నిరసనల మధ్య జైట్లీ ప్రసంగం
స్మృతి ఇరానీపై హక్కుల తీర్మానం కోసం విపక్షాల ఆందోళన
గందరగోళం మధ్యే బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన జైట్లీ
న్యూఢిల్లీ :బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున లోక్‌సభలో మునుపెన్నడూ లేని అసాధారణ పరిస్థితుల్లో.. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల మధ్య.. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బలవంతంగా ప్రసంగం ప్రారంభించాల్సి వచ్చింది. సోమవారం సభలో బడ్జెట్ ప్రసంగం చేయటానికి జైట్లీ లేచి నిలుచోగానే.. హెచ్‌సీయూలో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య విషయమై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటును తప్పుదోవ పట్టించారంటూ తాము ఇచ్చిన హక్కుల తీర్మానాల అంశాన్ని కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు లేవనెత్తారు. ఆ అంశం పరిశీలనలో ఉందని స్పీకర్ సుమిత్రామహాజన్ చెప్పినప్పటికీ.. వారు దానిని ప్రస్తావిస్తూనే ఉండటంతో గందరగోళం తలెత్తింది. బడ్జెట్ సమయంలో ప్రతిపక్షాలు చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడుధ్వజమెత్తారు.
మధ్యలో కూర్చుని ప్రసంగించిన జైట్లీ...
లేత నీలి రంగు కుర్తాపై, కొంత ముదురు నీలి రంగు జాకెట్ ధరించిన జైట్లీ.. గంటన్నరకు పైగా ప్రసంగం కొనసాగించారు. ఆయన 20 నిమిషాలు ప్రసంగించాక.. కూర్చుని ప్రసంగాన్ని కొనసాగించవచ్చని స్పీకర్ సూచించారు.
బడ్జెట్‌కు తొమ్మిది మూల స్తంభాలు...
భారతదేశాన్ని రూపాంతరీకరించాలన్న తమ అజెండాలో భాగంగా.. తొమ్మిది విభిన్న మూల స్తంభాలపై ఆధారపడి బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించినట్లు జైట్లీ వివరించారు. అవేమిటంటే... 1) వ్యవసాయం - రైతుల సంక్షేమం, 2) గ్రామీణ రంగం, 3) ఆరోగ్యపరిరక్షణ సహా సామాజిక రంగం, 4) విద్య - నైపుణ్యాలు - ఉపాధి కల్పన, 5) మౌలిక సదుపాయాలు - పెట్టుబడులు, 6) ఆర్థిక రంగ సంస్కరణలు, 7) పరిపాలన - వాణిజ్యం సులభతరం చేయటం, 8) ఆర్థిక క్రమశిక్షణ, 9) పన్ను సంస్కరణలు.
గ్రామీణ ఆదాయం, మౌలిక సదుపాయాలు
దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ సంక్షోభం అతి పెద్ద సవాలంటూ.. గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచటం, గ్రామీణ ఆదాయాన్ని పెంపొం దించటం కేంద్ర బడ్జెట్ లక్ష్యాలని జైట్లీ తెలిపారు. బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం అనే వర్గీకరణను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తొ లగించనున్నట్లు జైట్లీ తెలిపారు. ప్రభుత్వ వ్యయం లో రెవెన్యూ, పెట్టుబడి (కేపిటల్) వర్గీకరణపై మ రింత దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని వివరించారు. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రణాళిక, ప్రణాళికేతర అనే వర్గీకరణను తొలగిస్తామని.. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు ఒకే తరహాలో ఉండేలా రాష్ట్రాల ఆర్థిక శాఖలతో కలిసి పనిచేస్తామని జైట్లీ తెలిపారు.
రాహుల్ సూచనకు సరే..
♦ గత యూపీఏ ప్రభుత్వం ఆర్థికవ్యవస్థను పాడైపోయిన స్థితిలో తమకు అప్పగించిందని, ఎన్‌డీఏ ప్రభుత్వం దానిని సరిచేసిందని చెప్తూ జైట్లీ.. ఁకష్టీ చలానే వాలో నే జబ్ దీ పట్వార్ హమే.. ఇన్ హాలాత్ మే ఆతా హై దరియా పార్ కర్నా హమే* (ఓడ తెడ్డును మా చేతికి అందించినపుడు.. ఈ పరిస్థితుల్లో నదిని దాటటం ఎలాగో మాకు తెలుసు) అటూ ఉర్దూ కవితను ఉదహరించారు.
♦ ఒక సందర్భంలో తమను ఆకాశ (ఆస్మానీ) శక్తులు, రాజ్య (సుల్తానీ) శక్తులు ఇబ్బందులు పెట్టాయని జైట్లీ వ్యాఖ్యానించారు. అయితే దానిని వివరించలేదు.
♦ దళిత పారిశ్రామికవేత్తల గురించి జైట్లీ తన ప్రసంగంలో ప్రస్తావించినపుడు.. కాంగ్రెస్ సభ్యులు దళిత విద్యార్థి రోహిత్ వేముల అంశాన్ని లేవనెత్తటం వినిపించింది.
♦ బ్రెయిలీ పేపర్‌పై దిగుమతి సుంకాన్ని తొలగించాలంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సూచనలను తాను అంగీకరించినట్లు జైట్లీ పేర్కొన్నపుడు.. సభలోనే ఉన్న రాహుల్ నవ్వుతూ కనిపించారు.
బడ్జెట్ హైలైట్స్
⇔ ఎఫ్‌డీఐ పాలసీలో గణనీయమైన మార్పులు చేయటం ద్వారా సాధారణ బీమా కంపెనీల లిస్టింగ్‌కు, బ్యాంకింగ్ రంగంలో కీలక సంస్కరణలకు తెర తీయటం.
⇔ సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహకానికి పరంపరాగత్ కృషి వికాస్ యోజన
⇔ మొత్తం గ్రామీణ రంగానికి రూ.87,675 కోట్ల కేటాయింపు.
⇔ పంచాయతీలు, మున్సిపాలిటీలకు రూ.2.87 లక్షల కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్
⇔ మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ.38,500 కోట్లు
⇔ విద్య, ఆరోగ్యం, సామాజిక రంగానికి రూ.1,51,581 కోట్ల కేటాయింపు.
⇔ 2016-17లో ప్రధానమంత్రి జన ఔషధి కార్యక్రమం కింద 3000 స్టోర్ల ఏర్పాటు.
⇔ ఫైనాన్షియల్ కంపెనీల వివాదాల పరిష్కారానికి సమగ్ర నియమావళి.
⇔ ముద్ర యోజన కింద మంజూరీ లక్ష్యం రూ.1.8 లక్షల కోట్లకు పెంపు.
⇔ ఎన్‌హెచ్‌ఏఐ, ఐఆర్‌ఈడీఏ, నాబార్డ్‌ల ద్వారా రూ. 31,300 కోట్ల ఇన్ఫ్రా బాండ్లు
⇔ 2017 మార్చి నాటికి 3 లక్షల రేషన్ డిపోల్లో ఆటోమేషన్.
⇔ స్టార్టప్‌లకు అనుకూలమైన వాతావరణం కల్పించడానికి కంపెనీల చట్టం సవరణ.
⇔ ఏప్రిల్, 2016 నుంచి మార్చి 2019 మధ్య ఏర్పాటు చేసిన స్టార్టప్‌లకు మూడు నుంచి ఐదేళ్ల పాటు లాభాల్లో పూర్తి మినహాయింపు
⇔ సంవత్సరానికి రూ.10 లక్షలకు మించి డివిడెండ్ గనక తీసుకుంటే మొత్తం డివిడెండ్‌పై అదనంగా 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
⇔ రూ.2 లక్షలకు పైబడి ఏవైనా వస్తువులు, సేవలు కొన్నా... రూ.10 లక్షలకు పైబడిన లగ్జరీ కార్లు కొన్నా... అక్కడికక్కడే 1 శాతం టీడీఎస్
⇔ ఆప్షన్లపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ 0.017 నుంచి 0.05కు పెంపు
⇔ అన్ని సేవలపై రైతులు, వ్యవసాయ సంక్షేమం నిమిత్తం 0.5 శాతం సెస్సు
⇔ రూ.1000 మించిన రెడీమేడ్ గార్మెంట్లపై ఎక్సయిజు పన్ను 2 శాతానికి పెంపు
⇔ బీడీ మినహా పొగాకు ఉత్పత్తులపై ఎక్సయిజు సుంకం 15 శాతానికి పెంపు.
⇔ బ్లాక్‌మనీ వెల్లడికి 4 నెలల సమయం. ఆ బ్లాక్‌మనీపై 45% పన్ను, వడ్డీ.
⇔ బొగ్గు, లిగ్నైట్‌లపై క్లీన్ ఎనర్జీ సెస్ టన్నుకు 200 నుంచి రూ. 400కు పెంపు.
⇔ 2017-18 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం జీడీపీలో 3 శాతం
⇔ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ కోసం రూ. 25 వేల కోట్లు