ముంబై: అర్బన్ కోపరేటివ్ బ్యాంకుల (యూసీబీలు)కు నాలుగు అంచెల నిర్మాణాన్ని ఆర్‌బీఐ నియమిత కమిటీ సూచించింది. డిపాజిట్లు, క్యాపిటల్ అడెక్వసీ రేషియో, పరిమాణం ఆధారంగా నియంత్రణపరమైన నిబంధనల ఆధారంగా ఈ సిఫారసు చేసింది. రూ.100 కోట్ల వరకు డిపాజిట్లు కలిగిన యూసీబీలను టైర్–1 కింద... రూ.100–1,000 కోట్ల మధ్య డిపాజిట్‌లు ఉన్న యూసీబీలను టైర్–2 కింద, రూ.1,000–10,000 కోట్ల మధ్య డిపాజిట్‌లు కలిగిన యూసీబీలను టైర్–3 కింద, రూ.10,000 కోట్లకు పైగా డిపాజిట్‌లు ఉన్న యూసీబీలను టైర్–4 కింద వర్గీకరించాలని పేర్కొంది. కనీస ‘క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో’ను (సీఆర్‌ఏఆర్) 9–15 శాతం మధ్య సిఫారసు చేసింది. అలాగే, టైర్–4 యూసీబీలకు బాసెల్–3 నిబంధనలను సూచించింది.
గృహ రుణాలు, బంగారం ఆభరణాలపై రుణాలు, అన్‌సెక్యూర్డ్ రుణాలకు సంబంధించి ఈ విభాగాల వారీగా వేర్వేరు పరిమితులు ఉండాలని పేర్కొంది. నిర్దేశిత అవసరాలను చేరుకోలేకపోయిన యూసీబీలకు తగినంత సమయం ఇచ్చిన తర్వాత తప్పనిసరి విలీన మార్గాన్ని అనుసరించొచ్చని కమిటీ తన సిఫారసుల్లో సూచించడం గమనార్హం. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం కింద యూసీబీల విలీనం, పునర్‌నిర్మాణానికి సంబంధించి ఆర్‌బీఐ ఒక పథకాన్ని రూపొందించుకోవచ్చని పేర్కొంది. ప్రాథమిక పట్టణ సహకార బ్యాంకులపై అధ్యయనం, సిఫారసుల కోసం ఎన్‌ఎస్ విశ్వనాథన్ చైర్మన్‌గా ఆర్‌బీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక నిపుణుల కమిటీని నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment