Urban Cooperative Bank
-
అంతర్జాతీయ సహకార మహాసభ.. ఒకే రంగానికి రెండు చట్టాలెందుకు?
పరస్పరం సహకరించుకోవటం మానవ సహజ లక్షణం. ఈ లక్షణాన్ని ఒక పద్ధతి ప్రకారం కొనసాగించడానికి సహకార సంఘాలు (కోఆపరేటివ్ సొసైటీలు) దోహదం చేస్తాయి. ప్రపంచ సహకార వ్యవస్థకు 130 ఏళ్ల చరిత్ర, సుసంపన్న వారసత్వం ఉన్నాయి. ప్రపంచ జనాభాలో 12% మంది ఏదో ఒక సహకార సంఘంలో సభ్యులే. మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, వందేళ్లకు పైబడి చక్కగా ఆర్థిక సేవలందిస్తున్న ఘనమైన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు (పిఎసిఎస్‌లు), సహకార అర్బన్ బ్యాంకులు అనేకం కనిపిస్తాయి. ఈ నెల 14 నుంచి సహకార వారోత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మరో రెండు ముఖ్య విశేషాలు... ఈ నెల 25 నుంచి 30 వరకు న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా అంతర్జాతీయ సహకార మహాసభ జరగబోతోంది.అంతర్జాతీయ మహాసభ మన దేశంలో జరగటం ఇదే మొదటిసారి. సుమారు రెండు వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఐక్యరాజ్యసమితి 2025వ సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ సహకార సంవత్సరం’గా ప్రకటించింది. ఈ పండుగకు కూడా ఈ నెల 25న ఉత్సాహపూరిత వాతావరణంలో న్యూఢిల్లీలో తెర లేవనుంది. సహకార విలువలకు తిలోదకాలు, అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం.. వంటి అవశ్యం వదిలించుకోవాల్సిన జాఢ్యాలు మన సహకార వ్యవస్థను పట్టి పీడిస్తున్నప్పటికీ.. మొక్కవోని సహకార స్ఫూర్తి మన సమాజంలో అనుక్షణం వర్థిల్లుతూనే ఉంటుంది. సహకారం కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది! ఈ నేపథ్యంలో తలపండిన సహకారవేత్తల అభిప్రాయాలు తెలుసుకుందాం. సహకార సంఘం అంటే?సభ్యుల ప్రయోజనాలను నెరవేర్చటమే లక్ష్యంగా పనిచేసే ప్రజాస్వామిక సంస్థ సహకార సంఘం. యాజమాన్యం, నియంత్రణ, నిర్వహణ అన్నీ సభ్యులదే. సభ్యుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అవసరాలు, ఆకాంక్షలను నెరవేర్చటమే సహకార సంఘాల ధ్యేయం. సహకారం రాష్ట్ర సబ్జెక్ట్.. కేంద్రం చట్టాలు ఎలా చేస్తుంది?ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య, ఒక దేశంలో ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించటానికి సహకార వ్యవస్థ ఉపయోగపడుతుంది. చాలా దేశాల్లో సహకార వ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఉంది. నెదర్లాండ్స్‌లో సహకార సంఘాలకు స్వేచ్ఛ ఎక్కువ. అధికారుల జోక్యం ఉండదు. ఫ్రాన్స్‌లో 2008లో ఆర్థిక మాంద్యం దెబ్బకు వాణిజ్య బ్యాంకులు నిలవలేక సహకార బ్యాంకుల్లో విలీనమయ్యాయి. అమెరికాలోనూ కమ్యూనిటీ బ్యాంకులు బలంగా ఉన్నాయి. జర్మనీలో రైతులకు ఎక్కువ రుణాలిస్తున్నది సహకార బ్యాంకులే. న్యూజిలాండ్‌లో డెయిరీ కోఆపరేటివ్లదే రాజ్యం. లాటిన్ అమెరికాలో ఇటీవల కోఆపరేటర్లు బలపడుతూ కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నారు.జవాబుదారీతనం ఏదీ?మన దేశంలో సహకార విస్తరణకు అవకాశాలెక్కువ. మన సంస్కృతిలోనే సహకార స్ఫూర్తి ఉంది. గ్రామీణులు, గిరిజనుల్లో ఇది మరీ ఎక్కువ. అయితే, అధికారులకు అధిక పెత్తనం ఇవ్వటం, జవాబుదారీతనం లేకుండా చేయటం వల్ల మన దేశంలో సహకార వ్యవస్థ దెబ్బతింటున్నది. ఆర్బీఐ నిబంధనలు, సహకార చట్టాల మధ్య వైరుధ్యం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను కుంగదీస్తోంది. సహకార విలువలను తుంగలో తొక్కేలా కొన్ని నిబంధనలు ఉంటున్నాయి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, మల్టీస్టేట్ కోఆపరేటివ్‌ల విషయంలో రాష్ట్ర సహకార చట్టాలు నిర్దేశించే నిబంధనలకు భిన్నమైన నిబంధనలను బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నిర్దేశిస్తోంది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు షేర్ క్యాపిటల్ తిరిగి ఇవ్వొద్దని, డైరెక్టర్ల పదవీ కాలం నాలుగేళ్లేనని (సహకార చట్టాల ప్రకారం 5 ఏళ్లు).. ఇలా అనేక విషయాల్లో వైరుధ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న 45 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో 20 బ్యాంకులు వందేళ్ల క్రితం నుంచి ఉన్నవే. ఇవి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక తోడ్పాటునూ పొందటం లేదు. పిఎసిఎస్‌లలో బ్యాంకింగ్ సేవలా?సహకారం పూర్తిగా రాష్ట్ర సబ్జెక్ట్. రాష్ట్రాలతో చర్చించకుండానే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టాలు చేస్తోంది. ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలతో ఇంకో 25 పనులు చేయించాలని కేంద్ర సహకార శాఖ నిర్దేశించింది. ఇందులో బ్యాంకింగ్ సేవలు కూడా ఉన్నాయి. నిధులు దుర్వినియోగం జరగకుండా పర్యవేక్షించేదెవరూ అంటే సమాధానం లేదు. ఇది సరికాదు. అమలు చేయాల్సింది రాష్ట్రాలైనప్పుడు సహకార రిజిస్ట్రార్, ముఖ్య కార్యదర్శితో కనీసం చర్చించకుండానే కేంద్రం నిర్ణయాలు తీసుకుంటే ఎలా? సహకార సంస్థల్లో అక్రమాలకు బాధ్యులను జవాబుదారీ చేయటం లేదు. ఎంత అవినీతి జరిగినా రాష్ట్ర ప్రభుత్వాలు అరెస్టులు, ఆస్తుల రికవరీ వంటి చర్యలు తీసుకోవటం లేదు. సహకార శాఖకు ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ జవాబుదారీతనం లేకుండా΄ోయింది. – మానం ఆంజనేయులు పూర్వ అధ్యక్షులు, విశాఖ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, పూర్వ ఉపాధ్యక్షులు, నాఫ్కాబ్ కేంద్రం తెచ్చిన కొత్తచట్టాలతో చేటుభారతీయ ఆర్థిక రంగంలో సహకార వ్యవస్థ వాటా 43% వుంది. రైతులు, గ్రామీణ చేతివృత్తిదారులు, బలహీన వర్గాలు ఈ సహకార వ్యవస్థలో భాగస్వాములు. గత 75 సంవత్సరాలుగా 29 కోట్ల మంది సభ్యులు తమ ఖర్చులు తగ్గించుకొని రూ.40,689 కోట్ల మూలధనంతో సుమారు 9 లక్షల సహకార సంఘాలను స్థాపించుకున్నారు. రూ. లక్షల కోట్ల సహకార ఆర్థిక సౌధాన్ని నిర్మించారు. దీన్ని అక్రమంగా పెట్టుబడిదారుల పరం చేయటానికి పార్లమెంటులో రెండు చట్టాలు చేశారు. వీటిని అమలుచేస్తే జిల్లా స్థాయి సహకార బ్యాంకుల నుంచి ఇఫ్కో, క్రిభ్కో, నాఫెడ్ వంటి పెద్ద సంస్థలన్నీ కారుచౌకగా పెట్టుబడిదారుల పరం అవుతాయి. సహకార సిద్ధాంతాలకు, సహకార సూత్రాలకు ఇది విరుద్ధం. మొత్తంగా భారత రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని రాజ్యాంగ సవరణ చేయకుండానే ఈ చట్టాలు మార్చేస్తున్నాయి. ప్రజలు చైతన్యవంతులై వీటిని అడ్డుకోవాలి. సహకార ధర్మపీఠం తరఫున దేశవ్యాప్త ప్రచారోద్యం చేపట్టాం. – సంభారపు భూమయ్య , సీనియర్ సహకారవేత్త, సహకార ధర్మపీఠం, హైదరాబాద్సహకార సంస్థల బలోపేతానికి దోహదంఅంతర్జాతీయ సహకార మహాసభ న్యూఢిల్లీలో ఈ నెలాఖరులో జరుపుకోవటం సంతోషదాయకం. దేశంలో సహకార సంస్థలన్నీ బలోపేతం కావటానికి, ప్రభుత్వం మరింత దృష్టి కేంద్రీకరించడానికి అంతర్జాతీయ మహాసభ ఉపయోగపడుతుంది. సహకార సంఘాలు చాలా వరకు వ్యవసాయ ఉత్పాదకాల సరఫరా వరకే పరిమితం అవుతున్నాయి. ప్రాసెసింగ్, విలువ జోడింపు, ఉత్పత్తులను నేరుగా ప్రజలకు విక్రయించటం, ఉత్పత్తుల బ్రాండింగ్ చేసుకోవాలి. ఆన్లైన్, సొంత అవుట్ లెట్ల ద్వారా విక్రయించాలి. రైతుల ప్రయోజనమే పరమావధిగా ముల్కనూర్ సొసైటీ 60 ఏళ్లుగా ఇటువంటి అనేక సేవలు అందిస్తోంది. గోదాములు నిర్మించటం, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు సహకార సంఘాలకు ప్రభుత్వం తక్కువ వడ్డీకి రుణాలిచ్చి ప్రోత్సహించాలి. శిక్షణపై దృష్టి కేంద్రీకరించాలి. సహకార సంఘాల సభ్యులు, సిబ్బంది, బోర్డు సభ్యులకు సహకార విలువలు, వాణిజ్య, నిర్వహణ నైపుణ్యాల పెంపుదల శిక్షణకు కృషి చెయ్యాలి.– అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, అధ్యక్షులు, ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సంఘం, తెలంగాణఒకే రంగానికి రెండు చట్టాలెందుకు?సహకార రంగం ఆర్థిక పురోగతి బాగానే వుంది. కానీ, నడక సరిగ్గా లేదు. సహకార మూల సూత్రాలకు సహకార వ్యవస్థ దూరమైంది. సహకార విద్య, సహకార విలువలకు సంబంధించిన కనీస జ్ఞానం కొరవడిన యంత్రాంగం ఆధ్వర్యంలో తెలుగునాట సహకార వ్యవస్థ నడుస్తోంది. సహకార హక్కులు, బాధ్యతలు తెలియని దుస్థితి. 12 నెలలు శిక్షణ పొందినవారే సహకార సంస్థల్లో సిబ్బందిగా వుండాలన్నది నియమం. చదవండి: ఫ్యామిలీ ఫార్మింగ్.. విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణఇప్పుడున్న సహకార సిబ్బందిలో 90 శాతం సరైన శిక్షణ లేనివారే. ఉద్యోగం చేస్తూ మూడు నెలలు, ఆరు నెలల డిప్లొమా అంటూ సర్టిఫికెట్లు పొందిన వారే ఎక్కువ కనిపిస్తున్నారు. వీరిని నడిపించే ఉన్నతోద్యోగుల పరిస్థితి కూడా ఇంతే! ఏ ఇతర రంగాల్లోనూ లేనివిధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 1964, 1995 సహకార చట్టాలు అమల్లో ఉన్నాయి. ఒకే రంగానికి రెండు చట్టాలేమిటి? 1904, 1912,1932, 1964 సహకార చట్టాలకు రూల్స్ ఉన్నాయి. కానీ, 1995 చట్టం అమల్లోకి వచ్చి 29 ఏళ్లయినా ఇప్పటికీ రూల్స్ లేవు. రిజిష్ట్రార్ బాధ్యతలపై కూడా స్పష్టమైన నిబంధనల్లేవు.– దాసరి కేశవులు, సీనియర్ సహకారవేత్త, చైర్మన్, సహకార భూమి జర్నల్ కోఆపరేటివ్ సొసైటీ, విజయవాడ -
డిపాజిటర్ల డబ్బు పరిరక్షణే పవిత్ర విధి
ముంబై: డిపాజిటర్లు కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించడం బ్యాంకర్‌కు పవిత్రమైన విధి అని, ఇది మతపరమైన స్థలాన్ని సందర్శించడం కంటే చాలా ముఖ్యమైనదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. చిన్న పొదుపుదారులు, మధ్యతరగతి, పదవీ విరమణ చేసిన వారి నుండి సమీకరించిన డిపాజిట్లపై మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ డబ్బు పరిరక్షణే ప్రధాన పవిత్ర విధిగా భావించాలని ఆయన అన్నారు. ‘‘డిపాజిటర్ల డబ్బును రక్షించడం బ్యాంకు అతి ముఖ్యమైన బాధ్యత. ఇది పవిత్రమైన విధి. గుడి లేదా మసీదు లేదా గురుద్వారాకు నమస్కరించడం కంటే.. డిపాజిటర్ల సొమ్మును పరిరక్షించడం ఎంతో పవిత్రమైన విధి’’ దాస్ అన్నారు. బ్యాంకింగ్ రంగంలోని ప్రతి ఒక్కరిపై ఉన్న ‘‘అతిపెద్ద బాధ్యత ఇది’’ అని ఇక్కడ నిర్వహించిన అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు (యుసీబీ) డైరెక్టర్ల సమావేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. దాస్ ఆగస్టు 30వ తేదీన ఈ మేరకు చేసిన ఒక ప్రసంగాన్ని ఆర్బీఐ సోమవారం యూట్యూబ్‌లో అప్డేట్ చేసింది. ఆయన ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు... ► డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉందని నిర్ధారించడానికి అన్ని బ్యాంకులతో కలిసి పనిచేయడం రిజర్వ్ బ్యాంక్ బాధ్యత. అందువల్ల ఈ దిశలో సెంట్రల్ బ్యాంక్ ప్రయత్నాలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. నిబంధనలు, పర్యవేక్షణ చర్యలు కొనసాగుతూనే ఉంటాయి. ► ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే... సహకార బ్యాంకింగ్ రంగంలో సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా డిపాజిటర్ సొమ్ము నిలిచిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో చాలా వరకూ నిర్వహణలో అక్రమాలే ప్రధాన కారణం. ఇక్కడ మనం యూసీబీ.. పంజాబ్ అండ్ మహారాష్ట్ర బ్యాంక్‌ను ప్రస్తావించుకోవచ్చు. ► 1,500 పైగా సంస్థలపై మెరుగైన నియంత్రణ, పర్యవేక్షణ చేయాలన్న ప్రధాన దృక్పథంతో యూసీబీల కోసం ఆర్బీఐ నాలుగు అంచెల పర్యవేక్షణా యంత్రాంగాన్ని రూపొందించింది. ► ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో యూసీబీలు ముఖ్యమైన భాగం. ► యూసీబీలపై ఆర్బీఐ పర్యవేక్షణను పటిష్టం చేయడాన్ని... ఆయా సంస్థలు తమ వృద్ధికి ఆటంకాలు కలిగించే ప్రయత్నంగా చూడవద్దు. యూసీబీల మొండిబకాయిలపై హెచ్చరిక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులలో స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి (జీఎన్‌పీఏ) 8.7 శాతంగా ఉన్న విషయాన్ని గవర్నర్ ప్రస్తావిస్తూ, దీనిపట్ల సెంట్రల్ బ్యాంక్ ‘‘సౌఖ్యంగా లేదు’’ అని స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల జీపీఎన్ఏలు 2023 మార్చిలో దశాబ్దపు అత్యుత్తమ స్థాయి 3.9 శాతానికి చేరుకున్నాయని, మరింత మెరుగుపడతాయన్న అంచనాలూ ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు. ఎన్పీఏల సమస్యను మెరుగుపరచడానికి యూసీబీలూ తగిన కృషి చేయాలని కోరారు. అలాగే యూసీబీలు పాలనా ప్రమాణాలను మెరుగుపరచాలని, డైరెక్టర్లు, అధికారుల వంటి బ్యాంకు నిర్వహణా సంబంధ పార్టీ లావాదేవీలను నివారించాలని, రుణ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆయన కోరారు. యూసీబీలు ఇటీవలి కాలంలో బహుళ సవాళ్లను ఎదుర్కొంటున్నాయని దాస్ పేర్కొన్నారు. మున్ముందు యూసీబీ సెగ్మెంట్.. డిజిటల్, ఫిన్‌టెక్, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, సూక్ష్మ రుణదాతలు వంటి టెక్–అవగాహన సంస్థల నుండి తీవ్ర పోటీని ఎదుర్కొననుందని, అందువల్ల సాంకేతికతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని దాస్ చెప్పారు. అయితే ఈ రంగంలో కొన్ని బ్యాంకులు తగిన విధంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. -
కోపరేటివ్ బ్యాంకులకు ఏకరూప ప్రొవిజన్ నిబంధనలు
ముంబై: పట్టణ కోపరేటివ్ బ్యాంకులకు సంబంధించి స్టాండర్డ్ రుణ ఆస్తుల విషయంలో ప్రొవిజన్ నిబంధనలను ఏకరీతిలో మార్పు చేస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది డిసెంబర్లో పట్టణ కోపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ టైర్ 1, 2, 3, 4 అని నాలుగు కేటగిరీలుగా చేసింది. అంతకుముందు వరకు అవి కేటగిరీ 1, 2గానే ఉండేవి. ఇప్పుడు వాటి కేటగిరీతో సంబంధం లేకుండా ప్రామాణిక రుణ ఆస్తులకు కేటాయింపుల విషయంలో అన్నింటికీ ఒకే విధమైన నిబంధనలను ప్రకటించింది. అగ్రికల్చర్, ఎస్ఎంఈ రంగాలు స్టాండర్డ్ కిందకు వస్తాయి. ఈ రుణ ఆస్తులు అన్నింటికీ 0.25 శాతం కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. అలాగే, వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగ రుణాలకు సంబంధించి 1 శాతం కేటాయింపులు చేయాలి. కమర్షియల్ రియల్ ఎస్టేట్ – రెసిడెన్షియల్ హౌసింగ్ సెక్టార్ రుణాలకు 0.75 శాతం కేటాయింపులు చేయాలి. ఇతర అన్ని రకాల రుణాలకు 0.4 శాతం కేటాయింపుల నిబంధన వర్తిస్తుంది. -
పట్టణ సహకార బ్యాంకులకు నాలుగంచెల వ్యవస్థ
ముంబై: అర్బన్ కోపరేటివ్ బ్యాంకుల (యూసీబీలు)కు నాలుగు అంచెల నిర్మాణాన్ని ఆర్బీఐ నియమిత కమిటీ సూచించింది. డిపాజిట్లు, క్యాపిటల్ అడెక్వసీ రేషియో, పరిమాణం ఆధారంగా నియంత్రణపరమైన నిబంధనల ఆధారంగా ఈ సిఫారసు చేసింది. రూ.100 కోట్ల వరకు డిపాజిట్లు కలిగిన యూసీబీలను టైర్–1 కింద... రూ.100–1,000 కోట్ల మధ్య డిపాజిట్లు ఉన్న యూసీబీలను టైర్–2 కింద, రూ.1,000–10,000 కోట్ల మధ్య డిపాజిట్లు కలిగిన యూసీబీలను టైర్–3 కింద, రూ.10,000 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్న యూసీబీలను టైర్–4 కింద వర్గీకరించాలని పేర్కొంది. కనీస ‘క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో’ను (సీఆర్ఏఆర్) 9–15 శాతం మధ్య సిఫారసు చేసింది. అలాగే, టైర్–4 యూసీబీలకు బాసెల్–3 నిబంధనలను సూచించింది. గృహ రుణాలు, బంగారం ఆభరణాలపై రుణాలు, అన్సెక్యూర్డ్ రుణాలకు సంబంధించి ఈ విభాగాల వారీగా వేర్వేరు పరిమితులు ఉండాలని పేర్కొంది. నిర్దేశిత అవసరాలను చేరుకోలేకపోయిన యూసీబీలకు తగినంత సమయం ఇచ్చిన తర్వాత తప్పనిసరి విలీన మార్గాన్ని అనుసరించొచ్చని కమిటీ తన సిఫారసుల్లో సూచించడం గమనార్హం. