రాయాలు తెలుసుకుందాం.  

సహకార సంఘం అంటే?
సభ్యుల ప్రయోజనాలను నెరవేర్చటమే లక్ష్యంగా పనిచేసే ప్రజాస్వామిక సంస్థ సహకార సంఘం. యాజమాన్యం, నియంత్రణ, నిర్వహణ అన్నీ సభ్యులదే. సభ్యుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అవసరాలు, ఆకాంక్షలను నెరవేర్చటమే సహకార సంఘాల ధ్యేయం.  

సహకారం రాష్ట్ర సబ్జెక్ట్‌.. కేంద్రం చట్టాలు ఎలా చేస్తుంది?
ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య, ఒక దేశంలో ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించటానికి సహకార వ్యవస్థ ఉపయోగపడుతుంది. చాలా దేశాల్లో సహకార వ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఉంది. నెదర్లాండ్స్‌లో సహకార సంఘాలకు స్వేచ్ఛ ఎక్కువ. అధికారుల జోక్యం ఉండదు. ఫ్రాన్స్‌లో 2008లో ఆర్థిక మాంద్యం దెబ్బకు వాణిజ్య బ్యాంకులు నిలవలేక సహకార బ్యాంకుల్లో విలీనమయ్యాయి. అమెరికాలోనూ కమ్యూనిటీ బ్యాంకులు బలంగా ఉన్నాయి. జర్మనీలో రైతులకు ఎక్కువ రుణాలిస్తున్నది సహకార బ్యాంకులే. న్యూజిలాండ్‌లో డెయిరీ కోఆపరేటివ్‌లదే రాజ్యం. లాటిన్‌ అమెరికాలో ఇటీవల కోఆపరేటర్లు బలపడుతూ కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నారు.

జవాబుదారీతనం ఏదీ?
మన దేశంలో సహకార విస్తరణకు అవకాశాలెక్కువ. మన సంస్కృతిలోనే సహకార స్ఫూర్తి ఉంది. గ్రామీణులు, గిరిజనుల్లో ఇది మరీ ఎక్కువ. అయితే, అధికారులకు అధిక పెత్తనం ఇవ్వటం, జవాబుదారీతనం లేకుండా చేయటం వల్ల మన దేశంలో సహకార వ్యవస్థ దెబ్బతింటున్నది. ఆర్బీఐ నిబంధనలు, సహకార చట్టాల మధ్య వైరుధ్యం అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులను కుంగదీస్తోంది. సహకార విలువలను తుంగలో తొక్కేలా కొన్ని నిబంధనలు ఉంటున్నాయి. అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులు, మల్టీస్టేట్‌ కోఆపరేటివ్‌ల విషయంలో రాష్ట్ర సహకార చట్టాలు నిర్దేశించే నిబంధనలకు భిన్నమైన నిబంధనలను బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ నిర్దేశిస్తోంది. అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులు షేర్‌ క్యాపిటల్‌ తిరిగి ఇవ్వొద్దని, డైరెక్టర్ల పదవీ కాలం నాలుగేళ్లేనని (సహకార చట్టాల ప్రకారం 5 ఏళ్లు).. ఇలా అనేక విషయాల్లో వైరుధ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న 45 అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకుల్లో 20 బ్యాంకులు వందేళ్ల క్రితం నుంచి ఉన్నవే. ఇవి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక తోడ్పాటునూ పొందటం లేదు.  

పిఎసిఎస్‌లలో బ్యాంకింగ్‌ సేవలా?
సహకారం పూర్తిగా రాష్ట్ర సబ్జెక్ట్‌. రాష్ట్రాలతో చర్చించకుండానే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టాలు చేస్తోంది. ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలతో ఇంకో 25 పనులు చేయించాలని కేంద్ర సహకార శాఖ నిర్దేశించింది. ఇందులో బ్యాంకింగ్‌ సేవలు కూడా ఉన్నాయి. నిధులు దుర్వినియోగం జరగకుండా పర్యవేక్షించేదెవరూ అంటే సమాధానం లేదు. ఇది సరికాదు. అమలు చేయాల్సింది రాష్ట్రాలైనప్పుడు సహకార రిజిస్ట్రార్, ముఖ్య కార్యదర్శితో కనీసం చర్చించకుండానే కేంద్రం నిర్ణయాలు తీసుకుంటే ఎలా? సహకార సంస్థల్లో అక్రమాలకు బాధ్యులను జవాబుదారీ చేయటం లేదు. ఎంత అవినీతి జరిగినా రాష్ట్ర ప్రభుత్వాలు అరెస్టులు, ఆస్తుల రికవరీ వంటి చర్యలు తీసుకోవటం లేదు. సహకార శాఖకు ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ జవాబుదారీతనం లేకుండా΄ోయింది.  
– మానం ఆంజనేయులు 
పూర్వ అధ్యక్షులు, విశాఖ అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్, పూర్వ ఉపాధ్యక్షులు, నాఫ్కాబ్‌  

కేంద్రం తెచ్చిన కొత్తచట్టాలతో చేటు
భారతీయ ఆర్థిక రంగంలో సహకార వ్యవస్థ వాటా 43% వుంది. రైతులు, గ్రామీణ చేతివృత్తిదారులు, బలహీన వర్గాలు ఈ సహకార వ్యవస్థలో భాగస్వాములు. గత 75 సంవత్సరాలుగా 29 కోట్ల మంది సభ్యులు తమ ఖర్చులు తగ్గించుకొని రూ.40,689 కోట్ల మూలధనంతో సుమారు 9 లక్షల సహకార సంఘాలను స్థాపించుకున్నారు. రూ. లక్షల కోట్ల సహకార ఆర్థిక సౌధాన్ని నిర్మించారు. దీన్ని అక్రమంగా పెట్టుబడిదారుల పరం చేయటానికి  పార్లమెంటులో రెండు చట్టాలు చేశారు. వీటిని అమలుచేస్తే జిల్లా స్థాయి సహకార బ్యాంకుల నుంచి ఇఫ్కో, క్రిభ్కో, నాఫెడ్‌ వంటి పెద్ద సంస్థలన్నీ కారుచౌకగా పెట్టుబడిదారుల పరం అవుతాయి. సహకార సిద్ధాంతాలకు, సహకార సూత్రాలకు ఇది విరుద్ధం. మొత్తంగా భారత రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని రాజ్యాంగ సవరణ చేయకుండానే ఈ చట్టాలు మార్చేస్తున్నాయి. ప్రజలు చైతన్యవంతులై వీటిని అడ్డుకోవాలి. సహకార ధర్మపీఠం తరఫున దేశవ్యాప్త ప్రచారోద్యం చేపట్టాం.   
– సంభారపు భూమయ్య , సీనియర్‌ సహకారవేత్త, సహకార ధర్మపీఠం, హైదరాబాద్‌

సహకార సంస్థల బలోపేతానికి దోహదం
అంతర్జాతీయ సహకార మహాసభ న్యూఢిల్లీలో ఈ నెలాఖరులో జరుపుకోవటం సంతోషదాయకం. దేశంలో సహకార సంస్థలన్నీ బలోపేతం కావటానికి, ప్రభుత్వం మరింత దృష్టి కేంద్రీకరించడానికి అంతర్జాతీయ మహాసభ ఉపయోగపడుతుంది. సహకార సంఘాలు చాలా వరకు వ్యవసాయ ఉత్పాదకాల సరఫరా వరకే పరిమితం అవుతున్నాయి. ప్రాసెసింగ్, విలువ జోడింపు, ఉత్పత్తులను నేరుగా ప్రజలకు విక్రయించటం, ఉత్పత్తుల బ్రాండింగ్‌ చేసుకోవాలి. ఆన్‌లైన్, సొంత అవుట్‌ లెట్ల ద్వారా విక్రయించాలి. రైతుల ప్రయోజనమే పరమావధిగా ముల్కనూర్‌ సొసైటీ 60 ఏళ్లుగా ఇటువంటి అనేక సేవలు అందిస్తోంది. గోదాములు నిర్మించటం, ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు సహకార సంఘాలకు ప్రభుత్వం తక్కువ వడ్డీకి రుణాలిచ్చి  ప్రోత్సహించాలి. శిక్షణపై దృష్టి కేంద్రీకరించాలి. సహకార సంఘాల సభ్యులు, సిబ్బంది, బోర్డు సభ్యులకు సహకార విలువలు, వాణిజ్య, నిర్వహణ నైపుణ్యాల పెంపుదల శిక్షణకు కృషి చెయ్యాలి.
– అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, అధ్యక్షులు, ముల్కనూర్‌ సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్‌ సంఘం, తెలంగాణ

ఒకే రంగానికి రెండు చట్టాలెందుకు?
సహకార రంగం ఆర్థిక పురోగతి బాగానే వుంది. కానీ, నడక సరిగ్గా లేదు. సహకార మూల సూత్రాలకు సహకార వ్యవస్థ దూరమైంది. సహకార విద్య, సహకార విలువలకు సంబంధించిన కనీస జ్ఞానం కొరవడిన యంత్రాంగం ఆధ్వర్యంలో తెలుగునాట సహకార వ్యవస్థ నడుస్తోంది. సహకార హక్కులు, బాధ్యతలు తెలియని దుస్థితి. 12 నెలలు శిక్షణ పొందినవారే సహకార సంస్థల్లో సిబ్బందిగా వుండాలన్నది నియమం. 

చ‌దవండి: ఫ్యామిలీ ఫార్మింగ్‌.. విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణ

ఇప్పుడున్న సహకార సిబ్బందిలో 90 శాతం సరైన శిక్షణ లేనివారే. ఉద్యోగం చేస్తూ మూడు నెలలు, ఆరు నెలల డిప్లొమా అంటూ సర్టిఫికెట్లు పొందిన వారే ఎక్కువ కనిపిస్తున్నారు. వీరిని నడిపించే ఉన్నతోద్యోగుల పరిస్థితి కూడా ఇంతే!  ఏ ఇతర రంగాల్లోనూ లేనివిధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 1964, 1995 సహకార చట్టాలు అమల్లో ఉన్నాయి. ఒకే రంగానికి రెండు చట్టాలేమిటి? 1904, 1912,1932, 1964 సహకార చట్టాలకు రూల్స్‌ ఉన్నాయి. కానీ, 1995 చట్టం అమల్లోకి వచ్చి 29 ఏళ్లయినా ఇప్పటికీ రూల్స్‌ లేవు. రిజిష్ట్రార్‌ బాధ్యతలపై కూడా స్పష్టమైన నిబంధనల్లేవు.
– దాసరి కేశవులు, సీనియర్‌ సహకారవేత్త, చైర్మన్, సహకార భూమి జర్నల్‌ కోఆపరేటివ్‌ సొసైటీ, విజయవాడ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement