రాజ్యసభలో సమాధానమిస్తున్న కేంద్ర ఆర్ధిక మంత్రి జైట్లీ
ఢిల్లీ: ప్రభుత్వ పథకాల రూపంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 62.168 వేల కోట్లు 2014 నుంచి 2019 సంవత్సవరం ఫిబ్రవరి 2 మధ్య కాలంలో కేంద్రం నుంచి విడుదల చేశామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం రాజ్యసభలో తెలిపారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి అరుణ్ జైట్లీ ఈ జవాబిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ఆర్ధిక చర్యల్లో(ప్రత్యేక ప్యాకేజీ) భాగంగా ఈ ప్రాయోజిత పథకాల అమలులో కేంద్ర వాటా 90 శాతం, రాష్ట్ర వాటా 10 శాతం ఉంటుందని చెప్పారు. 2015-16 నుంచి 2019-20 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకునే ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు(ఈఏపీ)ల కోసం తీసుకునే రుణాలు, వాటిపై వడ్డీని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
2015-16 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఈఏపీ ఒప్పందాలకు సంబంధించి రూ.15.81 కోట్ల వడ్డీని చెల్లించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు నిధులను విడుదల చేసినట్లు చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీని ఆమోదిస్తూ కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు 2017 మే 2న తమకు లేఖ రాశారని మంత్రి జైట్లీ వెల్లడించారు. అలాగే విడుదల చేసిన నిధుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి యుటిలైజేషన్ సర్టిఫికేట్లు వచ్చిన వెంటనే విడతల వారీగా తదుపరి నిధులను విడుదల చేస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment