ప్లాస్టిక్ నోట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ
ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండేలా 10 రూపాయల ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా ముద్రించి, వాటిని క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు రిజర్వు బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. దేశంలోని ఐదు ప్రాంతాల్లో ప్లాస్టిక్ నోట్లతో క్షేత్రస్థాయిలో ప్రయోగాలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన ఆ సమాధానంలో చెప్పారు. ప్లాస్టిక్ మిశ్రమాల సేకరణ, వాటిపై రూ. 10 నోట్ల ముద్రణ లాంటి విషయంలో అన్ని అనుమతులను రిజర్వు బ్యాంకుకు ఇచ్చినట్లు వివరించారు.
ప్రస్తుతం వాడుతున్న కాగితపు నోట్ల కంటే ప్లాస్టిక్ నోట్లయితే ఎక్కువ కాలం మన్నుతాయని అంచనా వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు రిజర్వు బ్యాంకులు ప్రస్తుతమున్న నోట్లకు ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్, ఇతర పదార్థాలతో చేసిన నోట్ల గురించి ప్రయత్నాలు చేస్తున్నాయి. తద్వారా నోట్ల జీవితకాలం పెంచాలన్నది వాటి లక్ష్యం.