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం కింద యూసీబీల విలీనం, పునర్నిర్మాణానికి సంబంధించి ఆర్బీఐ ఒక పథకాన్ని రూపొందించుకోవచ్చని పేర్కొంది. ప్రాథమిక పట్టణ సహకార బ్యాంకులపై అధ్యయనం, సిఫారసుల కోసం ఎన్ఎస్ విశ్వనాథన్ చైర్మన్‌గా ఆర్బీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక నిపుణుల కమిటీని నియమించింది. -
నిర్వహణ బోర్డును ఏర్పాటు చేసుకోవాల్సిందే..
ముంబై: అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ (బీవోఎం)ను ఏడాదిలోపు ఏర్పాటు చేసుకోవాలని ఆర్బీఐ ఆదేశించింది. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన అన్నింటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. నిర్వహణను పర్యవేక్షించేందుకు నిపుణుల కలయికతో బీవోఎం ఉండాలని ఆర్బీఐ పేర్కొంది. డైరెక్టర్ల బోర్డుకు ఇది అదనం. పీఎంసీ బ్యాంకు సంక్షోభం కారణంగా 9 లక్షల మంది డిపాజిటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో తదనంతరం కోపరేటివ్ బ్యాంకుల నిర్వహణకు సంబంధించి ఆర్బీఐ పలు దిద్దుబాటు చర్యలను అమల్లోకి తీసుకొస్తోంది. ‘‘అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు ప్రజల డిపాజిట్లను స్వీకరిస్తున్నందున, డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యేక యంత్రంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’’ అని ఆర్బీఐ పేర్కొంది. అర్బన్ కోపరేటివ్ బ్యాంకుల్లో బ్యాంకింగ్ లావాదేవీలను బీవోఎం పర్యవేక్షిస్తూ, సరైన నిర్వహణ దిశగా డైరెక్టర్ల బోర్డుకు సాయం అందిస్తుందని తెలిపింది. -
సహకార బ్యాంకుల పనితీరుపై ఆర్బీఐ సమీక్ష
భువనేశ్వర్: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (పీఎంసీ) స్కామ్‌తో లక్షల మంది డిపాజిటర్లు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అర్బన్ సహకార బ్యాంకుల పనితీరును రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డు శనివారం సమీక్షించింది. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, అంతర్గతంగాను.. అంతర్జాతీయంగాను దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు మొదలైన అంశాలు కూడా చర్చించింది. గవర్నర్ శక్తికాంత దాస్ సారథ్యంలో సమావేశమైన సెంట్రల్ బోర్డు.. పట్టణ ప్రాంత కోఆపరేటివ్ బ్యాంకులు, వాటితో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల్లో నిబంధనల అమలు తదితర అంశాలను సమీక్షించిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రియల్టీ సంస్థ హెచ్‌డీఐఎల్‌కు మొత్తం రూ. 6,226 కోట్ల మేర రుణాలిచ్చినప్పటికీ .. పీఎంసీ బ్యాంకు కేవలం రూ. 440 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు ఆర్బీఐకి చూపించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్ బైటపడటంతో పీఎంసీ బ్యాంకు ఖాతాదారుల విత్డ్రాయల్స్పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. -
చిన్న బ్యాంకా.. మాకొద్దు!
సాక్షి, బిజినెస్ విభాగం: చిన్న బ్యాంకుల లైసెన్స్‌లు ఇస్తాం తీసుకోండి బాబూ అని ఆర్బీఐ పిలిచి మరీ అవకాశం ఇచ్చినా... పట్టణాల్లోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి ఏ మాత్రం స్పందన లేదు. చిన్న బ్యాంకులు మాకొద్దులేనన్న తీరులో అవి స్పందిస్తున్నాయి. నిజానికి ఆర్బీఐ చర్య సహకార బ్యాంకుల వ్యవస్థను అస్థిరపరిచేదిగా ఉందన్న భావన వ్యక్తమవుతోంది. కోఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు చాలా బలంగా ఉండగా... అదే సమయంలో మూడంచెల గ్రామీణ కోఆపరేటివ్ వ్యవస్థ అధిక మొండి బకాయిలు (ఎన్పీఏ), నష్టాలతో సతమతం అవుతోంది. తాజా పరిణామంపై నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ (నాఫ్కబ్) సీఈవో సుభాష్ గుప్తా స్పందిస్తూ... ‘‘కోపరేటివ్ బ్యాంకులపై గాంధీ కమిటీ తన నివేదిక విడుదల చేసినప్పుడు ఆ సిఫారసులను జనరల్‌బాడీ ఆమోదించలేదు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను బ్యాంకులుగా మార్చడం వల్ల కోఆపరేటివ్ నిర్మాణం బలహీనపడుతుంది. కనుక దీనికి మేం సానుకూలంగా లేం’’ అని తెలిపారు. బ్యాంకులుగా మారే సత్తా... అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో పెద్దవిగా ఉన్న కొన్నింటి ఆర్థిక సామర్థ్యం చూస్తే వాటికి పూర్తి స్థాయి బ్యాంకులుగా మారే సత్తా దండిగా ఉంది. సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంకు, కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంకు, షామ్రో వితల్ కోఆపరేటివ్ బ్యాంకులు ఈ సామర్థ్యం ఉన్నవే. సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.58,500 కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేయగా, రూ.241 కోట్ల లాభాన్ని ఆర్జించింది. కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంకు మొత్తం వ్యాపార పరిమాణం 2016 ఆర్థిక సంవత్సరానికి రూ.26,369 కోట్లు, నికర లాభం రూ.460 కోట్లుగా ఉండడం గమనార్హం. పెద్ద బ్యాంకుల స్థాయి వ్యాపారం వీటికి ఉండటం గమనార్హం. కోఆపరేటివ్ నమూనా తమకు చక్కగా సరిపోతుందని, అతిపెద్ద అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుగా దీర్ఘకాలిక డిపాజిట్ల జారీ ద్వారా రూ.300 కోట్లను సమీకరిస్తున్నామని సారస్వత్ బ్యాంకు చైర్మన్ గౌతం ఠాకూర్ తెలిపారు. ఎన్పీఏలు తక్కువే 2017 మార్చి నాటికి మన దేశంలో 1,562 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, 94,384 రూరల్ కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల మొత్తం డిపాజిట్లు 2017 మార్చి 31 నాటికి రూ.4,43,500 కోట్లుగా ఉంటే, అడ్వాన్సులు (రుణాలు) రూ.2,61,200 కోట్లుగా ఉండడం గమనించాల్సిన అంశం. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల కంటే ఎన్పీఏల విషయంలో కోఆపరేటివ్ బ్యాంకుల పరిస్థితే మెరుగ్గా ఉంది. స్థూల ఎన్పీఏలు 7.1%, నికర ఎన్పీఏలు రూ.2.7%గా ఉన్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల ఉమ్మడి నికర లాభం పన్ను అనంతరం రూ.3,900 కోట్లుగా ఉంది. గతంలో ఆర్బీఐ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల విషయంలో ఉదారంగా వ్యవహరించింది. ఫలితంగా 1993–2004 మధ్యలో వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే, బలహీన ఆర్థిక పనితీరు వంటి అంశాలలో ఆర్బీఐ తన వైఖరి మార్చుకుంది. దాంతో విలీనాలు, వైదొలగడా లు వంటివి జరిగాయి. దాంతో 2004 మార్చి నాటికి 1,926 కోపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉండగా, ఆ సంఖ్య 2017 మార్చి నాటికి 1,526కు తగ్గుముఖం పట్టింది. మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా ల్లో ఎక్కువగా విలీనాలు చోటు చేసుకున్నాయి. కోపరేటివ్ బ్యాంకుల నిర్మాణమిదీ... కోఆపరేటివ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ రెండు కేటగిరీలు. 1. అర్బన్ కోపరేటివ్ 2. రూరల్ కోపరేటివ్. రూరల్ కోఆపరేటివ్ విభాగంలో మళ్లీ, షార్ట్ (మీడియం టర్మ్ కూడా కలుపుకుని), లాంగ్‌టర్మ్ క్రెడిట్ కేటగిరీలుగా విభజన ఉంది. షార్ట్ టర్మ్ రూరల్ క్రెడిట్ కేటగిరీ తిరిగి మూడంచెలుగా ఉంటుంది. ఇవి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులు, డీసీసీబీలు, పీఏసీఎస్‌లు. లాంగ్‌టర్మ్ కోఆపరేటివ్ బ్యాంకులు... స్టేట్ కోఆపరేటివ్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, ప్రైమరీ కోఆపరేటివ్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకులుగా వర్గీకరణ ఉంది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు ఈ వ్యవస్థ నుంచి తప్పుకుంటే మిగిలినవి మరింత బలహీనంగా మారిపోతాయన్న ఆందోళన ఉంది. 2016 మార్చికి డిస్ట్రిక్స్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల (డీసీసీబీ) మొత్తం ఎన్పీఏలు రూ.22,400 కోట్లు, స్టేట్ కోఆ పరేటివ్ బ్యాంకుల ఎన్పీఏలు రూ.5,147 కోట్లు. -
ప్రగతి పథంలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.134కోట్ల టర్నోవర్ బ్యాంకు చైర్మన్ ప్రదీప్‌రావు కాశిబుగ్గ: నగరంలో 21ఏళ్ల క్రితం ఒకే బ్రాంచితో ప్రారంభమైన అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు ప్రస్తుతం ఆరు బ్రాంచిలతో విస్తరించి, రూ.134 కోట్ల టర్నోవర్‌తో ప్రగతి పథంలో సాగుతోందని బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తెలిపారు. నగరంలోని స్వర్ణ ఫంక్షన్ ప్యాలెస్‌లో ఆదివారం ప్రదీప్‌రావు బ్యాంకు 20వ వార్షిక నివేదికను ప్రవేశపెట్టగా, వాటాదారులు, ఖాతాదారుల చప్పట్లతో ఆమోదించారు. ఈ సందర్భంగా బ్యాంకు పురోగతి, చేపడుతున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, వాటాదారులకు గల సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం వరకు బ్యాంకు రూ.82.75 కోట్ల డిపాజిట్లు, రూ.51.40 కోట్ల రుణాల మంజూరుతో రూ.134 కోట్ల టర్నోవర్ సాధించినట్లు తెలిపారు. కాశిబుగ్గలో సొంత భవనాన్ని నిర్మించామని, ఆర్బీఐ అనుమతితో 4 ఏటీఎంలను ఏర్పాటు చేసి, ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బ్యాంకు పురోభివృద్ధికి వాటాదారులు, ఖాతాదారులు సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు తోట జగన్నాథం, డైరెక్టర్లు పాలారపు కృష్ణమూర్తి, వేణుగోపాల్, కూరపాటి చంద్రమౌళి, తోట సంపత్‌కుమార్, గౌసొద్దీన్, నరేష్కుమార్, పవన్‌కుమార్, పాపిరెడ్డి, రమేష్‌గౌడ్, సృజన్‌కుమార్, హరినాథ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.