న్యూఢిల్లీ: స్క్రాపేజీ (తుక్కు) విధానం కింద పాత కార్లను వదిలించుకుని, కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి 5 శాతం రిబేటు లభిస్తుందని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ‘ఇలా కొత్త కారు కొనుగోలు చేసే వారికి ఆటోమొబైల్ కంపెనీలు దాదాపు 5 శాతం రిబేటు ఇస్తారు‘ అని ఆయన తెలిపారు. ‘స్క్రాపేజీ విధానంలో నాలుగు అంశాలు ఉన్నాయి. వాటిలో రిబేటు కూడా ఒకటి. దీనితో పాటు కాలుష్యం వెదజిమ్మే పాత వాహనాలపై హరిత పన్ను మొదలైనవి విధించడం, ఫిట్‌నెస్ టెస్టు, పొల్యూషన్ టెస్టు చేయించుకోవడం తప్పనిసరి చేయడం మొదలైనవి ఉన్నాయి. టెస్టింగ్ కోసం దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ సెంటర్లు అవసరం. వీటి ఏర్పాటుపై దృష్టి పెడుతున్నాం’ అని మంత్రి చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ టెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఇక స్క్రాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడంలో ప్రైవేట్ సంస్థలు, రాష్ట్రాల ప్రభుత్వాలనకు కేంద్రం తగు సహయా సహకారాలు అందిస్తుందని తెలిపారు. టెస్టుల్లో విఫలమైన వాహనాలను నడిపే వారికి భారీ జరిమానాలు విధించడంతో పాటు వాహనాన్ని జప్తు కూడా చేయొచ్చని పేర్కొన్నారు.
ఆటోమొబైల్‌కు వరం..
స్క్రాపేజీ విధానం.. ఆటోమొబైల్ రంగానికి వరంగా మారుతుందని గడ్కరీ చెప్పారు. దీనితో అత్యంత లాభసాటి రంగంగా ఆటోమొబైల్ పరిశ్రమ ఎదగగలదని, భారీ స్థాయిలో ఉపాధి కల్పించగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ. 4.5 లక్షల కోట్లుగా ఉన్న దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ టర్నోవరు.. రాబోయే రోజుల్లో 30 శాతం పైగా వృద్ధి చెందగలదని.. దాదాపు రూ. 10 లక్షల కోట్లకు చేరగలదని గడ్కరీ వివరించారు. టర్నోవరులో రూ.1.45 లక్షల కోట్లుగా ఉన్న ఎగుమతులు.. రూ. 3 లక్షల కోట్లకు చేరగలదన్నారు. స్క్రాపేజీ పాలసీ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే తుక్కుగా మార్చిన వాహనాల నుంచి.. ఉక్కు, ప్లాస్టిక్, రబ్బరు, అల్యూమినియం వంటి ముడి సరుకు లభ్యత పెరుగుతుందని, దీనితో ఆటోమొబైల్ పరికరాల తయారీ ఖర్చులు 30–40 శాతం దాకా తగ్గగలదని గడ్కరీ చెప్పారు.
కొత్త వాహనంపై 5 శాతం రిబేటు
Published Mon, Mar 8 2021 5:21 AM | Last Updated on Mon, Mar 8 2021 5:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment