Union road transport
-
కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. రోడ్డు ప్రమాద బాధితులకు ఊరట
రోడ్డు ప్రమాదాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు నగదు రహిత చికిత్స అందించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక కొత్త పథకాన్ని రూపొందించింది. ఈ పథకం అమలు పైలట్ ప్రాతిపదికన ఇప్పటికే ప్రారంభమైంది.ఎలాంటి రోడ్డులోనైనా మోటారు వాహనాల వల్ల సంభవించిన రోడ్డు ప్రమాదాల బాధితులకు నగదు రహిత చికిత్స అందించడానికి నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) సహకారంతో కేంద్ర రవాణా శాఖ చండీగఢ్, అస్సాంలలో పైలట్ ప్రాతిపదికన పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.ఈ పథకం కింద అర్హులైన బాధితులు ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి-జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద నమోదైన ఆసుపత్రులలో ట్రామా, పాలీట్రామా కేర్‌కు సంబంధించిన ఆరోగ్య ప్రయోజనాల ప్యాకేజీలను ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్టంగా 7 రోజుల కాలానికి గరిష్టంగా రూ. 1.5 లక్షలు పొందవచ్చు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు, ఎంప్యానెల్ ఆసుపత్రులు, రాష్ట్ర ఆరోగ్య సంస్థ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సమన్వయంతో ఎన్హెచ్ఏ ఈ పథకం అమలుకు బాధ్యత వహిస్తుంది. -
గాలొచ్చి బ్రిడ్జి కూలిందట
న్యూఢిల్లీ: ‘గాలి మరీ గట్టిగా వచ్చింది. అందుకే బ్రిడ్జి కడుతుండగానే కూలిపోయింది’ – కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రి నితిన్ గడ్కరీకి ఓ ఐఏఎస్ అధికారి ఇచ్చిన వివరణ ఇది. దాంతో విస్తుపోవడం ఆయన వంతైంది. ఈ విషయాన్ని సోమవారం ఓ సమావేశంలో మంత్రే స్వయంగా చెప్పుకొచ్చారు. బిహార్‌లోని సుల్తాన్‌గంజ్‌లో గంగా నదిపై కడుతున్న ఓ బ్రిడ్జిలో కొంత భాగం ఏప్రిల్ 29న కూలిపోయింది. దీనిపై సంబంధిత ఐఏఎస్ అధికారిని వివరణ కోరితే పెనుగాలే కారణమని తేలిగ్గా చెప్పేశారన్నారు మంత్రి. ‘‘ఎంత గట్టిగా వీచినా గాలికి బ్రిడ్జి ఎలా కూలుతుందో నాకింత వరకూ అర్థం కాలేదు. ఏకంగా రూ.1,710 కోట్లతో కడుతున్న బ్రిడ్జి కూలిందంటే నిర్మాణంలోనే లోపముందన్నమాటే’’ అని అభిప్రాయపడ్డారు. 3.12 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే దేశంలోనే అతి పొడవైందిగా నిలవనుంది. -
కొత్త వాహనంపై 5 శాతం రిబేటు
న్యూఢిల్లీ: స్క్రాపేజీ (తుక్కు) విధానం కింద పాత కార్లను వదిలించుకుని, కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి 5 శాతం రిబేటు లభిస్తుందని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ‘ఇలా కొత్త కారు కొనుగోలు చేసే వారికి ఆటోమొబైల్ కంపెనీలు దాదాపు 5 శాతం రిబేటు ఇస్తారు‘ అని ఆయన తెలిపారు. ‘స్క్రాపేజీ విధానంలో నాలుగు అంశాలు ఉన్నాయి. వాటిలో రిబేటు కూడా ఒకటి. దీనితో పాటు కాలుష్యం వెదజిమ్మే పాత వాహనాలపై హరిత పన్ను మొదలైనవి విధించడం, ఫిట్నెస్ టెస్టు, పొల్యూషన్ టెస్టు చేయించుకోవడం తప్పనిసరి చేయడం మొదలైనవి ఉన్నాయి. టెస్టింగ్ కోసం దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్లు అవసరం. వీటి ఏర్పాటుపై దృష్టి పెడుతున్నాం’ అని మంత్రి చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఇక స్క్రాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడంలో ప్రైవేట్ సంస్థలు, రాష్ట్రాల ప్రభుత్వాలనకు కేంద్రం తగు సహయా సహకారాలు అందిస్తుందని తెలిపారు. టెస్టుల్లో విఫలమైన వాహనాలను నడిపే వారికి భారీ జరిమానాలు విధించడంతో పాటు వాహనాన్ని జప్తు కూడా చేయొచ్చని పేర్కొన్నారు. ఆటోమొబైల్‌కు వరం.. స్క్రాపేజీ విధానం.. ఆటోమొబైల్ రంగానికి వరంగా మారుతుందని గడ్కరీ చెప్పారు. దీనితో అత్యంత లాభసాటి రంగంగా ఆటోమొబైల్ పరిశ్రమ ఎదగగలదని, భారీ స్థాయిలో ఉపాధి కల్పించగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ. 4.5 లక్షల కోట్లుగా ఉన్న దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ టర్నోవరు.. రాబోయే రోజుల్లో 30 శాతం పైగా వృద్ధి చెందగలదని.. దాదాపు రూ. 10 లక్షల కోట్లకు చేరగలదని గడ్కరీ వివరించారు. టర్నోవరులో రూ.1.45 లక్షల కోట్లుగా ఉన్న ఎగుమతులు.. రూ. 3 లక్షల కోట్లకు చేరగలదన్నారు. స్క్రాపేజీ పాలసీ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే తుక్కుగా మార్చిన వాహనాల నుంచి.. ఉక్కు, ప్లాస్టిక్, రబ్బరు, అల్యూమినియం వంటి ముడి సరుకు లభ్యత పెరుగుతుందని, దీనితో ఆటోమొబైల్ పరికరాల తయారీ ఖర్చులు 30–40 శాతం దాకా తగ్గగలదని గడ్కరీ చెప్పారు. -
లక్ష కి.మీ. పరిధిలో హరిత రహదార్లు:గడ్కారీ
10 లక్షల మందికి ఉపాధి న్యూఢిల్లీ: జాతీయ రహదారుల వెంట లక్ష కిలోమీటర్ల పరిధిలో మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కారీ శుక్రవారం పేర్కొన్నారు. నేషనల్ గ్రీన్ హైవేస్ మిషన్ కింద 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించనున్నట్లు, అంతేకాక రహదారుల పరిధిలోని గ్రామాల్లో ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించనున్నట్లు చెప్పారు. 1,500 కిలోమీటర్ల పరిధిలో ఈ మిషన్ కోసం తక్షణమే రూ.300 కోట్లను వెచ్చించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్టార్టప్‌ను గడ్కారీ ఆహ్వానించారు. 2019 లోగా రూ.5 లక్షల కోట్లను జాతీయ రహదారుల నిర్మాణానికి ఖర్చు చేయనున్నామని.. అందులో 1 శాతం రూ.5 వేల కోట్లను ‘పచ్చ పందిర్ల’ ఏర్పాటుకు కేటాయిస్తామన్నారు. ప్రస్తుతం ఒక కిలోమీటరు పరిధిలో మొక్కల పెంపకం ద్వారా 10 మంది ఉపాధి పొందవచ్చని, మొత్తం 1,500 కి.మీ. పరిధిలో 15,000 మందికి ఈ పథకంతో ఉపాధి లభిస్తుందని అన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో ఎనిమిది రాష్ట్రాలు ఈ పథకంలో పాల్గొంటున్నట్లు ఆయన చెప్పారు.