నేడే లోక్‌సభకు జీఎస్టీ బిల్లులు
మార్చి 29 లోగా ఆమోదం కోసం కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: జూలై 1 నుంచి జీఎస్టీ(వస్తు, సేవల పన్ను) చట్టాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఆ మేరకు జీఎస్టీ అనుబంధ బిల్లులు నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. సీజీఎస్టీ (కేంద్ర జీఎస్టీ), ఐజీఎస్టీ(సమీకృత జీఎస్టీ), యూటీ జీఎస్టీ(కేంద్ర పాలిత ప్రాంత జీఎస్టీ), రాష్ట్రాలకు పరిహార చట్టాలను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టి మార్చి 28లోపు చర్చ ముగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఎక్సైజ్, కస్టమ్స్ చట్టంలోని వివిధ పన్నుల రద్దు కోసం సవరణలు, జీఎస్టీ అమలు నేపథ్యంలో ఎగుమతులు దిగుమతుల కోసం ఉద్దేశించిన బిల్లుల్ని కూడా సభలో ప్రవేశపెడతారని సమాచారం. బిల్లులపై ఎంత సమయం చర్చించాలన్న అంశంపై సోమవారం ఉదయం లోక్‌సభ బీఏసీ సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని కొన్ని వర్గాలు వెల్లడించాయి. మార్చి 29 లేదా 30 లోగా లోక్‌సభలో జీఎస్టీ బిల్లుల్ని ఆమోదింపచేసి అనంతరం రాజ్యసభకు పంపనున్నారు. ఒకవేళ బిల్లులకు రాజ్యసభలో ఏవైనా సవరణలు సూచిస్తే వాటిపై లోక్‌సభలో చర్చిస్తారు. ఆ సవరణల్ని లోక్‌సభ ఆమోదించవచ్చు లేదంటే తిరస్కరించవచ్చు. జీఎస్టీ బిల్లుల్ని ద్రవ్య బిల్లులుగా ప్రవేశపెడుతున్నందున రాజ్యసభ ఆమోదం అవసరం లేకపోయినా.. ఇరు సభల్లో చర్చ జరగాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందాక.. ఎస్జీఎస్టీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాల్సి ఉంది.
జీఎస్టీ నెట్‌వర్క్ వివరాలు వెల్లడించలేం: కేంద్ర హోం శాఖ
జీఎస్టీ అమలు కోసం సిద్ధం చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్‌వర్క్(జీఎస్టీఎన్) భద్రతా అనుమతుల వివరాలు వెల్లడించా లన్న ఆర్టీఐ దరఖాస్తును కేంద్ర హోం శాఖ తిరస్కరించింది. దరఖాస్తుదారుడు కోరిన అంశం జాతీయ భద్రతా అనుమతులకు సంబంధించిందని, ఆర్టీఐ చట్టం 2005, సెక్షన్ 8(1)(జీ) ప్రకారం వాటికి మినహాయింపు ఉండడంతో ఆ వివరాలు వెల్లడించలేమని హోం శాఖ సమాధానమిచ్చింది.