లోక్‌సభలో జీఎస్టీ బిల్లు
► ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి జైట్లీ
► గరిష్టంగా 40 శాతం జీఎస్టీ ఉంటుందని స్పష్టీకరణ
► ఎజెండాలో లేకుండానే ప్రవేశపెట్టడంపై విపక్షాల ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశంలో పన్ను సంస్కరణలకు చరిత్రాత్మక ముందడుగుగా భావిస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)కి సంబంధించిన నాలుగు బిల్లులను కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ), కేంద్రపాలితప్రాంతాల జీఎస్టీ (యూజీఎస్టీ), పరిహార బిల్లులను ప్రవేశపెట్టారు. జూలై 1 నుంచి జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తేవాలని భావిస్తున్న కేంద్రం.. ఈ బిల్లు ద్వారా భారత ఆర్థికాభివృద్ధి 2శాతం పెరుగుతుందని వెల్లడించింది.
కాగా, ఈ బిల్లులను ప్రవేశపెట్టడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. రోజువారీ కార్యక్రమాల ఎజెండాలో జీఎస్టీని చేర్చకుండా.. పార్లమెంటు నియమాలకు విరుద్ధంగా హఠాత్తుగా ప్రకటన చేయటం సరికాదన్నాయి. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ఎస్‌ఎస్ అహ్లువాలియా స్పందిస్తూ.. శుక్రవారం అర్ధరాత్రే వీటిని లోక్‌సభ వెబ్‌సైట్‌లో చేర్చినట్లు తెలిపారు.
అయితే గతవారం బీఏసీ సమావేశంలో దీన్ని చర్చించలేదని.. దీనికి తోడు అర్ధరాత్రి సభ్యులు ఇంటర్నెట్ చెక్ చేసుకోవాలా అని విపక్ష సభ్యులు ప్రశ్నిం చారు. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ, టీఎంసీ సౌగతరాయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిలో ఉన్నారు. అయితే, శనివారం ఉదయమే సభ్యులకు బిల్లులను పంపించారని ఇందులో ఏవిధమైన పొరపాటూ జరగలేదని స్పీకర్ సుమిత్ర మహాజన్ స్పష్టం చేశారు. ఈ జీఎస్టీ బిల్లులకు కేంద్ర, అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులు, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
పరిహారం ఇలా!
జైట్లీ ప్రవేశపెట్టిన వాటిలో రాష్ట్రాలకు పరిహారానికి సంబంధించిన బిల్లు కూడా ఉంది. జీఎస్టీ అమల్లో రాష్ట్రాలకు ఏమైనా నష్టాలొస్తే వాటిని కేంద్రం ఈ బిల్లు ద్వారా (తొలి ఐదేళ్లు మాత్రమే) చెల్లిస్తుంది. అయితే ఐదేళ్ల తర్వాత కేంద్రానికి ఈ బిల్లు రూపంలో భారీ మొత్తంలో ఆదాయం లభించనుంది. దీని ప్రకారం పరిహార నిధిని ఏర్పాటుచేస్తారు. ఆరోగ్యానికి హాని కలిగించే (పొగాకు ఉత్పత్తుల వంటివి), లగ్జరీ వస్తువులపై విధించే సెస్సు ద్వారా నిధిని సమకూర్చి రాష్ట్రాలకు పరిహారమిస్తారు. ఇది ఆయా వస్తువులపై జీఎస్టీకి అదనంగా గరిష్టంగా 18 శాతం ఉండాలని నిర్ణయించారు.