
ముంబై: పట్టణ కోపరేటివ్ బ్యాంకులకు సంబంధించి స్టాండర్డ్ రుణ ఆస్తుల విషయంలో ప్రొవిజన్ నిబంధనలను ఏకరీతిలో మార్పు చేస్తూ ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో పట్టణ కోపరేటివ్ బ్యాంకులను ఆర్‌బీఐ టైర్ 1, 2, 3, 4 అని నాలుగు కేటగిరీలుగా చేసింది. అంతకుముందు వరకు అవి కేటగిరీ 1, 2గానే ఉండేవి. ఇప్పుడు వాటి కేటగిరీతో సంబంధం లేకుండా ప్రామాణిక రుణ ఆస్తులకు కేటాయింపుల విషయంలో అన్నింటికీ ఒకే విధమైన నిబంధనలను ప్రకటించింది.
అగ్రికల్చర్, ఎస్‌ఎంఈ రంగాలు స్టాండర్డ్ కిందకు వస్తాయి. ఈ రుణ ఆస్తులు అన్నింటికీ 0.25 శాతం కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. అలాగే, వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగ రుణాలకు సంబంధించి 1 శాతం కేటాయింపులు చేయాలి. కమర్షియల్ రియల్ ఎస్టేట్ – రెసిడెన్షియల్ హౌసింగ్ సెక్టార్ రుణాలకు 0.75 శాతం కేటాయింపులు చేయాలి. ఇతర అన్ని రకాల రుణాలకు 0.4 శాతం కేటాయింపుల నిబంధన వర్తిస్తుంది.