నాణ్యతలేని సరుకుల పంపిణీపై మంత్రి సీతక్క సీరియస్
సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే సరుకుల్లో నాణ్యత పట్ల కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో తెలంగాణ ఫుడ్స్ విభాగంపై ఆమె సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఫుడ్స్‌కు సరఫరా చేస్తున్న సరుకుల్లో నాణ్యత లేదంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఫుడ్స్‌కు సరఫరా చేస్తున్న పప్పు, నూనె తదితరాల సరఫరాకు నామినేటెడ్ పద్ధతిలో కాంట్రాక్టర్లను ఎంపిక చేయడంపైనా మంత్రి మండిపడ్డారు.
ప్రతి అంశాన్ని టెండర్ ప్రాతిపదికనే చేపట్టాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినప్పటికీ వైఖరి మార్చుకోకపోవడాన్ని తప్పుబడుతూ సంబంధిత అధికారులను మంత్రి సీతక్క మందలించారు. అదేవిధంగా టీజీఫుడ్స్ విభాగంలో కారుణ్య నియామకాలు, పదోన్నతుల విషయంలోనూ అవకతవకలు జరిగాయనే అంశం తన దృష్టికి వచ్చిందన్నారు.
ఇటీవల భువనగిరిలో బాలామృతం దారి మళ్లింపు ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అనంతరం మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫాం చీరలకు సంబంధించి డిజైన్లను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మంది సభ్యులకు ఈ చీరలు ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రాంచంద్రన్, కమిషనర్ కాంతివెస్లీ తదితరులు పాల్గొన్నారు.
హామీలను అమలు చేయండి..
తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సచివాలయంలో వారు మంత్రి సీతక్కను కలిశారు. అంగన్‌వాడీ టీచర్ల వేతనాలను రూ.18 వేలకు పెంచాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్ అమలు చేయాలని కోరారు.
మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అభివృద్ధి చేసినప్పటికీ ఆ మేరకు వేతనాలు చెల్లించలేదని, దాదాపు ఏడు నెలల బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచి్చనట్లు యూనియన్ ప్రతినిధులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment