'అరుణ్ జైట్లీ హనుమంతుడి లాంటివారు'
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు నరేష్ అగర్వాల్ రామాయణంలో హనుమంతుడితో పోల్చారు. రాజ్యసభ అధికారాలు తరిగిపోకుండా చూడాలని ఆయనను కోరారు. రాజ్యసభలో జీఎస్టీ సంబంధిత బిల్లులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దీన్ని ఆర్థికబిల్లుగా ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. దానివల్ల రాజ్యసభ సూచించిన మార్పులను తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా చేయడం ద్వారా రాజ్యసభను పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా పోతోందన్నది విపక్షాల వాదన. ప్రభుత్వానికి లోక్‌సభలో భారీ మెజారిటీ ఉంది గానీ రాజ్యసభలో లేదు.
ఈ అంశాన్నే నరేష్ అగర్వాల్ సభలో ప్రస్తావించారు. ''మీరు ఈ బిల్లును ఆర్థిక బిల్లుగా ప్రవేశపెట్టారు. దానికి మేమంతా అభ్యంతరం చెబుతున్నాం. హనుమంతుడికి అతడి శక్తి గురించి ఇతరులు చెబితేనే లేచాడు. అరుణ్ జైట్లీ కూడా హనుమంతుడి లాంటివారే. ఆయన సభా నాయకుడు, రాజ్యాంగ నిపుణుడు కూడా. మీరే మా హక్కులను కాలరాస్తే ఎలా'' అని ఆయన అన్నారు. ముఖ్యమైన చట్టాల విషయంలో రాజ్యసభకు కావాలనే తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ చెప్పారు. రాజ్యసభ సభ్యులకు ఏమాత్రం అభిమానం మిగిలి ఉన్నా వాళ్లంతా రాజీనామా చేయాలని వీరప్ప మొయిలీ అన్నారు.
అయితే.. పన్నులకు సంబంధించిన చట్టాలన్నీ ఆర్థిక వ్యవహారాలే కాబట్టి జీఎస్టీ బిల్లులను ఆర్థిక బిల్లులుగా ప్రవేశపెట్టడంలో తప్పేమీ లేదని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమర్థించుకున్నారు. ప్రజల తీర్పు లోక్‌సభలోనే కనిపిస్తుందని చెప్పారు. అయితే, లోక్‌సభ ఎన్నికైన ప్రజాప్రతినిధులదైదే రాజ్యసభ భిక్షగాళ్లదా అంటూ మంత్రి వ్యాఖ్యలను నరేష్ అగర్వాల్ తీవ్రంగా తప్పుబట్టారు. అసలు ఈ వివక్ష ఎందుకు చూపుతున్నారో అర్థం కావట్లేదన్నారు.