![Consumer Goods Companies Gear Up for Mega Summer Splash](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/summer01.jpg.webp?itok=LOnLmgpW)
మెగా మార్కెటింగ్‌కు ఎఫ్‌ఎంసీజీ సంస్థలు సిద్ధం
ఐపీఎల్‌లో కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ
వేసవి కాలం సమీపిస్తుండటంతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించి అమ్మకాలను పెంచుకునేందుకు కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలు మెగా మార్కెటింగ్‌కు సిద్ధమవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఐపీఎల్ వంటి ప్రధాన ఈవెంట్లు, వేసవి సెలవులు ప్రారంభంకానుండడంతో అధిక డిమాండ్ నెలకొంటుందని సంస్థలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వివిధ విభాగాలకు చెందిన కంపెనీలు కొత్త బ్రాండ్ల ఆవిష్కరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
ప్రధాన ఈవెంట్లు..
వేసవిలో వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వంటి ముఖ్యమైన ఈవెంట్లను సద్వినియోగం చేసుకోవడం కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల కీలక వ్యూహాల్లో ఒకటి. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి, ప్రేక్షకుల ఆదరణ పొందేందుకు ఐపీఎల్ భారీ వేదిక కానుంది. కోకాకోలా, హావ్‌మోర్ ఐస్‌క్రీమ్, రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్.. వంటి సంస్థలు ప్రమోషన్ క్యాంపెయిన్స్ సిద్ధం చేస్తూ ఐపీఎల్ సీజన్ కోసం ప్రత్యేకంగా ప్రీమియం ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయి. చాలా కంపెనీలు తమ బ్రాండ్ సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీములు, రిఫ్రెషింగ్ స్నాక్స్ వంటి ప్రత్యేకమైన ఉత్పత్తులపై దృష్టి పెడుతున్నాయి. ఉదాహరణకు, హావ్‌మోర్ ఐస్ క్రీమ్ ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా ప్రీమియం ప్యాక్‌లను ప్రవేశపెడుతోంది. వేసవి సీజన్‌ను అదనుగా తీసుకొని రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ తన స్పోర్ట్స్ డ్రింక్స్‌ను ప్రమోట్ చేసుకునేందుకు ఐపీఎల్ జట్లలో రైట్స్ దక్కించుకుంది.
ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌కు రూ.6,000 కోట్లు.. కేబినెట్ ఆమోదం
పెరిగిన ప్రకటన వ్యయాలు
వేసవి నెలల్లో ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ఉత్పత్తుల వినియోగం అధికమవడంతోపాటు అందుకు అనుగుణంగా ప్రకటన వ్యయాలు సైతం గణనీయంగా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. తమ ఉత్పత్తులు పెద్దమొత్తంలో ప్రేక్షకులను చేరుకోవడానికి టెలివిజన్, డిజిటల్ ప్రకటనలు రెండింటిలోనూ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ సీజన్‌లో ఐపీఎల్ కోసం టెలివిజన్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి మొత్తం యాడ్ రెవెన్యూ రూ.4,500 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇది గతేడాది కంటే 8-10 శాతం అధికం. కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ప్రచారాలు ప్రత్యేకంగా, సృజనాత్మకంగా ఉండాలని కోరుకుంటున్నాయి. ఉదాహరణకు, కోకాకోలా అమ్మకాలను పెంచడానికి డొమినోస్ స్టోర్లలో క్రాస్ ప్రమోషన్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment