న్యూఢిల్లీ: కాలం చెల్లిన పాత వాహనాలను తుక్కుగా మార్చే (వాహన స్క్రాపేజీ) విధానానికి మద్దుతగా నిలవాలని ఆటోమొబైల్ పరిశ్రమ, భాగస్వాములు అందరికీ కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. ఇది అందరి విజయానికి దారితీసే విధానమని పేర్కొన్నారు. పరిశ్రమ భాగస్వాములతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. 15-20 ఏళ్ల జీవిత కాలం ముగిసిన వాహనాలను తొలగించి, కొత్త వాటి కొనుగోలును ప్రోత్సహించడమే ఈ విధానం లక్ష్యమని తెలిపారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన రహదారుల నిర్మాణం, వాహనాల విద్యుదీకరణ, వాహనాల ఫిట్‌నెస్ టెస్టింగ్‌ను తప్పనిసరి చేయడం తదితర చర్యలతో వాహనాలకు స్థిరమైన బలమైన డిమాండ్‌ను నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్టు గడ్కరీ పేర్కొన్నారు.
ఆటోమొబైల్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (ఓఈఎంలు) తయారీని పెంచుకోవడం ద్వారా ప్రపంచంలో అతిపెద్ద ఆటోపరిశ్రమగా అవతరించేందుకు కృషి చేయాలని కోరారు. వాహన స్కాప్రేజీతో పరిశ్రమే ఎక్కువ ప్రయోజనం పొందుతుందని గుర్తు చేశారు. కనుక మూడు స్తంభాలను నిర్మించేందుకు పరిశ్రమ ముందుకు రావాలన్నారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ కేంద్రాలు, వాహన తుక్కు కేంద్రాల ఏర్పాటుపై పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమను కోరారు. నూతన విధానంతో కలిగే ప్రయోజనాలపై పౌరుల్లో అవగాహన పెంచేందుకు తమ డీలర్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. వాహనాన్ని తుక్కుగా మార్చుకునేందుకు ముందుకు వచ్చే వినియోగదారులకు డిస్కౌంట్ ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment